శ్రీకాకుళం తొలి మేయర్ ఎవరంటే ?

అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక గెజిట్ ద్వారా శ్రీకాకుళం కార్పొరేషన్‌లో ఏడు పంచాయతీలను విలీనం చేశారు.

Update: 2026-10-04 10:30 GMT

ఎట్టకేలకు శ్రీకాకుళం కార్పోరేషన్ కి ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. మూడు రోజుల క్రితం హైకోర్టు తీర్పు వెలువడింది. దాంతో ఈసారి న్యాయపరంగా ఇబ్బందులను అధిగమిస్తూ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టుదలగా ఉంది. ఈ మధ్యనే శ్రీకాకుళం పార్టీ నేతలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో కూడా టీడీపీ అధినాయకత్వం కార్పోరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని దిశా నిర్దేశం చేసింది. 2005లో చివరి సారిగా శ్రీకాకుళం మునిసిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత మునిసిపాలిటీని కార్పొరేషన్ గా విస్తరించే క్రమంలో వివిధ పంచాయతీలను విలీనం చేశారు. అయితే శ్రీకాకుళం కార్పోరేషన్ లో పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టుకు వెళ్ళారు.

ఎన్నికలు లేకుండానే :

అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక గెజిట్ ద్వారా శ్రీకాకుళం కార్పొరేషన్‌లో ఏడు పంచాయతీలను విలీనం చేశారు. ఇందులో ఎచ్చెర్ల నియోజకవర్గానికి చెందిన కుశాలపురం, తోటపాలెం లతో పాటు శ్రీకాకుళం మండలానికి చెందిన చాపురం, పాత్రునివలస, కిల్లిపాలేం, పెద్దపాడు, ఖాజీపేట ఉన్నాయి. కార్పోరేషన్ లో తమ పంచాయతీలు ఉంటే పన్నుల భారం పెరుగుతుందని ప్రజల ఆందోళన మేరకు కోర్టులో కేసులు వేశారు. దాంతో గత పదహారేళ్ళుగా ఎన్నికలు లేకుండానే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో శ్రీకాకుళం కార్పోరేషన్ ఉంది. అయితే ఇపుడు ఆ ఏడు పంచాయతీలను పక్కన పెట్టేసి ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించారు. అంతే కాదు యాభై వార్డులను అరవై వార్డులుగా పెంచుతూ ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆలోచిస్తున్నారు.

ఆ రికార్డు కోసం :

శ్రీకాకుళం కార్పోరేషన్ కి తొలిసారి ఎన్నికలు జరిగితే మొదటి మేయర్ గా చరిత్రలో నిలిచిపోయేందుకు సీనియర్ నేతలు అంతా ఎవరి ప్రయత్నాలలో వారు ఉన్నారు టీడీపీ నుంచి అయితే అనేక మంది నాయకులు రంగంలోకి వస్తున్నారు. వీరిలో అర్థ బలం అంగ బలం ఉన్న వారు కూడా మేయర్ సీటు మీద ఆశలు పెట్టుకున్నారు. సామాజిక వర్గాల పరంగా కూడా మేయర్ పీఠం మీద పలువురి కన్ను ఉంది. శ్రీకాకుళం పట్టణంలో కాళింగ కోమట్లు కూడా ఈ సీటు కోరుతున్నారు. సహజంగానే వెలమల రాజకీయ ప్రాధాన్యత ఉంది. ఇక తూర్పు కాపులు సైతం మేయర్ పదవి కోసం చూస్తున్నారు. అయితే ఈ మేయర్ పదవిని టీడీపీ తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీ దేవికి టికెట్ ఇస్తారని ఒక వైపు ప్రచారం ఉంటే కింజరాపు ఫ్యామిలీ డిసైడ్ చేసిన వారే మేయర్ అవుతారు అని అంటున్నారు.

ధర్మానదే భారం :

ఇక వైసీపీలో చూస్తే మాజీ మంత్రి శ్రీకాకుళం అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అయిన ధర్మాన ప్రసాదరావుదే మేయర్ ఎన్నికల భారం అంతా అని అంటున్నారు. ఆయన సరైన అభ్యర్ధిని నిర్ణయించి పోటీకి దింపుతారు అని పార్టీ వర్గాలు అంటున్నాయి. కూటమిలో లుకలుకలు ఉంటే తమకు కలసి వస్తాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కూటమి పాలన పట్ల వ్యతిరేకత ఉందని అది తమకు అనుకూలం అవుతుందని కూడా ఆశలు పెట్టుకుంటున్నారు. ఇక శ్రీకాకుళం మేయర్ సీటు మహిళలకు రిజర్వ్ అవుతుందని టాక్ నడుస్తోంది. అలా అయితే తొలి మేయర్ ఆమె అవుతుందని కూడా అంటున్నారు.

Tags:    

Similar News