‘పాక్ కు సిక్కు యాత్రికులు’ పై... ఎస్.జీ.పీ.సీ సంచలన ప్రకటన!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.;
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం అయితే కుదిరింది కానీ.. ఇంకా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణమే ఉందని అంటున్నారు. ఈ సమయంలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్.జీ.పీ.సీ) కీలక ప్రకటన చేసింది.
అవును... భారత్ - పాక్ మధ్య ప్రస్తుత పరిస్థితిని నొక్కి చెబుతూ.. మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతిని జరుపుకోవడానికి ఈ ఏడాది ఏ సిక్కు యాత్రికుల బృందం పొరుగు దేశానికి వెళ్లదని ఎస్.జీ.పీ.సీ. తాజాగా ప్రకటించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇరుదేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కార్ణంగా ఈ నిర్ణయం అని తెలిపింది.
ఈ మేరకు ఎస్.జీ.పీ.సీ. అధికారి హర్భజన్ సింగ్ వక్తా తెలిపారు. ఇదే సమయంలో... ప్రతీ ఏటా జూన్ 29న పాకిస్థాన్ లో జరుపుకునే మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి కోసం.. ఎస్.జీ.పీ.సీ. సిక్కు యాత్రికుల బృందాన్ని మతపరమైన సందర్శన కోసం దాయాదీ దేశానికి పంపుతుందని.. అయితే ఈ ఏడు ఆ యాత్ర లేదని వక్తా అన్నారు!
వాస్తవానికి ఈ సందర్శన కోసం తాము 249 పాస్ పోర్టు దరఖాస్తులను పాకిస్థాన్ కు పంపామని చెప్పిన వక్తా.. ఇప్పుడు ఆ ప్రయాణం రద్దు చేయబడినందున ఆ పాస్ పోర్టులు జూన్ 20 తర్వాత తిరిగి ఇవ్వబడతాయని అన్నారు. ఆ తేదీ తర్వాత ప్రజలు తమ తమ పాస్ పోర్టులను తమ ప్రయాణ విభాగం నుంచి తీసుకోవచ్చని వెల్లడించారు.
కాగా.. భారతదేశంతో సహా ప్రపమవ్యాప్తంగా ఉన్న సిక్కు యాత్రికులతో పాటు ఇతర దేశాల నుంచి పర్యాటకులు గురుద్వారా కర్తార్ పూర్ సాహిబ్ ను సందర్శిస్తారు. ఈ మహారాజా రంజీత్ సింగ్ 19వ శతాబ్ధంలో సిక్కు సామ్రాజ్యానికి మొదటి రాజు. ఆయనను "షే-ఏ-పంజాబ్" అని పిలుస్తారు.
ఆయన నవంబర్ 1780, నవంబర్ 13న ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న బుద్రుఖాన్ లేదా గుజ్రాన్ వాలా లో జన్మించారు. సిక్కు విశ్వాసాల ప్రకారం ఆయన పంజాబ్ ను 40 ఏళ్లపాటు పాలించారు! ఈ క్రమంలో మహారాజా రంజీత్ సింగ్.. మొఘలులకు వ్యతిరేకంగా పోరాడి లాహోర్ ను కూడా జయించారని చెబుతారు. 1839 జూన్ 27న లాహోర్ లో మరణించారు.