కన్నీళ్లు ఆగవు: 'హిజాబ్' లేదని.. 74 కొరడా దెబ్బలు!
| హిజాబ్ లేకుండా సంగీత ప్రదర్శన ఇచ్చిన ఇరాన్ గాయని పరాస్తూ అహ్మదీకి 74 కొరడా దెబ్బల శిక్ష విధించినట్లు కథనం పేర్కొంది. 2024 డిసెంబర్‌లో ఆమె నిర్వహించిన కచేరీ వీడియో వైరల్ కావడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు సహకరించిన ముగ్గురు సంగీతకారులపైనా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. రెండేళ్ల పాటు ప్రదర్శనలు, విదేశీ ప్రయాణాలు, సోషల్ మీడియా పోస్టులపై నిషేధం విధించినట్లు వార్తలు రావడంతో అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ప్రపంచ వ్యాప్తంగా మహిళా స్వేచ్ఛ, రాజ్యాధికారం గురించి మాట్లాడుకునే రోజుల్లో ఉన్నాం. వారికి రాజకీయంగానే కాకుండా.. అధికార పరంగా కూడా హక్కులు ఇస్తున్నారు. రిజర్వేషన్లు కల్పించి.. సమాజంలో సమాన భాగస్వా మ్యాన్ని కూడా కల్పిస్తున్నారు. కానీ, ఇరాన్ ఇంకా పాతకాలపు వాసనల నుంచి కోలుకున్నట్టు కనిపించడం లేదు. మహిళల హక్కులు అసలు వారికి పట్టవు. మహిళలు అంటే.. అన్నీ ముడుచుకుని ఇంట్లో కూర్చోవాలని, లేదా.. తాము ఏర్పాటు చేసిన చట్టం పరిధిలోనే ఉండాలని భావిస్తున్నారు. వీటిలో ఏది హద్దు మీరినా న్యాయ వ్యవస్థపేరుతో దారుణాలకు తెగబడుతున్నారు.
ఇరాన్‌లో తాజాగా.. వెలుగు చూసిన ఓఘటన ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఇరాన్‌కు చెందిన ప్రముఖ గాయని పరాస్తూ అహ్మదీ హిజాబ్ లేకుండా పాట పాడినందుకు ఆమెకు 74 కొరడా దెబ్బల శిక్షను అక్కడి అధికారులు అమలు చేయడం తాజాగా తీవ్ర సంచలనం రేపుతోంది. కేవలం ఆమె మాత్రమే కాదు.. ఆమెకు సహకరించిన ఇతర మేల్ సిబ్బందికి కూడా ఇదే శిక్ష విధించారు. అంతేకాదు.. వీరు రెండేళ్ల పాటు ఎక్కడా సంగీత ప్రదర్శనలు ఇవ్వకుండా, సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టకుండా కోర్టు నిషేధం విధించింది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
అసలేంటి హిజాబ్?
హిజాబ్ అనేది ముస్లిం మహిళలు తల, జుట్టు, మెడను కప్పుకోవడానికి ధరించే వస్త్రం. ఇందులో ముఖం మాత్రమే కనిపిస్తుంది.అందునా.. బుగ్గలు, కళ్లు, ముక్కు మాత్రమే కనిపిస్తాయి. కనుబొమలు కూడా కనిపించకూడదన్నది ఇరాన్ పెట్టిన నిషేధం. అయితే, 2024 డిసెంబర్‌లో ఇరాన్‌లోని కోమ్ నగరానికి సమీపంలోని ఒక చారిత్రక ప్రదేశంలో గాయని పరాస్తు.. ఒక మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. అందులో హిజాబ్ ధరించకుండా పాట పాడి, ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఆ వీడియోకు 33 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఆనందం అంతా ఇంతాకాదు. కానీ, ఇంతలోనే ఇరాన్ అధికారులు కత్తి దూశారు. `హిజాబ్` లేకుండా ప్రదర్శన ఏంటి? అంటూ.. ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అంతేకాదు.. ఆ కచేరీకి సంగీత సహకారం అందించిన మరో ముగ్గురిని(వీరు పురుషులు) అరెస్టు చేశారు. దీనిపై సుదీర్ఘంగా సాగిన విచారణ అనంతరం.. ప్రజా నైతికతను దెబ్బతీశారన్న అభియోగంపై కోర్టు ఆమెతో పాటు, ఆ ప్రదర్శనలో పాల్గొన్న బృంద సభ్యులకు తలా 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది.
అదనంగా రెండేళ్ల పాటు సంగీత కార్యక్రమాలు, విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించింది. సోషల్ మీడియాలో రెండేళ్ల వరకు పోస్టులు పెట్టరాదని కూడా ఆదేశించింది. ఈ వ్యవహారంపై మహిళల కోసం ప్రపంచ వ్యాప్తంగా పనిచేసే ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్.. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు స్పందించాయి. అత్యంత క్రూరమైన, అమానవీయ చర్యగా పేర్కొన్నాయి. కానీ, ఇరాన్ మాత్రం దీనిని సమర్థించుకుంది. ``ఇది అల్లా విధించిన క్రమశిక్షణ`` అని అధికారిక పత్రం విడుదల చేయడం గమనార్హం.