కూటమి వర్సెస్ వైసీపీ: 'స్వింగ్' సాంగ్..!
కూటమి పార్టీలకు.. వైసీపీకి మధ్య ఉన్న ఓటు బ్యాంకు తేడా.. కేవలం 10 శాతమే. వీరి వల్లే.. కూటమి అధికారంలోకి రాగా.. వైసీపీ అధికారాన్ని కోల్పోయింది.;
కూటమి పార్టీలకు.. వైసీపీకి మధ్య ఉన్న ఓటు బ్యాంకు తేడా.. కేవలం 10 శాతమే. వీరి వల్లే.. కూటమి అధికారంలోకి రాగా.. వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. గత 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మూడు పార్టీలు కలిసిన నేపథ్యంలో 50 శాతం ఓటు బ్యాంకు(కాస్త అటు -ఇటుగా)ను మూడు పార్టీలు సొంతం చేసుకున్నాయి. ఇక, అంత ఒత్తిడిలోనూ వైసీపీ 40 శాతం(కాస్త అటు-ఇటుగా) ఓటు బ్యాంకును దక్కించుకుంది. మొత్తంగా అధికారంంలోకి వచ్చిన పార్టీలకు-ప్రతిపక్షంలో కూర్చున్న వైసీపీకి 10 శాతం ఓటు బ్యాంకు మాత్రమే తేడా!.
ఇక, దీనికి కారణం ఏంటి? వచ్చే ఎన్నికల్లో ఎలా దీనిని అధిగమించాలన్నది వైసీపీ ఆలోచన. ప్రధానంగా `స్వింగ్` ఓటర్ల కారణంగానే వైసీపీ నష్టపోయిందన్న వాదన ఉంది. అంటే.. ఎన్నికలకు ముందు వరకు కొంత మంది ఓటర్లు ఏ పార్టీకీ అనుకూలంగా ఉండరు. ఎన్నికలకు రెండు మాసాల ముందు నుంచి వచ్చే సర్వేలు.. ప్రజల్లో జరుగుతున్న ప్రచారం.. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాల నేపథ్యాన్ని పరిశీలించి.. గెలిచే పార్టీవైపు మొగ్గు చూపుతారు. వీరే అధికారంలోకి వచ్చే పార్టీని నిర్ణయిస్తారు. వీరినే స్వింగ్ అంటారు.
వీరికి ఒక స్థిరమైన అభిప్రాయం ఉండదు. కేవలం అప్పటికి ఉన్న ప్రచారం.. అప్పటికి ఉన్న పార్టీ హవా ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే అప్పట్లో కూటమికి మేలు చేసింది. అప్పట్లో ఓ చానెల్‌కు జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ``ఏం జరిగినా సిద్ధమే`` అన్న ఒకే ఒక్కమాట స్వింగ్ ఓటరును కూటమివైపు మళ్లేలా చేసింది. ఫలితంగా 10 శాతం ఓటు తేడాతో కూటమి విజయం దక్కించుకుంది. అందుకే ఇప్పుడు స్వింగ్ ఓటరును ఆకర్షించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎక్కడ ఎప్పుడు మైకు పట్టినా.. మనదే గెలుపు, ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.. వంటి అనేక విషయాలను ఆయన చెబుతున్నారు. తద్వారా అటు ఇటు కాని నిర్ణయంతో ఉండే ఓటరును తనవైపు ఆకర్షించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. కూటమి కూడా ఈ స్వింగ్ ఓటరు వైసీపీ వైపు మళ్లకుండా ప్రయత్నాలు చేస్తోంది. అందుకే.. జగన్ అధికారంలోకి రాడని.. వచ్చేది కూడా లేదని.. సీఎం నుంచి డిప్యూటీ సీఎం వరకు చెబుతున్నారు. సో.. మొత్తంగా స్వింగ్ ఓటరు పైనే పార్టీల ఆశలు ఉన్నాయన్నది వాస్తవం.