75% స్ట్రైక్ రేట్... ఎవరీ యంగ్ గన్!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించే దిశగా ఫలితాలు వెలువడుతోన్న నేపథ్యంలో.. నితీశ్ - మోడీ (నిమో) సూపర్ పెర్ఫార్మెన్స్ గురించిన చర్చతో పాటు మరో యంగ్ లీడర్ గురించిన చర్చ ఆసక్తిగా మారింది. ఆయనే... లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్. 2020లో.. అప్పటి ఎల్‌జెపి, జెడియు చీఫ్ నితీష్ కుమార్ తో విభేదాల కారణంగా స్వతంత్రంగా పోటీ చేసి.. పోటీ చేసిన 130 సీట్లలో ఒకదాన్ని మాత్రమే గెలుచుకున్న ఈ పార్టీ ఈ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటుతోంది!
గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ విజయం సాధించిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్).. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 29 స్థానాల్లోనూ 22 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇలా సుమారు 75% స్ట్రైక్ రేట్ తో దూసుకుపోతుండటంతో.. యంగ్ లీడర్ చిరాగ్ పాస్వాన్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.
వాస్తవానికి బీహార్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేతగా పరిగణించబడే తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఆకర్షణ, రాజకీయ చతురత చిరాగ్ కు లేదని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ 43 సంవత్సరాల వయస్సులో చిరాగ్ తనను తాను యువ నాయకుడిగా నిలబెట్టుకున్నారు!