భారీ ఎత్తుగడతో స్టాలిన్.. మహిళల ఓట్లు కొల్లగొడతాడా?
తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రానున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార డీఎంకే కూటమి వేస్తున్న ఎత్తుగడలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.;
తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రానున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధికార డీఎంకే కూటమి వేస్తున్న ఎత్తుగడలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం పరిపాలన చర్యలేనా? లేక ఎన్నికల స్టంటా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకొని అమలు చేస్తున్న పథకాలు ప్రతిపక్షాలకు గట్టి సవాల్ విసురుతున్నాయి.
మహిళలే కీ ఫ్యాక్టర్..
ప్రస్తుత రాజకీయ గణాంకాల్లో మహిళా ఓటర్ల ప్రాధాన్యం అమితంగా పెరిగింది. ఓటర్ల జాబితాలో పురుషులకన్నా మహిళలే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, వారి మద్దతు గెలుపు–ఓటములను నిర్ణయించే స్థాయికి చేరింది. ఈ వాస్తవాన్ని బాగా అర్థం చేసుకున్న స్టాలిన్ ప్రభుత్వం ‘కలైజ్ఞర్ మగళిర్ ఉరిమై’ పథకం ద్వారా ఇప్పటికే నెలకు ₹1,000 అందిస్తుంది. ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో ఒక్కసారిగా ₹5,000 జమ చేయడం, భవిష్యత్తులో ₹2,000కి పెంచుతామని ప్రకటించడం ఇది కేవలం సంక్షేమమేనా? లేక రాజకీయ స్ట్రాటజీనా? అన్న చర్చకు దారితీసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 1.31 కోట్ల మంది మహిళల ఖాతాల్లో రూ.5,000 జమ కావడం రాజకీయంగా పెద్ద సంకేతంగా భావిస్తున్నారు. మోడల్ కోడ్ అమల్లోకి రాకముందే ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రతిపక్షాలకు గట్టి చెక్ పెట్టారన్న అభిప్రాయం డీఎంకే శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ప్రతినెలా అందే సహాయాన్ని అడ్డుకునే కుట్ర జరుగుతోందని చెబుతూ ముందస్తుగా మొత్తాన్ని జమ చేయడం ఇది స్టాలిన్ రాజకీయ చతురతకే నిదర్శనమని కూటమి నేతలు కొనియాడుతున్నారు.
దేశ వ్యాప్తంగా ఇదే ట్రెండ్..
మహిళా ఓటర్లను ఆకర్షించడంలో నగదు పథకాలు కీలకంగా మారాయి. తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల ఆవిర్భావానికి మహిళలకు నేరుగా నగదు అందించే పథకాలే కారణమని విశ్లేషణలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, బిహార్ వంటి రాష్ట్రాల్లోనూ ఎన్నికల ముందు నగదు బదిలీలు రాజకీయ ఫలితాలపై ప్రభావం చూపినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అందుకే స్టాలిన్ కూడా అదే ఫార్ములాను మరింత పదునుగా అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ‘సంక్షేమం పేరుతో ఓట్ల రాజకీయాలు’ జరుగుతున్నాయని అన్నాడీఎంకే, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే డీఎంకే వాదన మాత్రం ‘ఇది ఎన్నికల లంచం కాదు, హక్కు’ మహిళల ఆర్థిక స్వావలంబనకు, కుటుంబాల స్థిరత్వానికి ఈ పథకాలు దోహదపడుతున్నాయని చెబుతోంది.
వ్యూహాత్మక ముందడుగు?
ఎన్నికల సమయానికి సమీపంగా పింఛన్లు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, ఇతర సంక్షేమ పథకాల అమలు వేగవంతం కావడం కూడా రాజకీయంగా విశేషంగా చర్చకు దారి తీసింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, లబ్ధిదారుల్లో కనీసం 60 శాతం మంది డీఎంకే కూటమికి మద్దతిస్తే భారీ మెజారిటీ సాధ్యమని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది.
ప్రస్తుతం ప్రతిపక్షాల ముందు పెద్ద సవాల్ నిలిచింది. ఈ పథకాలకు ధీటుగా ప్రత్యామ్నాయ హామీలు ఇవ్వాలా? లేక సంక్షేమ రాజకీయాలపై నైతిక ప్రశ్నలు లేవనెత్తాలా? అన్న దానిపై అన్నాడీఎంకే కూటమి తర్జనభర్జనలు పడుతోంది. డీఎంకే మాత్రం మొదటి గోల్ వేసిందనే భావన కలిగిస్తోంది. పోస్టర్ల ప్రచారం, సోషల్ మీడియా సందేశాలు అందరూ ఒక కథనాన్ని నిర్మిస్తున్నారు ‘స్టాలిన్ ఇచ్చాడు.. కాపాడాడు’ అనే భావన బలపడుతోంది.
సంక్షేమమా? రాజకీయమా?
సంక్షేమం, రాజకీయ ప్రయోజనం.. ఈ రెండింటి మధ్య గీత ఎక్కడ? ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడం ప్రభుత్వ బాధ్యతే. కానీ ఎన్నికల ముందు భారీ నగదు బదిలీలు జరగడం రాజకీయ సమీకరణాలకు అనుసంధానం కావడం కూడా సహజమే. స్టాలిన్ ఎత్తుగడలు ఎన్నికల సమరంలో ఎంతవరకు ఫలిస్తాయో సమయమే చెప్తుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టం తమిళనాడు రాజకీయాల్లో మహిళా ఓటర్లే ఇప్పుడు అసలైన ‘కింగ్‌మేకర్స్’.
స్టాలిన్ ఈ వాస్తవాన్ని ముందుగానే గుర్తించి వేసిన అడుగు.. ప్రతిపక్షాలకు గట్టి హెచ్చరికగా మారింది. ఇప్పుడు ఒక్కటే ప్రశ్న.. ఈ సంక్షేమ సిక్సర్ ఓట్ల రూపంలో ఎంత దూరం ఎగిరిపోతుందన్నది!