ఇద్దరు సూపర్ అన్నలకు చెల్లెళ్లు ఎందుకు ప్రత్యర్థులయ్యారు?

రెండు రాష్ట్రాలుగా మారిన తెలుగు నేలలో చరిత్రలో ఇప్పటివరకు చోటు చేసుకోని సరికొత్త సన్నివేశం ఆవిష్కరానికి కౌంట్ డౌన్ మొదలైంది.;

Update: 2025-05-26 07:04 GMT

రెండు రాష్ట్రాలుగా మారిన తెలుగు నేలలో చరిత్రలో ఇప్పటివరకు చోటు చేసుకోని సరికొత్త సన్నివేశం ఆవిష్కరానికి కౌంట్ డౌన్ మొదలైంది. రక్తం పంచుకు పుట్టిన అన్నాచెల్లెళ్ల మధ్య రాజకీయ వైరుధ్యం.. ఒకరి మీద ఒకరు పోటీ పడేందుకు వీలుగా పరిణామాలు చోటు చేసుకోవటం దేనికి నిదర్శనం? తెలుగు నేలకు.. ప్రజలకు రాజకీయ వైరం కొత్తదేం కాదు. కానీ.. ఒకే కుటుంబంలోని అన్నా చెల్లెళ్ల మధ్య అనుబంధం.. అప్యాయతల్ని ఓ రేంజ్ వరకు వెళ్లి.. అనూహ్య రీతిలో ఒకరి మీద ఒకరు పోటీ పడే పరిస్థితి వరకు వచ్చిన పరిస్థితి ఇదే తొలిసారిగా చెప్పాలి.

ఆసక్తికరంగా ఈ ఇద్దరు అన్నాచెల్లెళ్లు కూడా తెలుగు రాష్ట్రాల్ని ఏలిన వారి సంతానమే కావటం మరో ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. అంతేకాదు.. ఈ ఇద్దరి అన్నాచెల్లెళ్ల తండ్రులు తెలుగు ప్రజల్ని మంత్రముగ్థుల్ని చేసి వాగ్ధాటి ఉన్న వారు. కోట్లాది మంది ప్రజల్ని ప్రభావితం చేసినవారే కావటం విశేషం. అలాంటి ఇద్దరు అధినేతలు తన రక్తం పంచుకుపుట్టిన పిల్లల మధ్య వైరుధ్యాలు ఏర్పడకుండా.. వారి మధ్య సఖ్యత నెలకొనేలా చేయటంలో మాత్రం ఫెయిల్ కావటం మరో విషాదకర అంశంగా చెప్పాలి.

ఒకవేళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే.. జగన్ - షర్మిల మధ్య ఇప్పుడున్న పరిస్థితులు అయితే చోటు చేసుకునే అవకాశం ఉండేది కాదని చెప్పాలి. కానీ.. కేసీఆర్ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా జరగటం విస్మయానికి గురి చేస్తుందని చెబుతారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వారు చెప్పే మాటల్ని చూసినప్పుడు.. ఇద్దరు పిల్లలు (కేటీఆర్.. కవిత) తండ్రి ఎదుట కూర్చునే ధైర్యం చేయరని.. వీలైనంత వరకు నిలబడే ఉంటారని చెబుతారు. అంతటి భయభక్తులు.. గౌరవ మర్యాదలు తండ్రి విషయంలో ఉంటాయని చెబుతారు. అలాంటిది ఈ రోజున కొత్త పార్టీ పెట్టే వరకు కవిత వెళ్లటాన్ని గులాబీ పార్టీకి చెందిన పలువురు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.

కేటీఆర్ - కవిత, జగన్ - షర్మిల.. రెండు కుటుంబాలకు చెందిన ఈ అన్నాచెల్లెళ్ల మధ్య అనుబంధం చాలా బలంగా ఉండటం.. కాల క్రమంలో అది కాస్తా బలహీనంగా మారటమే కాదు.. నాలుగు గోడల మధ్య ఉన్న పంచాయితీలను బయటపెట్టేందుకు సైతం వెనుకాడకపోవటం చూసినప్పుడు.. కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎక్కడో ఒక దగ్గర రాజీ పడి ఉంటే పరిస్థితి ఇంతవరకు రాదు కదా? అన్న సందేహం కలుగుతుంది.

ఈ ఇద్దరు అన్నలు.. తమ చెల్లెళ్లను ప్రాణానికి ప్రాణంగా చూస్తామని చెప్పినోళ్లే. చివరకు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకోవటం ఎందుకు? అన్నప్పుడు అధికారం కోసమనే మాట రాక తప్పదు. ఇప్పటివరకు అన్నాచెల్లెళ్ల మధ్య పోరుతో కొత్త రాజకీయ సమీకరణాలు ఏర్పటం తెలుగు నేలకు కాస్తంత కొత్త విషయమే. కిందిస్థాయిలో ఇలాంటివి కొన్ని అప్పుడప్పుడు తెర మీదకు వచ్చినా.. రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేసే కుటుంబాల్లో మాత్రం ఇలాంటి సన్నివేశం తొలిసారిగా చెప్పాలి.

ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. పురాణాలు మొదలు రాజకుటుంబాల వరకు ఏం జరిగిందో ఇప్పుడు ప్రజాస్వామ్యంలోనూ ఆ తరహా సన్నివేశాలే తెర మీదకు రావటానికి మించిన విచిత్రం ఇంకేం ఉంటుంది? పురాణాల్లోనూ అన్నదమ్ముల పంచాయితీలే మహాయుద్ధాలుగా మారిన సంగతి తెలిసిందే. రాజరిక వ్యవస్థలోనూ రాజకుటుంబాల్లో మధ్య నడిచిన అధిపత్య పోరుకు ప్రపంచంలోని పలు దేశాలు.. అక్కడి ప్రజలు ప్రభావితం అయ్యారు. అందుకు భారతీయులు.. తెలుగు ప్రజలు మినహాయింపు కాదు. ఇప్పటి డిజిటల్ ప్రపంచంలోనూ పురాణాల్లో చోటు చేసుకున్న సన్నివేశాలే కాస్త అటు ఇటుగా రిపీట్ కావటం చూసినప్పుడు.. కోట్లాది మంది ప్రజల బతుకుల్ని గుప్పెడు కుటుంబాలే ప్రభావితం చేయటమే కనిపిస్తుంది. ఇంతకు మించిన సిగ్గుచేటైన విషయం నాగరిక ప్రపంచానికి ఇంకేం ఉంటుంది?

Tags:    

Similar News