తమ్మినేని మౌన సంకేతాలు !

దాంతో అంతవరకూ ఆయన వెనక ఉండే మేనల్లుడు కూన రవికుమార్ టీడీపీ లోనే ఉండి అక్కడ తన సీటుని పదిలం చేసుకున్నారు.

Update: 2026-05-31 04:10 GMT

శ్రీకాకుళం జిల్లాలో ఒకనాడు రాజకీయంగా చక్రం తిప్పిన ఉద్ధండ పిండం తమ్మినేని సీతారాం. 1983 లో టీడీపీ నుంచి ఎంట్రీ ఇచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని అదే పార్టీలో ఆముదాల వలస నుంచి అనేక సార్లు గెలిచి మంత్రి పదవులు చేపట్టారు. అయితే ఆయన టీడీపీని వీడడమే రాజకీయంగా కొంత వెనుకబడటానికి కారణం అయింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. 2004 లో ఆముదాలవలసలో ఓటమి చెందిన తమ్మినేని సీతారాం 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరిపోయారు. దాంతో అంతవరకూ ఆయన వెనక ఉండే మేనల్లుడు కూన రవికుమార్ టీడీపీ లోనే ఉండి అక్కడ తన సీటుని పదిలం చేసుకున్నారు.

మామకు తగ్గ అల్లుడు :

ఇక తమ్మినేని ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమిని చవి చూసారు. ఆ తరువాత ఆయన వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసినా విజయం దక్కలేదు. 2019 లోనే ఆయన మళ్ళీ గెలవడం జరిగింది. అలా రెండు దశాబ్దాల తరువాత ఎమ్మెల్యే అయినా జగన్ మంత్రివర్గంలో మాత్రం చోటు దక్కలేదు. స్పీకర్ గా రాజ్యాంగ బద్ధ పదవిలో ఆయనను జగన్ ఉంచారు. అయిదేళ్ళ పాటు ఆ పదవిని నిర్వహించిన తమ్మినేని 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు. ఇక ఆయనను మొదట ఆముదాలవలసకు ఇంచార్జిగా నియమించినా తరువాత మాత్రం పార్టీలో ఉత్సాహవంతుడు అయిన రవి కుమార్ అనే ద్వితీయ శ్రేణి నేతకు ఇంచార్జి పగ్గాలు అప్పగించారు. దాంతో ఆగ్రహించిన తమ్మినేని నాటి నుంచి పార్టీకి కొంత దూరం పాటిస్తూ వస్తున్నారు. మరో వైపు కూన రవికుమార్ 2014లో 2024లో రెండు సార్లు మామ తమ్మినేని ఓడించి మరీ తగిన అల్లుడు అనిపించుకున్నారు ఆయన నియోజకవర్గంలో జోరు చేస్తున్నారు.

ఎటూ పాలుపోని స్థితిలో :

ఈ క్రమంలో తమ్మినేని ఫ్యామిలీ టీడీపీలోకి వెళ్ళాలంటే కుదిరే వ్యవహారం అయితే కాదని అంటున్నారు. పోనీ జనసేనలో చేరాలనుకున్నా కూడా అక్కడ కూడా బ్రేకులు పడ్డాయి. ఎందుకంటే ఇబ్బంది లేని నేతలనే మిత్రులు చేర్చుకోవాలన్న ఒక ఉమ్మడి అంగీకరం ఉంది అని అంటున్నారు. దాంతో వైసీపీలోనే అనివార్యంగా కొనసాగుతున్న తమ్మినేని ఫ్యామిలీకి అధినాయకత్వం నుంచి పూర్తి భరోసా అయితే దక్కడం లేదని అంటున్నారు. ఆ మధ్య తాడేపల్లికి వెళ్ళి జగన్ ని తమ్మినేని కలిసి వచ్చారు. పార్టీ కోసం బాగా పనిచేయాలని అన్ని విషయాలూ తాను చూసుకుంటాను అని అధినేత హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. కానీ ఆముదాలవలస సీటు మాత్రం ఎటూ తేల్చలేదన్న అసంతృప్తి తమ్మినేని వర్గంలో ఉంది. దాంతోనే పార్టీకి కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు అని అంటున్నారు.

ఎంపీ టికెట్ సైతం :

మరో వైపు చూస్తే శ్రీకాకుళం ఎంపీ టికెట్ ని ఈసారి కాళింగ సామాజిక వర్గానికే ఇవ్వాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. అయితే అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న కిల్లి కృపారాణీని పార్టీలోకి తీసుకుని ఆ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు అని ప్రచారం కూడా ఉంది. దాంతో తమ్మినేని ఫ్యామిలీకి ఎక్కడ సీటూ చోటూ అన్న చర్చ అయితే సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే ఎంపిక చేయాలని ఎలాంటి మొహమాటాలకు పోరాదని వైసీపీ హైకమాండ్ డిసైడ్ అయింది అని అంటున్నారు. మరో వైపు వైసీపీ నుంచి సస్పెండ్ అయిన దువ్వాడ శ్రీనివాస్ ని కూడా పార్టీలోకి తిరిగి తీసుకునే ఆలోచనలకు స్వస్తి చెప్పారని అంటున్నారు. మరి దువ్వాడ తమ్మినేని కలసి ఫ్యూచర్ పాలిటిక్స్ కి శ్రీకాకుళంలో శ్రీకారం చుడతారా లేక తమ్మినేని మౌనాన్ని సంకేతంగా భావించి పార్టీ ఆయనకు గట్టి భరోసా ఇస్తుందా అన్నది వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి చూస్తే తమ్మినేని తీవ్ర అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం మాత్రం గట్టిగానే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News