ఓటరు చెంప కొట్టి తాను తిన్న ఎమ్మెల్యే అభ్యర్ధి!

ఓటరు ఈ రోజు దేవుడు. నిజంగా ఒక రోజు సుల్తాన్. అటువంటి ఓటరు దేవుడిని తమను కరుణించమని వేడుకోవాలి

Update: 2024-05-13 06:26 GMT

ఓటరు ఈ రోజు దేవుడు. నిజంగా ఒక రోజు సుల్తాన్. అటువంటి ఓటరు దేవుడిని తమను కరుణించమని వేడుకోవాలి. వారు దయతో అందలం అధిష్టించాలని ఆశించాలి. కానీ ప్రజాస్వామ్యానికి పండుగ అయిన పోలింగ్ వేళ దేవుడు లాంటి ఓటరన్న మీద ఒక ఎమ్మెల్యే అభ్యర్ధి దాడి చేసి చెంప దెబ్బ కొట్టారు. ఆ ఓటరు కూడా అంతే వేగంగా ఎమ్మెల్యే చెంప మీద కొట్టారు.

ఇది గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. ఒక విధంగా వైసీపీ అభ్యర్ధిని ఇది చేదు అనుభవం గానే అంతా చూస్తున్నారు. ఎమ్మెల్యే ఓటరుని కొట్టడం తప్పే అయినా ఓటరు నుంచి తిరిగి చెంప దెబ్బ తగిలించుకోవడం దారుణమైన పరాభవంగా చూస్తున్నారు.

అసలు ఎందుకు ఇదంతా జరిగింది అని చూస్తే కనుక ఎమ్మెల్యే అభ్యర్ధి క్యూ లైన్ లో వెళ్లకుండా నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్తూండడం చూసిన సదరు ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే అభ్యర్ధి ప్రస్తుత ఎమ్మెల్యే శివకుమార్ క్షణమాలస్యం చేయకుండా ఓటరు చెంప మీద గట్టిగా కొట్టారు. దాంతో ఆ ఓటరు కూడా తమాయించుకోకుండా ఎమ్మెల్యే చెంప మీద కొట్టారు. అంతే మరుక్షణం ఎమ్మెల్యే అనుచరులు సదరు ఓటరు మీద పడి దారుణంగా ఆయన్ని బాదేశారు. దీంతో ఒక్కసారిగా పోలింగ్ నిలిచిపోయింది. చాలా సేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.

Read more!

ఇదిలా ఉంటే ఎమ్మెల్యే అభ్యర్ధిని ఓటరు క్యూ లైన్ లో రమ్మనడం సమంజసమే. అయితే ఎమ్మెల్యే అభ్యర్ధి తాను మొత్తం నియోజకవర్గంలో ఓటింగ్ సరళిని పరిశీలించుకోవాలి. దాంతో ఆయనకు ఏ క్యూలు లేకుండా నేరుగా ఓటేసేందుకు పోలింగ్ అధికారులే అనుమతిస్తున్నారు.

అలా చాలా మంది రాజకీయ ప్రముఖులు ఓటేశారు.కొందరు మాత్రం క్యూ లైన్ లో ఉంటూ ఓటేస్తున్నారు. ఇక్కడ ఓటరు అభ్యంతరాన్ని ఎమ్మెల్యే అభ్యర్ధి పాజిటివ్ గా తీసుకుని నాకు పని ఉంటుంది ఓటేసి వెళ్తాను అని నచ్చెచెబితే పోయేది.కానీ ఆయన ఆగ్రహంతో ఓటరు చెంప పగులగొట్టాడం,తిరిగి తాను తినడం అంటే ఇంతకంటే దారుణం ఉండదు కదా అని అంటున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలే మొత్తం ఓటర్ల మీద ఓటింగ్ సరళి మీద ప్రభావం చూపుతాయన్న ఆలోచన కూడా లేకపోవడం దారుణం అంటున్నారు.

Tags:    

Similar News