స్లోవేకియా ప్రధానిపై కాల్పుల ఘటన... ఎవరీ ఫికో?

అయితే ఈ ఘటనలో చికిత్స అనంతరం... ఆయనకు ప్రాణాపాయ ముప్పు తప్పినట్లు ఉపప్రధాని, పర్యావరణ శాఖ మంత్రి టోమస్ తారాబా వెల్లడించారు.

Update: 2024-05-16 07:01 GMT

స్లొవేకియా ప్రధాని రాబర్ట్‌ ఫికో (59)పై జరిగిన హత్యాయత్నం ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా హట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రపంచ దేశాల అధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. అయితే ఈ ఘటనలో చికిత్స అనంతరం... ఆయనకు ప్రాణాపాయ ముప్పు తప్పినట్లు ఉపప్రధాని, పర్యావరణ శాఖ మంత్రి టోమస్ తారాబా వెల్లడించారు. ప్రస్తుతం వైద్యుల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు తెలిపారు.

దేశ రాజధాని బ్రటిస్లావాకు సుమారు 140 కిలోమీటర్ల దూరంలోని హాండ్లోవా పట్టణంలో బుధవారం మధ్యాహ్నాం ప్రధాని రాబర్ట్‌ ఫికో తన మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఆ సమావేశ ముగిసిన అనంతరం బయటకు వచ్చిన ఆయన.. అక్కడ బారికేడ్ల వద్ద ఉన్న కొందరు వృద్ధులతో కరచలనం చేశారు. ఈలోపు వారిలోని ఓ వృద్ధుడు ఆయనపై కాల్పులు జరుపుతూ మెరుపు దాడికి దిగాడు.

ఇందులో భాగంగా... మొత్తం ఐదు రౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. దీంతో ప్రధాని కడుపులో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బందిని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క ప్రధానిని బన్‌ స్కా బైస్ట్రికాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి ప్రధాని ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు.

మరోపక్క ఈ ఘటనపై భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఇందులో భాగంగా... తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దీన్ని పిరికిపందల చర్యగా అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండించిన మోడీ... ఫికో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమయంలో... స్లొవేకియా ప్రజలకు తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇక ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని జురాజ్‌ సింటులా (71) గా నిర్ధారించారని తెలుస్తుంది. ఐతే... అతడు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడనేదానిపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గత నెలలో జరిగిన స్లోవేకియా అధ్యక్ష ఎన్నికలు, ఇతరత్ర రాజకీయ కారణాలు హత్యాయత్నానికి కారణాలై ఉండొచ్చనే అంటున్నారు!

ఎవరీ రాబర్ట్ ఫీకో..?

1964లో అప్పటి చెకోస్లోవేకియాలో జన్మించిన ఫీకో... 1986లో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన... 1992లో తొలిసారి డెమోక్రటిక్‌ లెఫ్ట్‌ పార్టీ తరఫున స్లొవేకియా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలోనే అంచెలంచెలుగా ఎదిగి 2006లో స్మెర్‌ పార్టీ విజయంతో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

ఈ క్రమంలో 2010లో అధికారం కోల్పోయి ప్రతిపక్ష నేతగా మారారు. అయితే... 2012లో అప్పటి ప్రధాని ఇవేటా రాడికోవాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి గెలవడంతో దేశ రాజకీయాల్లో ఫికో ప్రాబల్యం నిరూపితమైంది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ఆయన భారీ విజయం సాధించారు. 2014లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారు.

ఈ నేపథ్యంలో... 2023లో జరిగిన ఎన్నికల్లో ఫికో తిరిగి ప్రధాని పదవి దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో... ఉక్రెయిన్‌ కు వ్యతిరేక, రష్యాకు అనుకూల విధానాలను ప్రచారం చేసి ఆయన గెలుపొందడం గమనార్హం. 22.95 శాతం ఓట్లు సాధించిన ఆయన... వాయిస్‌ - సోషల్‌ డెమోక్రసీ, స్లొవేక్‌ నేషనల్‌ పార్టీతో చేతులు కలిపి నాలుగోసారి ప్రధాని పీఠం ఎక్కారు. ఈ క్రమంలో ఆయనపై అమెరికా వ్యతిరేకిగానూ ముద్రపడింది.

Tags:    

Similar News