తహవ్వుర్ రాణా అప్పగింత వేళ వైరల్ గా మోడీ పోస్టు

తాజాగా రాణాను భారత్ కు తీసుకొచ్చిన వేళ.. మోడీ గతంలో చేసిన ఒక పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.;

Update: 2025-04-11 04:35 GMT

ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. యూపీఏ విదేశాంగ విధానంతో పోలిస్తే.. గడిచిన పదేళ్లలో భారత విదేశాంగ పాలసీ ఎంత భారీగా పెరిగిందన్న విషయం తెలిసిందే. అంతేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా భారత్ ఇమేజ్ పెంచే విషయంలో మోడీ సర్కారు సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. తాజాగా ముంబయి ఉగ్రదాడికి సంబంధించి కీలక కుట్రదారు తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారతదేశానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాణాను భారత్ కు తీసుకొచ్చే విషయంలో ప్రధాని మోడీ పర్సనల్ గా తీసుకున్నారా? ఈ అంశానికి ఆయన విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

మొన్నటికి మొన్న అమెరికా పర్యటనలోనూ రాణా అంశాన్ని అమెరికా అధ్యక్షుడితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు చెబుతారు. ఈ కారణంగానే రాణా అప్పగింతపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం.. మీడియా సమావేశంలో ప్రస్తావించినట్లుగా చెబుతారు. తాజాగా రాణాను భారత్ కు తీసుకొచ్చిన వేళ.. మోడీ గతంలో చేసిన ఒక పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

అప్పట్లో ట్వీట్.. ఇప్పుడు పోస్టు అయిన సదరు సందేశంలో రాణా ఇష్యూలో తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు. ఈ పోస్టు దాదాపు 14 ఏళ్ల క్రితం నాటిది. 2011లో ఈ కేసుకు సంబంధించి అమెరికా కోర్టు కీలక తీర్పును ఇచ్చింది. అందులో ముంబయి దాడుల్లో రాణా ప్రత్యక్ష పాత్ర లేదని తేల్చింది. అదే సమయంలో ఈ దారుణ ఉగ్రకాండకు బాధ్యులైన ఉగ్రసంస్థకు అతడు అండగా నిలిచిన అభియోగాన్ని మాత్రం సమర్థిస్తూ దోషిగా తేల్చింది. ఈ అంశంపై అప్పట్లో మోడీ స్పందించారు.

సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. ముంబయి దాడుల ఘటనలో తహవ్వుర్ రాణాను అమాయకుడని యూఎస్ ప్రకటించటం.. భారత సార్వభౌమత్వాన్ని అవమానించటమే అవుతుందన్నారు. ‘‘మన దేశ విదేశాంగ విధానానికి ఇది భారీ ఎదురుదెబ్బ’’ అని పేర్కొన్నారు. రాణా ఎపిసోడ్ లో అప్పటి ప్రభుత్వ తీరును తప్పు పట్టిన మోడీ.. తాను అధికారంలో ఉన్న వేళ.. అందుకు భిన్నంగా రాణాను భారత్ కు తీసుకొచ్చి.. న్యాయస్థానం ముందు నిలబెట్టిన వైనం ఆయన ఇమేజ్ ను మరింత పెంచుతుందని చెప్పక తప్పుదు.

Tags:    

Similar News