లే ఆఫ్స్ కు AI కారణం కాదట!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈఓ కృతివాసన్ ఇటీవల చేసిన "లే ఆఫ్స్‌కు AI కారణం కాదు" అనే వ్యాఖ్య ఐటీ రంగంలో విస్తృత చర్చకు దారి తీస్తోంది.;
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సీఈఓ కృతివాసన్ ఇటీవల చేసిన "లే ఆఫ్స్‌కు AI కారణం కాదు" అనే వ్యాఖ్య ఐటీ రంగంలో విస్తృత చర్చకు దారి తీస్తోంది. ఆయన మాటల్లోని ప్రత్యక్ష అర్థాన్ని పక్కన పెడితే, పరోక్షంగా అనేక వాస్తవాలు దాగి ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
- AI ప్రభావాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం
కృతివాసన్ "AI వల్ల ఉత్పత్తి 20% పెరిగింది" అని స్పష్టంగా పేర్కొంటూనే అది ఉద్యోగాల తొలగింపుకు కారణం కాదని అనడం కొంతవరకు పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది. కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ పనిని సాధించగలుగుతున్నప్పుడు.. ఉద్యోగుల సంఖ్య తగ్గించడం సాంకేతికత ప్రభావంగా పరిగణించబడకపోవడం ఆశ్చర్యకరం. AI సామర్థ్యాన్ని పెంచుతున్నప్పటికీ, అది పరోక్షంగా ఉద్యోగ కోతలకు దారితీస్తుందన్నది స్పష్టమవుతోంది.
-నైపుణ్యం లేకపోవడమే అసలైన సమస్య
సీఈఓ వ్యాఖ్యలకు అనుగుణంగా "నైపుణ్యం లేని వారిని నియమించలేం, అందుకే తొలగింపులు" అన్న మాట ఐటీ రంగంలోని మరో నిజాన్ని వెల్లడిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగుల నుంచి జెన్ ఏఐ , డేటా ఇంజినీరింగ్, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త నైపుణ్యాలు తీవ్రంగా అవసరం అవుతున్నాయి. పాత పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తమ నైపుణ్యాలను నవీకరించుకోలేని వారు తమ ఉద్యోగాలకు ప్రమాదంలో పడుతున్నారు.
- స్కిల్స్ అప్‌డేట్ చేయకపోతే ఆటోమేటిక్ లే ఆఫ్
కంపెనీలు తమ మారుతున్న అవసరాలకు తగినట్టు రీస్కిలింగ్ చేసుకోని వారిని పక్కన పెడుతున్నాయి. ఇది నేరుగా AI కారణంగా కాకపోయినా.. ఏఐ, ఆటోమేషన్ వంటివి పెరిగిన నేపథ్యంలో ఉద్యోగ ప్రొఫైల్స్ మారుతుండటమే ఇందుకు మూలకారణం. ఇది ఉద్యోగులకు ఒక బలమైన హెచ్చరికగా భావించాలి. నిరంతరం నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం తప్పనిసరి.
- ఉద్యోగ భద్రత లేకుండా ఉన్న అస్థిరత
ఈ ప్రకటన ఉద్యోగులలో భద్రతను కలిగించాల్సిన సమయంలో మరింత అనిశ్చితిని రేకెత్తించవచ్చు. "సామర్థ్యం ఉన్నవారికి అవకాశాలు కల్పిస్తాం" అన్న మాట ఆశాజనకంగా ఉన్నా, సామర్థ్యం ఎవరికి ఉందన్న దానికి స్పష్టమైన ప్రమాణాలు లేకపోవడం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తుంది.
టీసీఎస్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను మెరుగుపరుచుకోవడానికి సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటున్నాయి. దీంతోపాటు ‘పాత పద్ధతుల్లో’ పనిచేస్తున్న ఉద్యోగులు వడపోతకు గురవుతున్నారు. ఈ దశలో ఉద్యోగులకు ఒక స్పష్టమైన సందేశం ఏమిటంటే.. "ఉద్యోగ భద్రత అనేది ఇకపై నైపుణ్యాలకు ముడిపడి ఉంది" ఏఐ నేరుగా ఉద్యోగాలను తొలగించకపోయినా, ఏఐ పెరుగుదల వల్ల మారుతున్న అవసరాలు మాత్రం ఉద్యోగ భద్రతను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి.