ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్.. ఎమ్మెల్యే అరవిందబాబుకు హైకమాండ్ వార్నింగ్!

పల్నాడు జిల్లా నరసారావుపేట ఎమ్మెల్యే అరవిందబాబుకు టీడీపీ అధిష్టానం గట్టి షాక్ ఇచ్చింది.;

Update: 2026-04-04 04:07 GMT

పల్నాడు జిల్లా నరసారావుపేట ఎమ్మెల్యే అరవిందబాబుకు టీడీపీ అధిష్టానం గట్టి షాక్ ఇచ్చింది. అధికారంలో ఉన్నామని ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే కుదరదని తేల్చిచెప్పింది. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో ఎమ్మెల్యే అరవిందబాబు భేటీ అయ్యారు. పల్నాడు ఎస్పీ ఆఫీసులో తన ప్రవర్తనకు చింతిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు పల్లాకు వివరణ ఇచ్చినట్లు చెబుతున్నారు. అయితే ఆయన వివరణ పట్ల పల్లా సంతృప్తి చెందలేదని, ఎమ్మెల్యే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నట్లు స్పష్టం చేశారని అంటున్నారు.

పల్నాడు ఎస్పీ కార్యాలయంలో లీగల్ అడ్వాయిజర్ నియామకంపై ఎమ్మెల్యే అరవిందబాబు గొడవ చేసిన విషయం తెలిసిందే. దాదాపు పది గంటల పాటు ఎస్పీ కార్యాలయంలో బైఠాయించిన ఎమ్మెల్యే తీవ్ర విమర్శలకు గురయ్యారు. పార్టీ అధిష్టానం, ప్రభుత్వం అంటే లెక్కలేనట్లు ఆయన వ్యవహరించారని టీడీపీ హైకమాండ్ భావించింది. దీంతో ఎమ్మెల్యేను పార్టీ కార్యాలయానికి పిలిపించి వివరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆగ్రహంతో తాను చేసిన తప్పు గుర్తించిన ఎమ్మెల్యే శుక్రవారం పార్టీ కార్యాలయానికి వచ్చి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిశారని అంటున్నారు.

లీగల్ అడ్వాయిజర్ నియమాకంపై ఎస్పీతో వాగ్వాదానికి దారి తీసిన పరిస్థితులను ఎమ్మెల్యే వివరించారని అంటున్నారు. స్థానిక పరిస్థితుల కారణంగా అలా చేయాల్సివచ్చిందని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారని, దీనిపై పల్లా ఏకీభవించలేదని అంటున్నారు. ఎమ్మెల్యే ప్రవర్తన వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని పార్టీ అధ్యక్షుడు పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాన్ని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించారని అంటున్నారు.

ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్యలు ఉంటే ఇంచార్జి మంత్రి, పార్టీ సమన్వయకర్తలతో మాట్లాడి చక్కదిద్దుకోవాలని పల్లా సూచించారని చెబుతున్నారు. ఎవరికి తోచినట్లు వారు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే పార్టీ నష్టపోతుందని సీరియస్ అయ్యారని చెబుతున్నారు. ఎమ్మెల్యే చదలవాడ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ మాత్రం సంతృప్తిగా లేరని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారని అంటున్నారు. ఇక అధిష్టానానికి వివరణ ఇచ్చిన అనంతరం వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. ఎమ్మెల్యే చదలవాడ వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ అయింది. మైండ్ కంట్రోల్ తప్పడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన తర్వాత పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందనే ఆలోచనతో ఎమ్మెల్యే చదలవాడ సర్దుకున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News