ఈసారి సమ్మర్ ఎంతో హాట్.. మార్చిలోనే వడగాలులు!

సమ్మర్ వచ్చేసింది. ఫిబ్రవరిలో చలి.. మార్చిలో వాతావరణంలో ఒకింత మార్పు సర్వసాధారణం

Update: 2024-03-28 04:31 GMT

సమ్మర్ వచ్చేసింది. ఫిబ్రవరిలో చలి.. మార్చిలో వాతావరణంలో ఒకింత మార్పు సర్వసాధారణం. రోటీన్ కు భిన్నంగా ఈసారి మార్చి మాత్రం మంట పుట్టేలా చేసింది. మార్చిలో ఎప్పుడూ లేనంతగా వేడి తీవ్రతతో జనం అల్లాడిపోయిన పరిస్థితి. అప్పుడే సమ్మర్ వచ్చేసిందా? అన్నట్లు మారింది. ఈసారి సమ్మర్ చాలా హాట్ అన్న మాటకు అర్థం అందరికి అర్థమైపోతున్న పరిస్థితి. సాధారణంగా శివరాత్రి తర్వాత కానీ మొదలయ్యే ఎండలకు బదులుగా దాదాపు మూడు వారాలకు ముందే మొదలయ్యాయి.

భారతదేశంలో ఈసారి వేసవి కాలం ఎలా ఉంటుందన్న అంశానికి సంబంధించి అమెరికాకు చెందిన వాతావరణ శాస్త్రవేత్తల టీం (క్లైమైట్ సెంట్రల్) అంచనా తెలిస్తే చెమటలు పట్టాల్సిందే. మార్చి చివరి నాటికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు సరికొత్త స్థాయికి నమోదు అవుతాయని చెబుతున్నారు. 40 ప్లస్ కు వెళ్లే వీలుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. ఏప్రిల్ మధ్యలో మొదలు కావాల్సిన వడగాలులు మార్చి చివరకే మొదలవుతాయని వెల్లడించారు.

గతంలో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో (మహారాష్ట్ర, బిహార్, ఛత్తీస్ గఢ్) మాత్రమే మార్చిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. తాజాగా మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్.. గుజరాత్, మధ్యప్రదేవ్.. ఒడిశాతో సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40డిగ్రీలను దాటేయనున్నట్లుగా పేర్కొన్నారు. అమెరికా వాతావరణ నిపుణులు మన దేశంలో 1970 నుంచి ఇప్పటివరకు మార్చి.. ఏప్రిల్ లో నమోదయ్యే ఉష్ణోగ్రతల తీరు తెన్నుల్ని విశ్లేషించారు. ఈ క్రమంలో వారుగుర్తించిన అంశం ఏమంటే.. ఈ నెలాఖరు నాటికి దేశంలోని 51 నగరాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేయనున్నట్లు తేల్చారు.

అంతకంతకూ పెరుగుతున్న ఈ ఉష్ణోగ్రతలకు పరిష్కారం ఏమిటి? అన్నదిప్పుడు వస్తున్న ప్రశ్న. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఇప్పటి పరిస్థితి వచ్చిందని చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాతావరణాన్ని చల్లబర్చటమే సమస్యకుపరిష్కారం. దీనికి భారీ ఎత్తున పచ్చదనాన్ని పెంచటం.. పరిశ్రమలు.. వాహనాల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను తగ్గించటం ద్వారా సమస్య తీవ్రతను కాస్త తగ్గించే వీలుందన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. రెండు మూడు రోజుల తర్వాత నుంచి మొదలయ్యే గరిష్ఠ ఉష్ణోగ్రతలను ఎదుర్కోవటానికి వీలుగా రెఢీ కావాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News