ఆ నియోజకవర్గాల్లో భర్తలు, భార్యలు ఉల్టాపల్టా!

కాగా అభ్యర్థుల పేర్లలో పలు మార్పులు చేసిన వైఎస్‌ జగన్‌ కొన్ని చోట్ల భర్తలకు బదులుగా భార్యలకు, భార్యలకు బదులు భర్తలకు చోటు ఇచ్చారు.

Update: 2024-01-12 04:10 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని తపిస్తున్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మూడో విడత జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడో విడతలో అసెంబ్లీ, లోక్‌ సభ కలిపి 21 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

కాగా అభ్యర్థుల పేర్లలో పలు మార్పులు చేసిన వైఎస్‌ జగన్‌ కొన్ని చోట్ల భర్తలకు బదులుగా భార్యలకు, భార్యలకు బదులు భర్తలకు చోటు ఇచ్చారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి.

2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పిరియా సాయిరాజ్‌ పోటీ చేశారు. అయితే ఈసారి ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. శ్రీకాకుళం జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ గా ఉన్న సాయిరాజ్‌ భార్య పిరియా విజయకు సీటు ఇచ్చారు.

పిరియా విజయకు ఇచ్చాఫురం సీటు ఇవ్వడంతో ఆమెను జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ పదవి నుంచి తప్పించారు. ఆ పదవిని జెడ్పీటీసీగా ఉన్న మరో మహిళ ఉప్పాడ నారాయణమ్మకు కేటాయించారు.

ఇక 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా వైసీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయిన దువ్వాడ శ్రీనివాస్‌ కు టెక్కలి సీటును కేటాయించారు. 2019 ఎన్నికల్లో దువ్వాడ శ్రీనివాస్‌ ఓటమి పాలయ్యాక ఆయన భార్య దువ్వాడ వాణి ఆయనపై పలు విమర్శలు చేశారు. తన భర్త పలు అక్రమాలకు పాల్పడుతున్నారని మీడియా సాక్షిగా ఆరోపించారు. దీంతో దువ్వాడను పక్కనపెట్టిన వైఎస్‌ జగన్‌.. దువ్వాడ వాణిని టెక్కలి వైసీపీ ఇంచార్జిగా నియమించారు. ఇందుకు దువ్వాడ శ్రీనివాస్‌ సైతం అంగీకరించారు.

Read more!

ఇన్నాళ్ల నుంచి దువ్వాడ వాణినే టెక్కలి నియోజకవర్గంలో వైసీపీ తరఫున పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో దువ్వాడ వాణిని తప్పించారు. మళ్లీ ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్‌ కు టికెట్‌ కేటాయించడం విశేషం. దువ్వాడ శ్రీనివాస్‌ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.

దువ్వాడ శ్రీనివాస్, ఆయన భార్య మధ్య ఉన్న కలహాల నేపథ్యంలో గతంలో వీరిద్దరూ ఒక రాజీకి వచ్చారు. ఈ క్రమంలోనే తనకు బదులుగా తన భార్య వాణికి ఇంచార్జి పదవిని ఇవ్వాలని స్వయంగా దువ్వాడ శ్రీనివాసే కోరారు. ఇన్నాళ్లూ ఆమే టెక్కలి వైసీపీ కార్యకలాపాలను పర్యవేక్షించారు. అయితే ఇప్పుడు దువ్వాడ వాణిని నియోజకవర్గ ఇంచార్జిగా తప్పించి ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్‌ ను అభ్యర్థిగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags:    

Similar News