సునీతా విలియమ్స్‌ రోదసి యాత్రకు బ్రేక్... నాసా చెప్పిన రీజన్ ఇదే!

వారు వెళ్లాల్సిన బోయింగ్‌ స్టార్‌ లైనర్‌ వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్‌ లో సాంకేతికత లోపం తలెత్తడమే దీనికి కారణం అని చెబుతున్నారు.

Update: 2024-05-07 07:09 GMT

భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:04 గంటలకు ఆమె అంతరిక్ష యాత్ర చేపట్టాల్సి ఉంది. అయితే... అనూహ్యంగా ఆ రోదసి యాత్ర నిలిచిపోయింది. ఈ మేరకు అందుకు గల కారణాలను నాసా ప్రకటించింది. తిరిగి ఎప్పుడు చేపడతారనేది వెల్లచడించలేదు.

అవును... సునీతా విలియమ్స్‌ రోదసి యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన బోయింగ్‌ స్టార్‌ లైనర్‌ వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్‌ లో సాంకేతికత లోపం తలెత్తడమే దీనికి కారణం అని చెబుతున్నారు. మంగళవారం ఉదయం రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా... చివర్లో గుర్తించిన లోపం కారణంగా ప్రస్తుతానికి ఈ మిషన్‌ ను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది.

వాస్తవానికి ముందుగా ప్రకటించినట్లుగానే ఈ రోజు ఉదయం ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ లో ఉన్న కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి బోయింగ్‌ కు చెందిన అట్లాస్‌ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధమైంది. అయితే... బయలుదేరడానికి సరిగ్గా 90 నిమిషాల ముందు ఈ మిషన్‌ ను ఆపేస్తున్నట్లు నాసా ప్రకటించింది.

అందుకు గల కారణాన్ని చెబుతూ... రాకెట్‌ లోని ఆక్సిజన్‌ రిలీఫ్‌ వాల్వ్‌ పనితీరు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించామని నాసా వెల్లడించింది. అయితే... అప్పటికే వ్యోమనౌకలోకి ప్రవేశించిన సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌ మోర్‌ ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాగా... తాజా మిషన్‌ లో భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వారం పాటు బసచేయాలనేది ప్రణాళిక అనే సంగతి తెలిసిందే.

Read more!

వాస్తవానికి ఈ స్టార్‌ లైనర్‌ అభివృద్ధిలో ఇప్పటికే అనేక ఇబ్బందులు తలెత్తాయి. ఇందులో భాగంగా... 2019లో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్టార్‌ లైనర్‌ తొలి మానవరహిత యాత్ర అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను చేరుకోలేకపోయింది. అనంతరం చేపట్టిన మరో యాత్రలో పారాచూట్‌ సమస్యలు తలెత్తాయి. దీంతో ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది.

ఈ క్రమంలో తాజాగా ఈ స్టార్‌ లైనర్‌ తో మానవసహిత యాత్ర నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే... అనూహ్యంగా రాకెట్‌ లోని ఆక్సిజన్‌ రిలీఫ్‌ వాల్వ్‌ పనితీరు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించబడటంతో ఈ యాత్ర నిలిచిపోయింది. ఫలితంగా... సునీత విలియమ్స్‌ మూడో అంతరిక్ష యాత్రకు బ్రేక్ పడినట్లయ్యింది!

Tags:    

Similar News