మహానాడు ముచ్చట: తీర్మానాలే కాదు.. కీలక మార్పులు కూడా ..!
టీడీపీ నిర్వహిస్తున్న మహానాడులో అనేక ఆసక్తికర పరిణామాలు వెలుగు చూడనున్నాయి.;
టీడీపీ నిర్వహిస్తున్న మహానాడులో అనేక ఆసక్తికర పరిణామాలు వెలుగు చూడనున్నాయి. వీటిలో నారా లోకేష్‌కు కీలకపదవి దక్కనుందన్న సమాచారం ఒకటి పార్టీ నాయకులను ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేస్తోంది. మరొకటి.. ఆయనే ప్రతిపాదించిన టీడీపీ యువనేతలకు సూపర్ సిక్స్‌ను కూడా ఈ వేదికగానే ఆమోదించనున్నారు. ఈ రెండింటితో పాటు.. 14 తీర్మానాలు కూడా చేయనున్నారు. ఇవి.. నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు నాయకులను ఉత్కంఠ కు గురి చేస్తున్న కీలక మార్పులు కూడా ఉన్నాయి.
అవే.. నియోజకవర్గాల ఇంచార్జ్‌ల మార్పు. దీనిపై కసరత్తు దాదాపు పూర్తయింది. మహానాడులో రెండో రోజు, లేదా.. మూడో రోజునాడు.. మొత్తం 42 నియోజకవర్గాల్లో ఇంచార్జ్‌లను మార్పు చేయనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల 101 మందికి నామినేటెడ్ పదవులు ఇచ్చారు. అలానే.. కొందరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఇప్పుడు ఇంచార్జ్ పదవులు కూడా ఇవ్వనున్నట్టు చెబుతున్నారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా మార్పులకు శ్రీకారం చుట్టడం ఆసక్తిగా మారుతోంది.
సహజంగా ఎమ్మెల్యేలు ఉన్న చోట వారే నియోజకవర్గం ఇంచార్జ్‌లుగా ఉంటారు. కానీ.. కొన్ని కొన్ని నియో జకవర్గాల్లో వివాదాలు.. విభేదాలతోనే కాలం గడుపుతున్న ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిని తాజాగా గుర్తించా రు. గతంలోనూ రెండు నుంచి మూడు సార్లు హెచ్చరించారు. అయినప్పటికీ.. వారిలో మార్పురావడం లేదు. ఈ పరిణామాలను నిశితంగా గమనించిన నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లను మార్పు చేయనున్నట్టు తెలిసింది. వీటిలో ప్రధానం 11 ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి.
ఆయా ఎమ్మెల్యేలపై పార్టీ నాయకులకు ఫిర్యాదులు రావడం.. నాయకులు పార్టీ హైకమాండ్‌ను కూడా లెక్క చేయకుండా వ్యవహరించడం వంటివి ఉన్నట్టు తెలుస్తోంది. ఆళ్లగడ్డ, జగ్గయ్యపేట, కడప, తిరువూరు వంటివి తరచుగా వివాదాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ ఓ మంత్రి, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా వారి మానాన వారు ఉన్నారన్న చర్చ కనిపిస్తోంది. దీనిపైనే పలు మార్లు హెచ్చరించినా.. మార్పు రాకపోవడంతో మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు. మహానాడు వేదికగా కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు.