శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం.. మీ చేతుల్లోనే ఉంది

తిరుమల శ్రీవారి దర్శనం.. అందునా వీఐపీ బ్రేక్ దర్శనం అంటే మాటలా? కచ్చితంగా ఏదైనా బలమైన సిఫార్సు లేఖ ఉండాల్సిందే. అది కాదంటే బోలెడన్ని డబ్బులు ఉంటే కూడా సాధ్యమే. కానీ.. ఈ రెండింటితో పని లేకుండా కూడా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం సాధ్యమే.;

Update: 2025-05-13 05:55 GMT

తిరుమల శ్రీవారి దర్శనం.. అందునా వీఐపీ బ్రేక్ దర్శనం అంటే మాటలా? కచ్చితంగా ఏదైనా బలమైన సిఫార్సు లేఖ ఉండాల్సిందే. అది కాదంటే బోలెడన్ని డబ్బులు ఉంటే కూడా సాధ్యమే. కానీ.. ఈ రెండింటితో పని లేకుండా కూడా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం సాధ్యమే. కాకుంటే దానికి కాస్తంత ఓర్పు.. శ్రద్ధ.. శ్రీవారి మీద అచంచలమైన భక్తి అవసరం. అవును.. తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అద్భుతమైన ఆఫర్ పెట్టింది. సామాన్యులు మొదలు ఎవరైనా సరే.. శ్రీవారి గోవింద నామాల్ని 10,01,116 సార్లు రాస్తే.. వారికి.. వారి కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకు ఈ ఆఫర్ ను కేవలం ముగ్గురు మాత్రమే వినియోగించుకున్నారు. ఎందుకుంటే.. పది లక్షలకు పైచిలుకు గోవింద నామాలు రాయాలంటే దాదాపు మూడేళ్ల సమయం తీసుకుంటుంది.. అంతటి కష్టం తర్వాతే.. శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం సింఫుల్ గా దొరికేస్తుంది. ఇందుకోసం టీటీడీ సమాచార కేంద్రాలు.. పుస్తక విక్రయ కేంద్రాల్లో కానీ ఆన్ లైన్ లో కానీ గోవింద కోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఒక పుస్తకంలో 200 పేజీలు ఉంటాయి. అందులో 39,600 నామాలు రాసే వీలు ఉంటుంది.

టీటీడీ పెట్టిన 10,01,116నామాలు రాసేందుకు 26 పుస్తకాలు అవసరమవుతాయి. ఈ పుస్తకాల్ని పూర్తి చేయాలంటే కనీసం మూడేళ్ల సమయం పడుతుంది. ఇన్నేళ్లు కమిట్ మెంట్ తో వ్యవహరిస్తేనే పది లక్షల పైచిలుకు గోవింద నామాల్ని పూర్తి చేసే వీలు ఉంటుంది. ఇలా పూరతి చేసిన పుస్తకాల్ని తీసుకొని తిరుమల లోని టీటీడీ పేష్కార్ ఆఫీసులో అందిస్తే.. వారికి తర్వాతి రోజు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తారు. అయితే.. ఇక్కడో నియమం ఉంది. పాతికేళ్లు.. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారికి మాత్రమే ఈఆఫర్ ఉంది.

గోవింద నామాల పుస్తకాల్ని రాసిన వారికి మాత్రమే కాదు.. వారి కుటుంబానికి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పిస్తారు. ఇందులో శ్రీవారిని మరింత దగ్గరగా చూసుకునే వీలు ఉంటుంది. ఈ ఆఫర్ ను మొదటగా పూర్తి చేసిన ఘనత కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరుకు చెందిన కీర్తన గత ఏడాది ఏప్రిల్ లో దీన్ని పూర్తి చేశారు. ఇంటర్ పూర్తి చేసిన ఆమెకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాన్ని కల్పించింది. మరిక ఆలస్యం ఎందుకు? మీరు కూడా మొదలు పెట్టేయండి.

Tags:    

Similar News