అక్కడ.. ఇక్కడ 'కాళేశ్వరం'.. బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కరి
తెలంగాణలో విపక్షం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకకాలంలో చేస్తున్న దాడి రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.;
తెలంగాణలో విపక్షం బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకకాలంలో చేస్తున్న దాడి రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇక్కడ అసెంబ్లీలో.. అక్కడ పార్లమెంటులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వాలు చేసిన ప్రకటనలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కరిబిక్కిరికి గురిచేస్తున్నాయని అంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ప్రపంచంలోనే పెద్ద ఎత్తిపోతల పథకమని, ఇంజనీరింగ్ అద్భుతమని ప్రచారం చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్నమైన వాదన వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతో ప్రాజెక్టు పనుల్లో అవినీత జరిగిందని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఆరోపిస్తుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్ష కోట్ల గంగ పాలయ్యాయని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తాజాగా చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాళేశ్వరం కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీతో బంతాట ఆడుతున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్టును పెద్ద ఘనతగా ఆ పార్టీ నేతలు చాటుకున్నారు. అయితే ఎన్నికల ముందు బ్యారేజ్ కూలిపోవడం ఆ పార్టీకి పెద్ద షాక్ గా మారింది. ఆ తర్వాత ఈ ఉదంతాన్ని అవకాశంగా మలుచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా దెబ్బతీసేలా సందర్భం దొరికిన ప్రతిసారి తన అస్త్రాలు వదులుతున్నారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో చర్చ సందర్భంగా కాళేశ్వరంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేయాలని బీజేపీ నేత, హోంమంత్రి అమిత్ షా అన్నారని, కానీ తాము సీబీఐ విచారణకు లేఖ రాసినా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలను ఇరుకున పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఇక సీఎం ఆరోపణల ఎఫెక్టో, మరే కారణమో తెలియదు కానీ, సోమవారం రాజ్యసభలో తెలంగాణ సాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి ప్రశ్న వేస్తే, కేంద్ర జలశక్తి మంత్రి ‘కాళేశ్వరం’ ప్రాజెక్టును ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పార్టీపై ఎదురుదాడి చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడా ఉపశమనం లభించడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. రెండు వైపుల నుంచి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడం, ఎవరు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల మేలు జరిగిందని, అభివృద్ధికి తోడ్పడిందని చెప్పకపోవడంతో బీఆర్ఎస్ రాజకీయంగా డిఫైన్సులో పడినట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ పరిణామాలతో బీఆర్ఎస్ పార్టీ తమ ఘనతగా చాటుకున్న కాళేశ్వరంపై ఎలా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతోందని అంటున్నారు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమైనట్లు వ్యవహరిస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ ఒక సంక్లిష్టతను ఎదుర్కొంటోందని వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు కేవలం నీటి సమస్య కాకుండా తెలంగాణ రాజకీయాలను శాసించే అతిపెద్ద రాజకీయ యుద్ధంగా రూపుదిద్దుకుందని అంటున్నారు. దీని నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు వినిపిస్తున్న వాదనకు పెద్దగా బలం ఉండటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి నుంచి పార్టీని బయటపడేయ గలిగిన సత్తా కేవలం పార్టీ అధినేత కేసీఆర్ కు మాత్రమే ఉందని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాటల దాడిని కేసీఆర్ ఎలా తిప్పికొడతారనేది ఉత్కంఠ రేపుతోందని, ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నామని గులాబీ పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.