చంద్రబాబు vs సుబ్రహ్మణ్యస్వామి.. తెరవెనుక కథ ఇదే!

ఏపీ రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేస్తుంటారు.;

Update: 2026-02-24 09:51 GMT

ఏపీ రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రి సుబ్రహ్మణ్యస్వామి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. తమిళనాడుకు చెందిన సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేస్తుంటారు. మేధావిగా, న్యాయపోరాటల యోధుడిగా ఆయన అందరికీ సుపరిచితుడు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వంటి వారిపై కోర్టుల్లో కేసులు వేసి ముప్పతిప్పలు పెట్టిన సుబ్రహ్మణ్యస్వామి ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ గా చేసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా ఏపీ రాజకీయ వ్యవహరాలు, రాజకీయ సంబంధిత వివాదాలలో జోక్యం చేసుకుంటున్న సుబ్రహ్మణ్యస్వామి సీఎం చంద్రబాబును తీవ్రంగా విభేదిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో విపక్షం వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న సంకేతాలు ఇస్తున్నారని అంటున్నారు.

ఏపీ రాజకీయాలపై సుబ్రహ్మణ్యస్వామి జోక్యానికి కారణమేంటి అన్న అంశంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టులో కేసు వేసిన సుబ్రహ్మణ్యస్వామి, తాజాగా ఏకసభ్య కమిషన్ నియామకాన్ని సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేశారు. అయితే ఈ రెండు కేసుల విషయంలో తెరపై సుబ్రహ్మణ్యస్వామి కనిపిస్తున్నా, తెరవెనుక వైసీపీ పెద్దల ప్రోద్బలం ఉందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్యస్వామి ఆ పార్టీ భాగస్వామిగా ఉన్న సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయడం ఆసక్తి కలిగిస్తోందని అంటున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి అంత వ్యతిరేకత పెంచుకోడానికి కారణాలు ఏంటి? అన్న ప్రశ్న తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తోంది. గత ప్రభుత్వం నుంచి చంద్రబాబును ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్న మీడియాపైన సుబ్రహ్మణ్యస్వామి విమర్శలు గుప్పిస్తూ కోర్టుల్లో కేసులు వేస్తూ మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండగా స్కిల్ స్కాంలో అరెస్టు చేయడాన్ని సుబ్రహ్మణ్యస్వామి సమర్థించారు. అంతేకాకుండా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తాయని ముద్రపడిన రెండు పత్రికలు టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా కథనాలు ప్రసారం చేశాయని రూ.100 కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

ఒక విధంగా చెప్పాలంటే వైసీపీ రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదనే సమయంలో సుబ్రహ్మణ్యస్వామి ఎంట్రీ ఇవ్వడం, వైసీపీని రక్షించే ప్రయత్నాలు చేయడం అందరిని ఆలోచనకు గురిచేస్తోంది. చంద్రబాబుపై అంత వ్యతిరేకతకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిపై ప్రేమ చూపడానికి కారణాలు ఏంటై ఉంటాయని అంతా ఆరా తీస్తున్నారు. అయితే 2022లో రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేసిన సుబ్రహ్మణ్యస్వామి తిరిగి సభలో అడుగు పెట్టేందుకు వైసీపీ ద్వారా ప్రయత్నాలు చేశారని, ఆ ప్రయత్నాలు సఫలం అవ్వకపోయినా వైసీపీపై వాత్సల్యం చూపుతున్నట్లు వ్యవహరించడమే అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు.

నిజానికి సుబ్రహ్మణ్యస్వామి వ్యవహారశైలి గురించి తెలిసిన వారు.. ఆయన ప్రస్తుత నడవడికను చూసి నమ్మలేకపోతున్నారని అంటున్నారు. ఒకప్పుడు సోనియాగాంధీ, జయలలితలను కోర్టులకు ఈడ్చి నానా అవస్థలకు గురిచేసిన సుబ్రహ్మణ్యస్వామి ఆ తర్వాతి కాలంలో వారితో కలిసి పనిచేసిన సంఘటనలను ఉదహరిస్తున్నారు. అదేవిధంగా తన పార్టీని బీజేపీలో విలీనం చేసి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు బాగా దగ్గరైన సుబ్రహ్మణ్యస్వామి ఆ తర్వాతి కాలంలో ఆ ఇద్దరిపై బహిరంగ విమర్శలు చేసి షాక్ ఇచ్చారని చెబుతారు. ఎప్పుడూ స్థిరమైన రాజకీయ పోరు చేయని సుబ్రహ్మణ్యస్వామి ఎప్పుడు ఎలా మారతారో చెప్పడం కష్టమని అంటున్నారు.

రాజ్యసభ సభ్యత్వం ఆశతో వైసీపీకి దగ్గరైన సుబ్రహ్మణ్యస్వామి ఆ ప్రయత్నం సఫలం అవకపోయినా, ఇప్పటికీ ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడమే చర్చకు దారితీస్తోంది. గత ప్రభుత్వంలో వైసీపీ కష్టాలను ఎదుర్కొన్న సమయంలో ఆపద్భాంధవుడిలా ఆదుకున్న సుబ్రహ్మణ్యస్వామికి ఒకానొక దశలో రాజ్యసభకు నామినేట్ చేయాలని వైసీపీ ఆలోచన చేసిందని అంటున్నారు. అయితే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతుండటం వల్ల బీజేపీ ఆగ్రహానికి గురికావాల్సివస్తుందనే ఆలోచనతో వెనక్కి తగ్గిందని అంటున్నారు. ఈ కారణంగా బీజేపీపై పగ సాధించడానికి చంద్రబాబును సుబ్రహ్మణ్యస్వామి లక్ష్యంగా చేసుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సుబ్రహ్మణ్యస్వామి మైండ్ సెట్ తెలిసిన వారు ఆయన ఎప్పుడైనా యూటర్న్ తీసుకునే అవకాశాలు లేకపోలేదని విశ్లేషిస్తున్నారు.

Tags:    

Similar News