రోడ్డు మీద మహిళపై రాడ్డుతో దాడి.. ‘తెనాలి’లో షాకింగ్ సీన్
అమ్మాయి కావొచ్చు.. మహిళ కావొచ్చు. ఒకసారి వారు ‘నో’ చెబితే నో అని మాత్రమే. దానికి మరే ముచ్చట లేదు.;
అమ్మాయి కావొచ్చు.. మహిళ కావొచ్చు. ఒకసారి వారు ‘నో’ చెబితే నో అని మాత్రమే. దానికి మరే ముచ్చట లేదు. ఈ విషయాన్ని పట్టించుకోకుండా.. మహిళల విషయంలో చులకన భావం ఎక్కువగా ఉండే కొందరి తీరు ఎంత అభ్యంతరకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఇలాంటి తీరు అంతకంతకూ పెరిగి.. హద్దులు దాటేస్తుంటాయి.తాజాగా అలాంటి ఉదంతమే తెనాలి మండలంలో చోటు చేసుకుంది.
తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కు అత్యంత సన్నిహితంగా తిరిగేవాడు సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు. తాజాగా రాడ్డుతో మహిళ మీద దాడి చేసిన వైనం సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం కోపల్లె గ్రామానికి చెందిన 33 ఏళ్ల మహిళతో పవన్ కుమార్ ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవాడు. అయితే.. అతని తీరు నచ్చని ఆమె అతనితో కొద్ది రోజులుగా మాట్లాడటం మానేసింది,
తాజాగా ఆమె పని చేసే కంపెనీ కొత్త ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. దీని కోసం ఆమె విజయవాడకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న అతను తను ఫోన్ చేస్తే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఆమె స్పందించలేదు. ఆ రోజు సాయంత్రం ఊరికి వచ్చిన తర్వాత ఆమెకు మరోసారి ఫోన్ చేసి ఊరి చివరకు రాకుంటే ఆమెను.. ఆమె భర్తను చంపేస్తానని బెదిరించాడు.
దీంతో అక్కడకు వెళ్లిన ఆమెపై రాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. తెనాలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆమె.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పవన్ ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టుకు హాజరుపర్చగా.. నెల్లూరు జైలుకు తరలిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అతడి మీద బోలెడన్ని ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది అక్టోబరులో తాను పిలిస్తే ఆగలేదని ఒక వ్యక్తిని తీవ్రంగా కొట్టి జైలుకు వెళ్లి వచ్చాడు. ఇతడి నేరపూరిత వ్యవహరశైలి నేపథ్యంలో అతడిపై పీడీ యాక్టు పెట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.