అపాయింట్మెట్ కూడా ఇవ్వడం లేదు.. పవన్ పై సుగాలి ప్రీతి తల్లి షాకింగ్ కామెంట్స్

ఎన్నికలకు ముందు ప్రచారం కోసం తమను వాడుకున్నారని, ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు.

Update: 2026-05-26 18:06 GMT

సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసులో తమకు న్యాయం చేయాలంటూ ఆమె తల్లి సుగాలి పార్వతి, తండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కలిశారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని, ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు జగన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలకు ముందు ప్రచారం కోసం తమను వాడుకున్నారని, ఇప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని వాపోయారు.

మాజీ సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం సుగాలి ప్రీతి తల్లి పార్వతి మీడియాతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు సుగాలి ప్రీతి కేసును పవన్ కల్యాణ్ రాజకీయంగా వాడుకున్నారని ఆరోపించారు. ‘‘మాకు న్యాయం చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పూర్తిగా విస్మరించారు. తమ కుమార్తె కేసు విషయమై మాట్లాడేందుకు పవన్ కల్యాణ్ అపాయింట్‌మెంట్ కోరితే కనీసం సమయం కూడా ఇవ్వడం లేదు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఇంతలా హింసించడం పవన్ కల్యాణ్‌కు సబబేనా? అని ఆమె నిలదీశారు.

2017-19 మధ్య కాలంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కేసు సాక్ష్యాలన్నీ తారుమారయ్యాయని, ఈ విషయాలన్నీ పవన్ కల్యాణ్‌కు తెలిసి కూడా ఎందుకు నాడు మాటిచ్చారని పార్వతి ప్రశ్నించారు. తమ కుమార్తెకు న్యాయం జరిగి, దోషులకు శిక్ష పడేవరకు తాము పోరాడుతూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై కూడా ప్రీతి తల్లిదండ్రులు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామనే నెపంతో తమ కుటుంబానికి రావాల్సిన పెన్షన్‌ను కూడా స్థానిక అధికారులు నిలిపివేశారని వారు వైఎస్ జగన్ ఎదుట వాపోయారు. గతంలో తమకు కేటాయించిన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు సహాయం చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని పలుమార్లు వేడుకున్నా, తమ గోడును ఎవరూ పట్టించుకోవడం లేదని వారు కన్నీరు పెట్టుకున్నారు.

న్యాయ సహాయంపై జగన్ భరోసా

ప్రీతి తల్లిదండ్రుల ఆవేదనను సావధానంగా విన్న మాజీ సీఎం జగన్ రెడ్డి వారికి న్యాయ సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరిగేలా తమ పార్టీ అన్ని విధాలా కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రీతి కుటుంబానికి అందించిన ఆర్థిక, సామాజిక సహాయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా వైఎస్సార్‌సీపీ ఆ కుటుంబానికి తోడుగా ఉంటుందని, అవసరమైన పూర్తి చట్టపరమైన, న్యాయ సహాయాన్ని అందిస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు.



Tags:    

Similar News