ట్రంప్.. నువ్వేమైనా రాజువా..? 3 నెలల్లో రెండోసారి వీధుల్లోకి ప్రజలు
సరిగ్గా మూడు నెలల కిందట మొదలైంది ట్రంప్ 2.O.. ఈ కాలంలో ప్రపంచమంతా వణికిపోతోంది.. అమెరికా మాత్రం భగ్గుమంటోంది.;
సరిగ్గా మూడు నెలల కిందట మొదలైంది ట్రంప్ 2.O.. ఈ కాలంలో ప్రపంచమంతా వణికిపోతోంది.. అమెరికా మాత్రం భగ్గుమంటోంది. స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇచ్చే అమెరికన్లు మళ్లీ వీధుల్లోకి వచ్చారు.. గత నెలలో ఇలానే ఒకసారి ఆర్థిక రాజధాని న్యూయార్క్ నుంచి ఆ చివరన ఉండే అలాస్కా వరకు అమెరికన్లు ట్రంప్ నకు వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. మళ్లీ అదే తీరున నిరసనలు చేపట్టారు.
చీటికీమాటికీ టారిఫ్ లు.. అదే పనిగా తీవ్ర వ్యాఖ్యలు.. ప్రత్యర్థులపై ఆగ్రహం.. వివిధ దేశాలతో తగాదాలు.. ఇదీ ట్రంప్ మూడు నెలల పాలన.. ఏదో దేశాన్ని ఉద్ధరిస్తాడని అనుకుని మళ్లీ పట్టం కడితే ట్రంప్ గొడవలు తేవడం తప్ప చేసిందేమీ లేదనే అభిప్రాయంతో ఉన్నారు అమెరికన్లు.
మరో హ్యాండ్సాఫ్..
ఇటీవల ట్రంప్ నకు వ్యతిరేకంగా అమెరికన్లు చేపట్టిన నిరసనల్లో
‘హ్యాండ్సాఫ్’ అంటూ నినదించారు. ఒకవిధంగా చెప్పాలంటే అమెరికాలో రిపబ్లికన్ల పాలనలో జరిగిన అతి పెద్ద నిరసన ఇదే అంటారు. ఇప్పుడు మరో హ్యాండ్సాఫ్ కు దిగారు ప్రజలు. అప్పటిలాగానే వీధుల్లోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ట్రంప్ నకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
ఇప్పుడు రాజులు ఎవరూ లేరు..
ట్రంప్ నకు వ్యతిరేకంగా కొంతకాలం కిందట హ్యాండ్సాఫ్ అంటూ నినదించిన అమెరికన్లు ఇప్పుడు ’అమెరికా రాజులు ఎవరూ లేరు’ అంటూ న్యూయార్క్ సెంట్రల్ లైబ్రరీ ఎదుట గుమిగూడారు. అంతేకాదు.. ’ఈ దౌర్జన్యాన్ని ఎదిరించండి’ అంటూ నినాదాలు చేశారు. కాగా, వీరి ఆగ్రహానికి కారణం.. తాత్కాలిక వలసదారుల చట్టపరమైన నివాస హోదాను రద్దు చేయడం, బహిష్కరించడమే.
వలసదారులారా స్వాగతం
టంప్-2లో ప్రధాన నిర్ణయం వలసదారుల ఏరివేత. తాజా ఆందోళనల్లో ప్రజలు మాత్రం.. ‘‘భయం లేదు.. వలసదారులారా
స్వాగతం’’ అంటూ నినాదాలు చేస్తుండడం గమనార్హం. ట్రంప్ పాలన రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని.. దీనిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, విద్యార్థులకు ఇచ్చే ఎఫ్-1 వీసా గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోయాడు పాలస్తీనాకు చెందిన లెకా కోర్డియా. దీంతో అతడిని అరెస్టు చేశారు. మరో పాలస్తీనా విద్యార్థిని కూడా అరెస్టయ్యారు. వీరిని విడుదల చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.