ఏబీఎన్ × బీఆర్ఎస్... పాత శత్రుత్వం కొత్తగా.. మళ్లీ చానెల్ బ్యాన్
దీనికితగ్గట్లే తాజాగా డిబేట్ లో ప్రజంటేటర్ వెంటక కృష్ణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి ఎమ్మెల్సీ రవీందర్ రావుకు మధ్య జరిగిన సంవాదం మరింత చర్చకు దారితీసింది.;
తెలంగాణలో రాజకీయ వార్ ముదురుతోంది..! అది పార్టీల మధ్య.. పార్టీలు-మీడియా మధ్య కూడా..! ఇప్పటికే తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క-ఏబీఎన్, ఆంధ్రజ్యోతి చానెల్ అధినేత వేమూరి రాధాకృష్ణ మధ్య తీవ్రమైన మాటల-రాతల యుద్ధం సాగుతోంది. సింగరేణి నైనీ బ్లాక్ బొగ్గు టెండర్ల అంశమై ఇద్దరి మధ్య విమర్శలు-ప్రతి విమర్శలు తీవ్రంగా నడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్-ఆంధ్రజ్యోతి అనే విధంగానూ పరిస్థితి మారింది. ఇప్పటికే ఈ మీడియా అంటే బీఆర్ఎస్ నాయకులకు తీవ్రమైన ఆగ్రహం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉండగా చాలా అంశాల్లో ఆంధ్రజ్యోతి తీవ్రంగా విభేదించింది. రెండేళ్ల కిందట బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి మారినా ఇప్పటికీ అదే వైఖరి కొనసాగుతోంది. దీనికితగ్గట్లే తాజాగా డిబేట్ లో ప్రజంటేటర్ వెంటక కృష్ణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి ఎమ్మెల్సీ రవీందర్ రావుకు మధ్య జరిగిన సంవాదం మరింత చర్చకు దారితీసింది.
ఇంతకూ ఏం జరిగింది..?
కొద్ది రోజుల కిందట బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు పిలిచింది. ఆయన హాజరయ్యారు కూడా. అయితే, ఈ సందర్భంగా సిట్ విచారణ తీరు అంశం ఏబీఎన్ డిబేట్ లో ప్రస్తావనకు వచ్చింది. దీంతో మీడియాలో వచ్చిన కథనాలను ఎమ్మెల్సీ రవీందర్ రావు పరుష పదజాలంతో విమర్శించారు. పిచ్చి నా.. అంటూ నోరు జారారు. దీనిని వెంకట కృష్ణ ఖండించారు. మీరు కంట్రోల్ చేసుకోవాలని కోరారు. మాటలను వెనక్కు తీసుకోవాలని కూడా సూచించారు. కానీ, రవీందర్ రావు మాత్రం వెనక్కు తగ్గలేదు. తాను మాటలను వెనక్కు తీసుకోనని స్పష్టం చేశారు. అప్పటికీ ప్రజంటేటర్ ఎంత నచ్చజెప్పినా తన పదాలను ఆయన వినలేదు. దీంతో చివరకు చేసేదేం లేక వెంకటకృష్ణ.. గెటౌట్ ఫ్రం మై డిబేట్ అంటూ తేల్చి చెప్పారు. ఇదే పదాన్ని పదేపదే రిపీట్ చేశారు. చివరకు రవీందర్ రావు మైక్ ను కట్ చేయించారు. ఈ ప్రభావం ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ ఏబీఎన్ గా మారింది.
మళ్లీ పాత రోజులు..
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు ఏబీఎన్ రాధా క్రిష్ణ చాలా సన్నిహితం. వీరిద్దరి కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధమే ఉంది. కేసీఆర్ ను 4 దశాబ్దాలకు పైగా తెలిసిన రాధాక్రిష్ణ.. బీఆర్ఎస్ తొలి టర్మ్ ప్రభుత్వంలో మాత్రం విభేదించారు. ఒక దశలో ఏబీఎన్న చానెల్ ప్రసారాలను బీఆర్ఎస్ ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఆ తర్వాత మళ్లీ సత్సంబంధాలు ఏర్పడినా... 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పాత కథే అయింది. ఈ సారి బ్యాన్ చేయలేదు కానీ.. శత్రుత్వ వైఖరి కొనసాగింది. చివరకు బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఈ 26 నెలలుగా అదే కొనసాగుతోంది.
-ప్రస్తుతం డిబేట్ లో తమ ఎమ్మెల్సీ రవీందర్ రావు - ఏబీఎన్ వెంకట కృష్ణ మధ్య జరిగిన సంవాదంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించింది. ఇకమీదట ఆ చానెల్ డిబేట్లలో తాము ఎవరూ పాల్గొనబోరని ప్రకటించారు. రవీందర్ రావు తెలంగాణ ఉద్యమకారుడని ఆయన పట్ల వెంకటక్రిష్ణ వ్యవహరించిన తీరు సరికాదంది. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, జిల్లా కార్యాలయాల్లో జరిగే సమావేశాలకు ఇకమీదలట ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ప్రతినిధులను అనుమతించబోమని ట్వీట్ చేసింది.