మున్సిపల్ క్లైమాక్స్: కాంగ్రెస్ ధీమా.. బీఆర్ఎస్, బీజేపీల మధ్య టఫ్ ఫైట్!
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రహసనం ముగిసినట్లుగానే భావిస్తున్నారు.;
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రహసనం ముగిసినట్లుగానే భావిస్తున్నారు. ఇంతకుముందు జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతోపాటు ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలతో రాష్ట్రంలో దాదాపు 95 శాతం స్థానిక పదవులు భర్తీ అయినట్లుగా లెక్కించాల్సివుంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటు సిద్దిపేట వంటి కొన్ని మున్సిపాలిటీలకు మాత్రం ప్రస్తుతం ఎన్నికలు జరగడం లేదు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగులో మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పాలకవర్గాలను ఎన్నుకోనున్నారు.
ఈ నెల 13న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరగనుంది. 16న కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు జరిగిన ఈ ఎన్నికల ప్రచారం అసెంబ్లీ పోరును తలపించింది. ప్రధానంగా అధికార కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో జోష్ ప్రదర్శిస్తోందని చెబుతున్నారు. పంచాయతీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను రిపీట్ చేయాలని అధికారపార్టీ ఉవ్విళ్లూరుతోందని అంటున్నారు. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ దాదాపు ఏడాది ఆలస్యంగా స్థానిక ఎన్నికలు నిర్వహణకు పూనుకుంది. అన్నిరకాలుగా సన్నద్ధమైన తర్వాత ఎన్నికలకు వెళ్లడంతో అనుకున్న దిశగా ఫలితాలు సాధించేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అంటున్నారు.
ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి దీటుగా ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ పోరాడుతున్నాయి. అయితే అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఒకింత దూకుడుగా వ్యవహరిస్తోందని అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ సైతం అన్ని అస్ర్తశస్త్రాలు ప్రయోగిస్తున్నాయి. మొత్తం 124 చోట్ల ఎన్నికలు జరుగుతుండగా, చాలా చోట్ల అంటే మెజార్టీ స్థానాల్లో ద్విముఖ పోటీయే కనిపిస్తోందని అంటున్నారు. ఎక్కడో ఒకటి, అర చోట మాత్రమే మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోందని చెబుతున్నారు.
ఉత్తరతెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు పోటీ ఉండగా, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ కనిపిస్తోందని అంటున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న కరీంనగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో ఇప్పుడు కమలం పార్టీ గట్టి పోటీ ఇచ్చే దశకు చేరుకోవడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని అంటున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో సైతం బీజేపీ దూకుడు చూపుతోందని అంటున్నారు.
అదేవిధంగా ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యే పోటీ కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. ఈ జిల్లాల్లో బీజేపీ నామమాత్రంగానే పోటీ చేస్తుందని, ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ఉందని అంటున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాల సహకారం కూడా అడ్వాంటేజ్ గా మారుతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు ఇతర పార్టీలు దూరం పాటిస్తుండగా, బీజేపీ సైతం మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన పార్టీల సానుభూతిపరుల ఓట్లపై నమ్మకం పెట్టుకోలేకపోతోందని అంటున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూపిన దూకుడు మిగిలిన రెండు పార్టీల్లో కనిపించలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల ఫలితాలపై ధీమా ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 56 శాతం ఓట్లు సాధించిన అధికార కాంగ్రెస్ పట్టణ స్థానిక సంస్థల్లోనూ రిపీట్ చేస్తామని అంటోంది. ఇదే సమయంలో పట్టణ ప్రజలు తమనే ఆదరిస్తారని బీఆర్ఎస్, బీజేపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న పోలింగులో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారు? ఆ తీర్పు ఎలా ఉండబోతోందనే అంశం తీవ్ర ఉత్కంఠగా మారింది.