పులివెందులపై పవన్ రియాక్షన్.. టీడీపీ విజయంపై సెన్సేషన్ కామెంట్స్

మూడు దశాబ్దాల తర్వాత తాము స్థానిక ఎన్నికల్లో ఓటు వేసుకున్నామని ఓటర్లు చెప్పారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతోందని పవన్ వ్యాఖ్యానించారు.;

Update: 2025-08-15 05:34 GMT

ఉమ్మడి కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్మోహనరెడ్డి సొంత జిల్లాలో ఎన్డీఏ మద్దతుతో టీడీపీ విజయం తనకు ఎంతో ఆనందం ఇచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు. విజేతలు లతారెడ్డి, ముద్దు కృష్ణారెడ్డిలను అభినందించారు. ‘గత స్థానిక ఎన్నికల్లో కనీసం నామినేషన్ కూడా వేయనీయలేదు. నామినేషన్ వేయాలనుకున్నవారిపై దాడులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. ఇప్పటివరకు ఏకగ్రీవం పేరుతో ఎవరూ పోటీలో లేకుండా చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పటీకి ఆస్కారం కలిగింది’ అంటూ పవన్ విశ్లేషించారు.

మూడు దశాబ్దాల తర్వాత తాము స్థానిక ఎన్నికల్లో ఓటు వేసుకున్నామని ఓటర్లు చెప్పారంటే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థమవుతోందని పవన్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించడం వల్ల ప్రజాతీర్పు స్పష్టంగా వెలువడిందని పవన్ చెప్పారు. పులివెందుల ప్రజలు ప్రతిపక్ష నేతల ఆధిపత్యాన్ని కోరుకోవడం లేదని ఈ ఎన్నిక ద్వారా వెల్లడైందని పవర్ అన్నారు. కాగా, ఈ నెల 12న జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో టీడీపీ అభ్యర్థులు ఏకపక్ష విజయం సాధించడంపై కూటమి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ స్వస్థలమైన పులివెందుల, ఆయన సొంత జిల్లా అయిన ఒంటిమిట్ట ఎన్నికల ఫలితాలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 14 నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాల వల్లే జగన్ అడ్డాలో టీడీపీ జెండా ఎగిరేలా చేశాయని అంటున్నారు. ఈ జోషుతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందులను గెలుచుకుంటామని టీడీపీ ప్రకటిస్తోంది. అయితే ఇవి అసలు ఎన్నికలే కాదని చెబుతున్న వైసీపీ తన పరాజయాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదని చెబుతోంది.

Tags:    

Similar News