పుస్తక ప్రచారమా? సానుభూతి రాజకీయమా? సోనియా తాజా వ్యాఖ్యలపై భిన్న వాదనలు!
| దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యపై సోనియా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంకతో జరిగిన చిట్‌చాట్‌లో రాజీవ్ భద్రతను ఉద్దేశపూర్వకంగానే తొలగించారని ఆరోపించారు. ఆయన హత్యకు ముందే కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సైతం తండ్రి భద్రత ఉపసంహరణ వెనుక ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించడంతో రాజకీయంగా చర్చ మొదలైంది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హతమార్చాలనే కుట్రపై సోనియా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మాజీ ప్రధాని రాజీవ్ హత్య జరిగి మూడున్నర దశాబ్దాల తర్వాత సోనియా గాంధీ వ్యక్తం చేసిన అనుమానాలు తీవ్ర సంచలన చర్చకు దారితీశాయని అంటున్నారు. సోనియా ఆత్మకథ 'బిలాంగింగ్ : ఎ జర్నీ ఆఫ్ లవ్'లో రాజీవ్ మరణంపై తనకు ఉన్న అనుమానాలను ఎక్కడా నేరుగా ప్రస్తావించలేదని అంటున్నారు. కానీ, ఆ పుస్తక విశేషాలపై కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీతో నిర్వహించిన చిట్ చాట్ లో రాజీవ్ హత్యకు ముందు కుట్ర జరిగిందని సోనియా చెప్పడం, దానిపై రాహుల్ గాంధీ ప్రతిస్పందించిన తీరు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు రేపుతున్నాయి.
ఈ ప్రత్యేక సంభాషణలో రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేసిన పర్యటనల గురించి సోనియా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజీవ్ ఓపెన్ జీపులో ప్రయాణిస్తున్నప్పుడు రాళ్ల దాడి, నిరసనలు ఎదురయ్యాయని, బిహార్ పర్యటన తన ఆందోళనను పతాక స్థాయికి చేర్చిందని ఆమె వివరించారు. ఆ సమయంలో సంబంధిత అధికారులు ఆయన భద్రతపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదని సోనియా ఆరోపించారు. రాజీవ్ భద్రతను తొలగించడం అనేది కేవలం అనుకోకుండా జరిగిన సంఘటన కాదని, ఆయనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే కావాలని భద్రతను ఉపసంహరించారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు.
అప్పట్లో ఆ పర్యటనలో తండ్రి వెంట ఉన్న రాహుల్ గాంధీ, అక్కడి పరిస్థితులను చూసి ఇంటికి తిరిగి వచ్చాక "అమ్మా, నాన్న భద్రత విషయంలో మనం ఏదో ఒకటి చేయకపోతే, అతి త్వరలోనే నేను ఆయన అంత్యక్రియలకు తిరిగి రావాల్సి వస్తుందని నాకు తెలుసు" అని ఆవేదన వ్యక్తం చేశారని సోనియా వెల్లడించారు. 500 పేజీలకు పైగా ఉన్న ఈ పుస్తకంలోనూ అమ్మ ఇంకా కొన్ని విషయాలను రాయకుండా వదిలేశారని, నాన్న భద్రతను ఉపసంహరించుకోవడం వెనుక ఒక ఉద్దేశం ఉందని రాహుల్ గాంధీ సైతం ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించడం ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది.
అయితే, మూడున్నర దశాబ్దాల తర్వాత సోనియా గాంధీ ఈ స్థాయిలో ఆరోపణలు చేయడంపై జాతీయ రాజకీయాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం పుస్తక ప్రచారం కోసమో లేక రాజకీయంగా సానుభూతి కూడగట్టే ఉద్దేశంతోనో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారా అనే చర్చ ఒకవైపు జోరుగా సాగుతోంది. మరోవైపు, రాజీవ్ గాంధీని హతమార్చాలనే ఉద్దేశంతోనే భద్రతను తొలగించారనేదానికి సోనియా వద్ద ఏమైనా నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఒకవేళ ఆమె వద్ద బలమైన ఆధారాలు ఉంటే, హత్య జరిగిన తర్వాత ఇన్నాళ్లు, ముఖ్యంగా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలోనైనా ఈ విషయమై ఎందుకు బహిరంగంగా మాట్లాడలేదని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
అప్పట్లో జరిగిన విచారణ కమిషన్ల నివేదికలు, ఎస్పీజీ భద్రత ఉపసంహరణ చుట్టూ నడిచిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తేవడం వెనుక ఉన్న ఆంతర్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సోనియా వ్యాఖ్యల ఫలితంగా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా లాభం జరుగుతుందా లేక నష్టం వాటిల్లుతుందా అనే విశ్లేషణలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. గాంధీ కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను, ఎదుర్కొన్న విషాదాలను మళ్లీ గుర్తుచేయడం ద్వారా పార్టీ కార్యకర్తల్లో భావోద్వేగ బంధం బలపడి, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని కాంగ్రెస్ వర్గాలు ఆశిస్తున్నాయి.
కానీ, వర్తమాన రాజకీయాల్లో ప్రజా సమస్యలు, ఆర్థిక అంశాలపై పోరాడాల్సిన సమయంలో 35 ఏళ్ల క్రితం నాటి ఘటనను లేవనెత్తడం వల్ల ప్రత్యర్థి పార్టీలకు విమర్శించే అవకాశం ఇచ్చినట్లవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. పైగా, అప్పట్లో భద్రత ఉపసంహరించిన ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చిన పార్టీలు, నాటి రాజకీయ సమీకరణాలపై మళ్లీ చర్చ మొదలైతే అది కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారే ప్రమాదమూ లేకపోలేదని భావిస్తున్నారు. మొత్తానికి, ఒక ఆత్మకథ ఆవిష్కరణ నేపథ్యంలో మొదలైన కుటుంబ సంభాషణ, ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందని అంటున్నారు.