ఇండియాలోనే అత్యంత విద్యావంతుడు.. 20కి పైగా డిగ్రీలు.. ఆశ్చర్యపరిచే మెమోస్!

'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్' ప్రకారం భారతదేశంలోనే అత్యంత విద్యావంతుడిగా గుర్తింపు పొందిన ఈయన ప్రస్థానం నేటి తరానికి ఒక పెద్ద ఇన్సిపిరేషన్.;

Update: 2026-05-06 15:30 GMT

చదువుకోవాలంటే ఒక పట్టా లేదా రెండు పట్టాలు పొందుతాం. కానీ ఒకే వ్యక్తి ఏకంగా 20కి పైగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు సాధించి, ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత పదవులను అధిరోహించారంటే నమ్ముతారా? ఆయనే డాక్టర్ శ్రీకాంత్ జిచ్కర్. 'లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్' ప్రకారం భారతదేశంలోనే అత్యంత విద్యావంతుడిగా గుర్తింపు పొందిన ఈయన ప్రస్థానం నేటి తరానికి ఒక పెద్ద ఇన్సిపిరేషన్.

జ్ఞాన దాహం తీరని మేధావి:

శ్రీకాంత్ జిచ్కర్ కేవలం ఒక సబ్జెక్టుకే పరిమితం కాలేదు. ఆయన ప్రయాణం వైద్యశాస్త్రంతో మొదలైంది. MBBS పూర్తి చేసి MD కూడా చేశారు. కానీ అక్కడితో ఆయన ఆగలేదు. చట్టం మీద గౌరవంతో LLB, LLM పూర్తి చేశారు. ఆ తర్వాత బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (MBA), జర్నలిజం వంటి విభిన్న రంగాల్లో పట్టాలు అందుకున్నారు. ఆయన మెమోలు చూస్తే ఏ యూనివర్సిటీలో ఎన్ని డిగ్రీలు చేశారో లెక్కేయడం కష్టమే.

42 పరీక్షలు.. అన్నీ గోల్డ్ మెడల్స్:

1973 నుండి 1990 మధ్య కాలంలో ఆయన ఏకంగా 42 యూనివర్సిటీ పరీక్షలు రాశారు. అది కూడా కేవలం పాస్ అవ్వడం కోసం కాదు, చాలా వరకు ఫస్ట్ క్లాస్ లో, గోల్డ్ మెడల్స్ తో ఉత్తీర్ణులయ్యారు. సోషియాలజీ, ఎకనామిక్స్, సంస్కృతం, చరిత్ర, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్.. ఇలా ఒకటేమిటి దాదాపు అన్ని సోషల్ సైన్స్ సబ్జెక్టుల్లోనూ ఆయన మాస్టర్స్ డిగ్రీలు సాధించారు. చివరకు సంస్కృతంలో డి.లిట్ (D.Litt) కూడా అందుకున్నారు.

ఐపీఎస్, ఐఏఎస్.. రెండింటిలోనూ సత్తా:

శ్రీకాంత్ కేవలం అకడమిక్ చదువులే కాదు, దేశంలోనే అత్యంత కఠినమైన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో కూడా తన మార్క్ చూపించారు. మొదట IPS (ఇండియన్ పోలీస్ సర్వీస్) కు ఎంపికయ్యారు. దానికి రాజీనామా చేసి మళ్ళీ పరీక్ష రాసి IAS (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) కు ఎంపికయ్యారు. అయితే దేశ సేవ చేయాలనే తపనతో ఆ హోదాను కూడా వదులుకుని రాజకీయాల్లోకి వచ్చారు.

పిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు:

చదువులో ఎంత వేగంగా ఉండేవారో, కెరీర్‌లో కూడా అంతే వేగంగా ఎదిగారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలిచి, అప్పట్లో దేశంలోనే అతి పిన్న వయస్కుడైన మంత్రిగా రికార్డు సృష్టించారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆయన ఒకేసారి 14 శాఖలను నిర్వహించడం ఆయన సామర్థ్యానికి నిదర్శనం. పరిపాలనలో కూడా ఆయన తన విద్యా నైపుణ్యాన్ని ఉపయోగించి ఎన్నో సంస్కరణలు తెచ్చారు.

52,000 పుస్తకాల సొంత లైబ్రరీ:

శ్రీకాంత్ కి పుస్తకాలంటే ప్రాణం. ఆయన దగ్గర సుమారు 52,000 పుస్తకాలతో కూడిన ఒక భారీ సొంత లైబ్రరీ ఉండేది. ఇక చదువుతో పాటు ఆయనకు పెయింటింగ్, ఫోటోగ్రఫీ మరియు థియేటర్ ఆర్ట్స్ మీద కూడా మంచి పట్టు ఉండేది. జ్ఞానం ఎక్కడున్నా దాన్ని ఒడిసిపట్టుకోవాలనే తపన ఆయనను ఒక నడయాడే విజ్ఞాన సర్వస్వంలా మార్చింది.

శ్రీకాంత్ జిచ్కర్ జీవితం మనకు ఒకటే చెబుతుంది.. వయసుతో నిమిత్తం లేకుండా నేర్చుకోవాలనే తపన ఉంటే ఆకాశమే హద్దు అని. 2004లో ఆయన మనల్ని వదిలి వెళ్లినా, ