రేవంత్‌ను దెబ్బకొట్టేందుకు.. 'వేం'ను వాడుకున్నారా?
ఇదిలావుంటే.. అప్పట్లో కేసీఆర్‌కు సవాల్‌గా మారిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని అదుపు చేసేందుకు కూడా ప్రయత్నాలు సాగినట్టు తెలుస్తోంది.;
రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు అధికారంలో ఉన్నపార్టీ ఏదైనా చేస్తుందని అంటారు. తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ ఎస్.. మూడోసారి వరుసగా విజయం దక్కించుకునేందుకు వేసిన వ్యూహంలో భాగంగా తన ప్రత్యర్థుల కదలికలపై `ఫోన్ ట్యాపింగ్` అస్త్రాన్ని ప్రయోగించిందనే వాదన ఉంది. ఈ క్రమంలోనే లక్షలాది ఫోన్ కాల్స్ విని రికార్డు కూడా చేశారని విమర్శలు ఉన్నాయి. ఓ పెద్ద పోలీసు అధికారికి ఈ బాధ్యతలను అప్పగించారు.
ఇదిలావుంటే.. అప్పట్లో కేసీఆర్‌కు సవాల్‌గా మారిన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని అదుపు చేసేందుకు కూడా ప్రయత్నాలు సాగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనకు అత్యంత ఆప్తుడు, ఒకే పార్టీలో గతంలో పనిచేసిన వేం నరేందర్‌రెడ్డిని బీఆర్ఎస్ టార్గెట్ చేసుకున్నట్టు తాజాగా తెలిసింది. వేం ముఖ్య అనుచ రుడు.. రావుల మురళి ఫోన్‌ను ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు. రావుల-వేం మధ్య వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి మధ్య జరిగే సంభాషణను వినడం ద్వారా రేవంత్ రెడ్డిని దెబ్బకొట్టే ప్రయత్నాలు జరిగాయన్నది తాజాగా వస్తున్న ఆరోపణ.
రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వచ్చిన 'ఓటుకు నోటు' కేసులో వేం నరేందర్‌రెడ్డి ప్రమేయం ఉందన్న వాదన ఉంది. ఈ క్రమంలో రాజకీయంగా ఏం చేయాలన్నా.. రేవంత్ రెడ్డి-వేంలు కలిసే చేస్తారన్న చర్చ కూడా ఉంది. నిజానికి.. రేవంత్ కాంగ్రెస్‌లోకి రావడంతో.. వేం కూడా ఈ పార్టీ కండువా కప్పుకొన్నారు. రేవంత్ అధికారంలోకి రావడంతో ఆయన ప్రభుత్వ సలహాదారు.. తాజాగా రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు. ఇలా.. వీరిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉంది.
దీనిని గుర్తించిన బీఆర్ ఎస్.. వేం ముఖ్య అనుచరుడు, వ్యాపారి.. రావుల మురళి ఫోన్‌ను ట్యాప్ చేసి.. సుమారు 6 వేలకుపైగా ఫోన్ కాల్స్‌ను విన్నట్టు అధికారులు చెబుతున్నారు. తాజాగా ఆయనను విచారణకు పిలిచారు. చిత్రం ఏంటంటే అధికారులు.. ఆయా ఫోన్ల జాబితాలను ఆయన ముందు పెట్టే వరకు తన ఫోన్ ట్యాపింగ్ అయిన సమాచారం కూడా ఆయనకు తెలియదట.! నిజానికి రావులను కానీ.. వేంను కానీ.. బీఆర్ ఎస్ టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ, వీరికి సన్నిహితుడైన రేవంత్ రెడ్డిని నియంత్రించేందుకే ఇలా 6 వేల కు పైగా ఫోన్ కాల్స్‌ను ట్యాప్ చేయాల్సి వచ్చి ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.