లోక్ సభకు 2027లో మధ్యంతరం ?
లోక్ సభ కాల పరిమితి 2029 జూన్ వరకూ ఉంది. ఎందుకంటే 2024 జూన్ 9న నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి ప్రమాణం చేసింది.;
లోక్ సభ కాల పరిమితి 2029 జూన్ వరకూ ఉంది. ఎందుకంటే 2024 జూన్ 9న నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ముచ్చటగా మూడోసారి ప్రమాణం చేసింది. అలా చూసుకుంటే ఇంకా బిగిసి నాలుగేళ్ళ పైనే ఈ రోజుకు ఉంది.
అయితే దేశంలో జమిలి ఎన్నికలు అంటూ చర్చలు సాగుతున్నాయి. ఏపీలో విపక్ష వైసీపీ అయితే మూడేళ్ళలో తాము అధికారంలోకి వస్తామని అంటోంది దాని అర్ధం పరమార్ధం జమిలి ఎన్నికల మీద ఆశలే అని అంటున్నారు.
అయితే జమిలి ఎన్నికలు ఈ దేశంలో జరపడం అంత సులువు కాదు. ఏకంగా ఒకటి రెండూ కాదు అయిదు కీలక అంశాలలో రాజ్యాంగ సవరణలు జరపాలి. అది జరగాలీ అంటే లోక్ సభలో రాజ్యసభలోని మొత్తం సభ్యులలో మూడింట రెండు వంతుల మంది మద్దతుగా నిలవాలి.
అది అయ్యే పనేలా అంటే ప్రస్తుతం లోక్ సభలోనే బీజేపీకి సొంతంగా మెజారిటీ లేదు. మిత్రుల మద్దతుతో బొటాబొటీగా సంఖ్యాబలం ఉంది. రాజ్యసభలోనూ సగం కంటే ఒకటి రెండు నంబర్లే ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటు లోక్ సభతో పాటు దేశంలోని 28 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలు ఒకేసారి అంటే అది చాలా క్లిష్టమైన వ్యవహారం అని అంటున్నారు.
అన్నింటికంటే ముందు ఒక అసెంబ్లీలో మెజారిటీ లేకనో మరో విధంగానో ప్రభుత్వం నిర్ణీత కాల వ్యవధి కంటే ముందే కూలిపోతే ఆ అసెంబ్లీని ఏమి చేస్తారు అన్నది మాత్రం అతి పెద్ద ప్రశ్న. మధ్యలో ఎన్నికలు అంటే జమిలి గొలుసు నుంచి ఆ రాష్ట్రం తప్పించుకున్నట్లే. అలాగే లోక్ సభలో కూడా మెజారిటీలు లేక కూలిన ప్రభుత్వాలు అనేకం ఉన్నాయి. ప్రజా మద్దతుతో ప్రభుత్వాలు ఏర్పాటు కానపుడు ప్రజల అభీష్టం మేరకు కొలువు తీరలేక పడిపోయినపుడు మళ్ళీ ఆ ప్రజల దగ్గరకే వెళ్ళి తీర్పు కోరాలి. ఇది ప్రజాస్వామ్యంలో ప్రాణ సమానమైన సూత్రం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభువులు.
ఇక్కడ ఎన్ని సార్లు ఎన్నికలు జరిగాయి ఎంత సమయం ఎంత ధనం వృధా అయింది అన్నది ప్రశ్న కాదు. ప్రజల మద్దతు వారు తీర్పు ఒక ప్రభుత్వానికి ఉందా లేదా అన్నదే మౌలిక సూత్రం. అలా చూసుకుంటే జమిలి ఎన్నికలు అన్నవి ఈ దేశంలో జరగడం అసంభవం అని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు దాంతో కేంద్రంలో బీజేపీ కూడా మరో మార్గాన్ని ఆలోచిస్తోంది అని అంటున్నారు.
