మహానాడు ముందు కీలక నిర్ణయం.. జగన్ కి షాక్!
మంగళవారం నుంచి కడపలో మహానాడు ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే.;
కడప గడపలో టీడీపీ తొలిసారి మహానాడు నిర్వహిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి గట్టి పట్టున్న ఈ జిల్లాలో మహానాడు నిర్వహించడమే పెద్ద విశేషమైతే.. ఆ వేడుక ప్రారంభానికి ముందే టీడీపీ ట్విస్టు ఇచ్చింది. ప్రభుత్వ చర్య మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ెడ్డి పెద్ద షాకే అంటున్నారు. మహానాడు జరగడానికి ఓ రోజు ముందే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటే ఇక మూడు రోజుల వేడుక తర్వాత మరెన్ని సంచలన నిర్ణయాలు వెలువడతాయనే ఆసక్తి కనిపిస్తోంది.
మంగళవారం నుంచి కడపలో మహానాడు ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. మంగళ, బుధ, గురువారాల్లో నిర్వహించే మహానాడుకు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ క్యాడర్ తరలివస్తోంది. రాయలసీమ పౌరుషానికి ప్రతీకగా, దేవుని గడపగా ప్రసిద్ధికెక్కిన కడపకు పూర్వ వైభవం తెచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత కేబినెట్ సమావేశంలో తీర్మానించిన మేరకు జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్నంతవరకు ఆయన సొంత జిల్లాకు కడప జిల్లాగానే పిలిచేవారు. 2009లో ముఖ్యమంత్రిగా ఉంటూనే హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు. దీంతో అప్పటి ప్రభుత్వం వైఎస్ ను నిత్యం స్మరించుకునేలా వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చింది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు. మాజీ సీఎంగా వైఎస్ ను గౌరవించింది.
అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ కుమారుడు జగన్ సీఎం అయ్యారు. ఆయన హయాంలో రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఓ జిల్లాగా విభజించిన జగన్.. అరకు పార్లమెంటును రెండు జిల్లాలుగా విభజించారు. దీంతో రాష్ట్రంలో 26 జిల్లాలుగా పునర్విభజించగా, వైఎస్ఆర్ కడప జిల్లాను వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. జిల్లా పేరులో కడప లేకపోవడంపై చాలా విమర్శలు వ్యక్తమైనా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చింది. గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నా, మహానాడును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆఘమేఘాలపై ఉత్తర్వులు జారీ చేసింది.