దేశ విభజన...సోనియా నోట పెద్ద మాట !
అఖండ భారతం ఎన్ని విధాలుగా విడిపోయి ఇబ్బంది పడుతున్నదో అందరికీ తెలిసిందే.;
అఖండ భారతం ఎన్ని విధాలుగా విడిపోయి ఇబ్బంది పడుతున్నదో అందరికీ తెలిసిందే. బ్రిటిష్ వారి రూలింగ్ ఉండగానే 18వ శతాబ్దం మధ్యలోనే ఆఫ్ఘనిస్తాన్ ని వేరు చేశారు. ఇక 1947 నాటికి పాకిస్థాన్ గా ప్రత్యేక దేశం ఏర్పడి భారత్ నుంచి విడిపోయింది. ఈ మధ్యలో సైతం ఖలిస్తాన్ అని ఏవేవో నినాదాలు వినిపించాయి. 90 దశకం తరువాత కాశ్మీర్ భారత్ నుంచి వేరు అవుతుందేమో అన్నంతగా ఉగ్రవాదం అక్కడ తాండవించింది.
ఇన్ని బాధలలోనూ దేశం కలిసే ఉంది. సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు సాగుతోంది. అయితే మరోసారి దేశ విభజన అన్న మాటే ఈ దేశ పౌరులు వినలేరు తట్టుకోలేరు. అలాంటిది ఘనమైన చరిత్ర కలిగిన శతాధిక సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం అధ్యక్షురాలిగా పనించేసిన వారు పదేళ్ళ పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ చైర్ పర్సన్ గా వ్యవహరించిన వారు పాతికేళ్ళ పాటు లోక్ సభ ఎంపీగా ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ మాత్రం దేశ విభజన కోసమే వక్ఫ్ బిల్లుని తెచ్చారు అని పెద్ద మాటనే వాడేశారు.
నిన్న లోక్ సభలో నెగ్గిన వక్ఫ్ బిల్లు ఈ రోజు రాజ్యసభ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా రాజ్యసభకు వచ్చిన సోనియా గాంధీ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు మోడీ నిర్ణయాలు ఈ దేశాన్ని అగాధంలోకి నెడుతున్నాయని ఆమె ఆరోపించారు రాజ్యాంగం అన్నది కాగితాల మీద ఉందని దానిని బుల్డోజ్ చేసుకుంటూ బీజేపీ సాగుతోందని నిందించారు. వక్ఫ్ బిల్లు ఆమోదం అంటే దేశ ప్రజలంతా సిగ్గు పడేలా రాజ్యాంగం పైన దాడి జరిగిందని ఆమె విమర్శించారు.
ప్రశాంతంగా ఉన్న భారత సమాజంలో శాశ్వతమైన చీలిక విభజన తీసుకుని వచ్చేందుకు బీజేపీ చేసిన కుటిల ప్రయత్నమే వక్ఫ్ సవరణ బిల్లు అని ఆమె అన్నారు. లోక్ సభలో ఈ బిల్లుని ఆమోదించుకున్నారని ఆక్షేపించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుని కూడా తీసుకుని రావాలని చూడడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అని ఆమె అన్నారు.
పార్లమెంట్ ఉభయ సభలలో ప్రతిపక్షాలకు మాట్లాడేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు తరచూ గందరగోళం సృష్టించడం ద్వారా విపక్షం నోరు నొక్కేస్తున్నారని అన్నారు. దేశం కోసం న్యాయం కోసం ఎంపీలు అంతా పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆమె అన్నారు.
ఇదిలా ఉంటే పేద ముస్లిం ల మేలు కోసం వక్ఫ్ సవరణ బిల్లు అని బీజేపీ అంటోంది. అలాగే పెత్తందారులకు చెక్ చెప్పేందుకే అని అంటోంది ఈ దేశంలో అన్ని సంస్థలు వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేయాలన్నదే తమ ఉద్దేశ్యమని చెబుతోంది. మరి దేశ విభజన అన్న సోనియా కామెంట్స్ కి బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సి ఉంది.