రేవంత్ స్థానం సుస్థిరం.. ప్రతిపక్షంలో ఎవరెక్కడ?
తెలంగాణలో పంచాయతీ సమరం ముగిసింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అంచనాలకు మించి విజయం సాధించింది.;
తెలంగాణలో పంచాయతీ సమరం ముగిసింది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అంచనాలకు మించి విజయం సాధించింది. గత నెలలో జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచిన కాంగ్రెస్ కు పంచయతీ ఎన్నికల ఫలితాలు మరింత జోష్ ఇచ్చాయంటున్నారు. ఈ జోరు కొనసాగించాలనే ఉద్దేశంతో వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని చెబుతున్నారు. ఇక తాజా ఎన్నికల సీజన్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా మరింత బలపడ్డారనే విశ్లేషణలు వస్తున్నాయి. తాజా ఫలితాల తర్వాత సీఎం రేవంత్ ను ఢీకొట్టే సమఉజ్జీలు ప్రతిపక్షాల్లో ఎవరు ఉన్నారు? అన్న చర్చ ఎక్కువగా జరుగుతోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసిందని అంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఇప్పుడు పంచాయతీ పోరులోనూ బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందనే అంటున్నారు. దీనివల్ల రానున్న రోజుల్లో రాజకీయం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యేనే కొనసాగే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ఇక రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి, సీఎం పీఠం దక్కించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు నెలల్లో అందుకున్న విజయాలతో రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించారని అంటున్నారు.
రెండేళ్ల క్రితం సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి.. జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు వరకు అనేక సందేహాలకు కేంద్ర బిందువుగా ఉండేవారు. ఆయన పనితీరు విషయంలో కాంగ్రెస్ నేతలు నమ్మకం కోల్పోయారని, కాంగ్రెస్ అధిష్టానం సైతం సీఎంను పట్టించుకోవడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కొన్ని సర్వేసంస్థలు సైతం కాంగ్రెస్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని నివేదికలు విడుదల చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రతిపక్షాలు ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉందని కూడా ప్రకటనలిచ్చాయి. అయితే తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అవన్నీ ఉట్టి అబద్ధాలే అని తేలిపోయాయంటున్నారు.
ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ ఇన్నాళ్లు మాట్లాడిన వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైందని విశ్లేషిస్తున్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేలా రాజకీయం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అంతే వ్యూహంతో పంచాయతీల్లో మూడు రంగుల జెండాను నమ్ముకున్న వారిని గెలిపించేలా మంత్రులు, ఎమ్మెల్యేలను నడిపించారని అంటున్నారు. విపక్ష పార్టీలు అయిన బీఆర్ఎస్, బీజేపీల్లో ఏ నేత కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలకు దీటుగా పనిచేయలేకపోవడమే ఇప్పుడు హాట్ డిబేట్ గా మారుతోందని అంటున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొని రాజకీయం చేసే నాయకులు విపక్షంలో ఎవరున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో సమానంగా మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను చెబుతుంటారు. తెలంగాణలో అందరి కంటే మాజీ సీఎం కేసీఆర్ ఇమేజ్ పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. తెలంగాణ జాతిపితగా ఆయన సాధించిన గుర్తింపు వల్ల ఇది సాధ్యమైందని అంటున్నారు. అయితే కేసీఆర్ స్థాయి నేతను ఢీకొట్టి, ఓడించి రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. దీంతో రేవంత్ ఇమేజ్ దేశవ్యాప్తంగా పెరిగిందని అంటున్నారు. ఇప్పుడు ఆయన వ్యూహాలను ఎదుర్కొనేలా కేసీఆర్ కూడా ఏం చేయలేకపోతున్నారని విశ్లేషిస్తున్నారు. రాజకీయ వ్యూహరచనలో దిట్టగా ప్రచారం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ రెండేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి విషయంలో పైచేయి సాధించలేకపోతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తన ఫాం హౌస్ కి మకాం మార్చిన మాజీ సీఎం కేసీఆర్.. ఎప్పుడో కానీ రాష్ట్ర రాజకీయాలపై స్పందించడంలేదు. పార్టీ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలోనూ ఆయన మౌనంగానే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రేవంత్ వ్యూహాలను ఎదుర్కోలేకపోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోపాటు పంచాయతీ ఎన్నికల ఫలితాలనే ఉదహరిస్తున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేలా పనిచేసిన బీజేపీ కూడా ఇప్పుడు మునుపటి జోరు చూపలేకపోతోందని అంటున్నారు. రాష్ట్రంలోని బీజేపీ ముఖ్యనేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఉండటంతో రాష్ట్రంలో విపక్షపాత్ర పోషించలేకపోతున్నారని అంటున్నారు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డికి తగిన సమ ఉజ్జీ కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది.