అలా ఎలా.. తెలంగాణలోని 14 గ్రామాలని మహారాష్ట్రలో కలిపేస్తున్నారా ?

ఇది మొదటిసారి కాదు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఖమ్మం జిల్లాలోని ఏడు గ్రామాలు పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయబడ్డాయి.;

Update: 2025-07-17 06:30 GMT

తెలంగాణ ప్రజల ఆవేదనకు కారణమవుతున్న సరిహద్దు వివాదం మళ్లీ చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని రజురా, జివాటి తాలూకాల్లో ఉన్న 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రక్రియపై మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవన్కులే స్పష్టత ఇచ్చారు. ఆయన ప్రకారం.. ఈ గ్రామాలు జమాబందీ రికార్డుల ప్రకారం మహారాష్ట్ర భూభాగంలోకే చెందుతాయని తెలిపారు.

సరిహద్దు వివాదం.. చారిత్రక నేపథ్యం

ఈ 14 గ్రామాల పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే 1956కి వెళ్లాలి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సమయంలో 80 చదరపు కిలోమీటర్ల ప్రాంతం తెలంగాణ (అప్పటి ఆంధ్రప్రదేశ్) - మహారాష్ట్ర మధ్య వివాదాస్పదంగా మిగిలింది. అప్పటినుంచి ఈ గ్రామాల పౌరులు రెండు రాష్ట్రాల్లో ఓటు వేస్తూ, రెండు రాష్ట్రాల పాలనా వ్యవస్థల నుంచి ప్రయోజనాలు పొందుతూ వస్తున్నారు. ఈ చారిత్రక నేపథ్యం ప్రస్తుత వివాదానికి మూలంగా మారింది.

గతంలో ఏపీలో కలిపిన 7 గ్రామాలు...

ఇది మొదటిసారి కాదు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఖమ్మం జిల్లాలోని ఏడు గ్రామాలు పోలవరం ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయబడ్డాయి. 11 ఏళ్ల తరువాత కూడా ఆ గ్రామాల ప్రజలు తమను తిరిగి తెలంగాణలో కలపాలని కోరుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఈ విషయంలో చెప్పుకోదగిన ప్రయత్నాలు చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ సంఘటన తెలంగాణ ప్రజల ఆందోళనను మరింత పెంచుతోంది.

-మహారాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం

మహారాష్ట్ర మంత్రి బవన్కులే ప్రకారం, గ్రామస్తుల కోరిక మేరకే ఈ విలీనం చేపడుతున్నామని, ప్రభుత్వ సేవల కల్పన, భూమి హక్కుల స్పష్టత, రాజకీయ, ఆర్థిక స్థిరత్వం కోసం ఈ చర్య తీసుకుంటున్నామని తెలిపారు. ఈ గ్రామాల్లో ఎక్కువగా మరాఠీ మాట్లాడే ఎస్సీ వర్గాలు నివసిస్తున్నారు. మిగతా కొంతమంది ముస్లింలు గతంలో నాందేడ్, పర్భణి, జల్నా జిల్లాల నుంచి వలస వచ్చారని సమాచారం. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యకు "ప్రజాస్వామ్య ఆకాంక్ష" అనే ముసుగు వేస్తోంది.

తెలంగాణ ప్రజల ఆవేదన

తెలంగాణవాసులు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రంలో - మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇలా పావులు కదపడం అనుమానాలకు తావిస్తోందని అభిప్రాయపడుతున్నారు. “ఇది రాజకీయంగా ప్రేరేపితమైన చర్య. మా గ్రామాలను ఇలా బలవంతంగా తీసుకుంటారా?” అని ప్రశ్నిస్తున్నారు. తమ భూభాగాన్ని కోల్పోతామనే భయం తెలంగాణ ప్రజలను వెంటాడుతోంది.

చట్టపరమైన స్థితి

ప్రస్తుతం ఈ వివాదాస్పద గ్రామాల విషయంలో సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. కోర్టు తీర్పు వచ్చిన తరువాతే స్పష్టత రావాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఒక రాష్ట్ర భూభాగాన్ని మరో రాష్ట్రంలో విలీనం చేయడం సహజం కాదు, ఇది సమాఖ్యవాద సూత్రాలకు వ్యతిరేకం అనే విమర్శలు వస్తున్నాయి. చట్టబద్ధత ప్రశ్నార్థకంగా మారడంతో ఈ వివాదం మరింత జఠిలమవుతోంది.

తెలంగాణ ప్రజలకు ఇది మళ్లీ ఒక విస్మరణీయ బాధను తలపింపజేస్తోంది. ఒకవైపు 13 ఏళ్ల ఉద్యమం ఫలితంగా వచ్చిన ప్రత్యేక రాష్ట్రం, మరోవైపు గ్రామాలను కోల్పోయే భయం. ఈ పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం, సుప్రీం కోర్టు ఏ విధంగా స్పందిస్తాయన్నదే ఇప్పుడు ప్రధానమైన అంశం. ప్రజా అభిప్రాయం, చట్టపరమైన సమీక్షలు, చారిత్రక హక్కులు అన్నీ పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాల మధ్య సరిహద్దు సున్నితమైన విషయం.. ఇది రాజకీయ ప్రయోజనాలకు విలీనం కాదని నిరూపించాల్సిన సమయంలో ఉన్నాం.

Tags:    

Similar News