బీజేపీకి మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం ముఖ్యం. దానికి ఉత్తరప్రదేశ్ అన్నది అతి ముఖ్యమైన రాజకీయ మెట్టు. అక్కడ మొత్తం 80 ఎంపీ సీట్లు ఉన్నాయి. అయితే బీజేపీకి 2014, 2019లల్లో ఆదరించిన యూపీ 2024లో దెబ్బ కొట్టింది. దాంతో బీజేపీ బలం కాస్తా 34కి దిగిపోయింది. ఇక 2017న భారీ మెజారిటీలో యూపీ అసెంబ్లీలో బీజేపీ గెలిచింది. 2022 నాటికి ఆ బలంలో పావు వంతు పోయింది. 2027లో జరిగే ఎన్నికల్లో మూడవసారి బీజేపీ యూపీలో గెలిచి ప్రభుత్వాన్ని స్థాపిస్తుందా లేదా అన్నది అతి పెద్ద సందేహంగా ఉందిట.
పైగా సమాజ్ వాది పార్టీ బాగా పుంజుకుంది. కాంగ్రెస్ కూడా బలపడుతోంది. బీఎస్పీ రూపంలో ఓట్ల చీలిక కూడా లేకుండా పోతోంది. ఆ పార్టీ క్షీణత కాంగ్రెస్ కి లాభిస్తోంది. దాంతో రెండు టెర్ములు అధికారంలో ఉన్న బీజేపీకి యాంటీ ఇంకెంబెన్సీ పెద్ద ఎత్తున ఉండొచ్చు అని ఫలితాలు తారు మారు కావచ్చు అన్నది ఒక చర్చ. అదే కనుక జరిగితే బీజేపీకి 2029 కేంద్రంలో అధికారం అనే ఆశలు అడుగంటుతాయి. అందుకే బీజేపీ యూపీని దృష్టిలో పెట్టుకునే జమిలి జపం చేస్తోంది.
యూపీలో 2027 మధ్యలో జరిగే ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా అసెంబ్లీలకు ఎన్నికలు జరిపించడం అసంభవం అని తేలిపోతున్న నేపథ్యంలో మినీ జమిలి ఎన్నికలు అన్న ప్రతిపాదనను సీరియస్ గా పరిగణిస్తోంది అని అంటున్నారు. అంటే యూపీ ఎన్నికలకు ఆరు నెలలు ఏడాది అటూ ఇటూ ఉన్న అసెంబ్లీలను కలుపుకుని ఎన్నికలు పెట్టడం అన్న మాట. అలా చూస్తే వచ్చే ఏ పశ్చిమ బెంగాల్, తమిళనాడులకు 2026 మధ్యలో ఎన్నికలు ఉన్నాయి.
అలాగే 2028 మొదటి భాగంలో కర్ణాటక మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ వంటి చోట్ల ఎన్నికలు ఉన్నాయని అంటున్నారు. ఇంకా చూస్తే ఏడాదిలో తెలంగాణాకు ఎన్నికలు ఉన్నాయి. ఇలా వీలైనన్ని రాష్ట్రాలను అటూ ఇటూ కలిపేసి కనీసం పదికి తగ్గకుండా అసెంబ్లీలతో పాటు లోక్ సభ ఎన్నికలను ముందుకు తెచ్చి మధ్యంతరానికి బీజేపీ నాయకత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది అన్న చర్చ మొదలైంది.
అంటే అన్నీ అనుకూలిస్తే 2027 నవంబర్ లో కేంద్రంతో పాటు వివిధ రాష్ట్రాల్లో మిని జమిలి ఎన్నికలు పెట్టడానికి బీజేపీ సిద్ధపడుతోందని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ అయితే ఉందిట. మరి అదే నిజమైతే మాత్రం లోక్ సభ ఎన్నికలకు రెండున్నరేళ్ళు మించి సమయం లేదనే అనుకోవాలి. బీజేపీ పూర్తి మెజారిటీతో మరోసారి అధికారంలోకి రావాలని అనుకుంటోంది. సో బీజేపీ 2029 దాకా ఆగేది లేదనే అంటున్నారు. సో చూడాలి మరి ఏమి జరుగుతుందో.