తెలంగాణలో హిల్ట్ ...పొలిటికల్ హీట్.....

రేవంత్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో వివాదాలకు కొదవేం లేదు. ప్రధానంగా భూముల విషయానికి వస్తే సెంట్రల్ వర్సిటీ కంచగచ్చిబౌలి 400 ఎకరాలకు సంబంధించిన వివాదం పెనుదుమారం రేపాక సర్కార్ కాస్త వెనక్కు తగ్గింది.;

Update: 2025-12-01 19:30 GMT

రేవంత్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలో వివాదాలకు కొదవేం లేదు. ప్రధానంగా భూముల విషయానికి వస్తే సెంట్రల్ వర్సిటీ కంచగచ్చిబౌలి 400 ఎకరాలకు సంబంధించిన వివాదం పెనుదుమారం రేపాక సర్కార్ కాస్త వెనక్కు తగ్గింది. ఇప్పుడు హిల్ట్ పేరిట మరో కొత్త భూవివాదానికి తెరలేపింది. ఈ వివాదం బీఆర్ ఎస్ , బీజేపీ ప్రతిపక్షాలకు అనుకోకుండా లభించిన అస్త్రంగా మారుతోంది.

తెలంగాణలో తాజాగా హిల్ట్ భూముల వ్యవహారం రాజకీయంగా కాక రేపుతోంది. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ తెలంగాణ భూముల పందేరానికి తెరలేపుతోందని...ఈ అవ్యవహారంలో దాదాపు 5 లక్షల కోట్ల ప్రజాధనం కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఘాటుగా విమర్శిస్తోంది. ఈ అరాచక విధానాన్ని ఎండగట్టేందుకు, హిల్ట్ తో వాటిల్లే నష్టాలను ప్రజలకు నేరుగా వివరించేందుకు పారిశ్రామిక వాడల్లో పర్యటించేలా 8 నిజనిర్ధారణ బృందాలను ఏర్పాటు చేసింది. ఎంతో విలువైన భూములను మార్కెట్ ధర కంటే తక్కువకు కట్టబెట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు.

హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ ఫర్మేషన్ (హిల్ట్) పేరిట తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొత్త పాలసీ ప్రకటించింది. హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లో భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం ఈ హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. అయితే ఈ పాలసీ ముసుగులో ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడుతోందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ తోపాటు బీజేపీ ఘాటుగా విమర్శిస్తోంది. ఈ వ్యవహారం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, బీఆర్ఎస్ లా మారింది. హిల్ట్ పై తొలుత స్పందించింది బీఆర్ఎస్ పార్టీయే. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఇంతపెద్ద కుంభకోణానికి బహిరంగంగా పాల్పడుతుంటే ఆ పార్టీ అగ్రనేత ఏమాత్రం స్పందించడం లేదెందుకని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని...రాహుల్ గాంధీ స్పందించడం లేదంటే వారికీ భాగస్వామ్యం ఉందేమో అని అనుమానించాల్సి వస్తుందని కేటీఆర్ అన్నారు.

మరోవైపు బీజేపీ కూడా హిల్ట్ ను రాజకీయ వివాదంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తోంది. అంతటితో ఆగకుండా నేరుగా రాష్ట్ర గవర్నర్ ను కలిసి హిల్ట్ ముసుగులో అవకతవకలు జరగకుండా చూడాలని వనతి పత్రం సమర్పించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో టీ బీజేపీ నేతలు సోమవారం రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో భూముల విలువలు అధికమని, ఈ మధ్యకాలంలో కోకాపేట్ భూముల ధరలు ఎంత పలికాయో అందరికీ తెలుసని వారన్నారు. ప్రభుత్వం పాలసీ ముసుగులో 9వేలకు పైగా భూముల్ని రియల్ ఎస్టేట్ గా మార్చాలని ప్రయత్నిస్తోందని వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. రియల్ ఎస్టేటర్లకు లబ్ధి చేకూర్చేందుకే హిల్ట్ పేరుతో కొత్త నాటకం ప్రారంభించారని బీజేపీ తీవ్రంగా ఆరోపిస్తోంది.

అయితే ప్రతిపక్షాల విమర్శల్ని ప్రభుత్వం తేలిగ్గా కొట్టిపారేస్తోంది. అభివృద్ధి పేరిట సర్కారు చేపట్టే ప్రతి పనికి ప్రతిపక్షాలు అడ్డుపుల్లలు వేసేలా ప్రవర్తించడం సాధారణంగా మారిపోయిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. హిల్ట్ వ్యవహారంలో 5 లక్షల కోట్లు కాదు కదా కనీసం 50వేల అవినీతికి కూడా అవకాశం లేదని, సర్కారు ఈ పాలసీని పారదర్శకంగా తీసుకొచ్చిందని అధికారపక్షం అంటోంది. గతంలో కంచగచ్చబౌలి సెంట్రల వర్సిటీకి సంబంధించి 400 ఎకరాల భూములు విషయంగా సర్కారు దూకుడుగా వ్యవహరించిందన్న విమర్శలు మూటగట్టుకుంది. అది చల్లారిందనేలోగా కొత్త అంశం రాజుకుంటోంది. మరి ఈ వివాదాన్ని రేవంత్ ఎలా డీల్ చేస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News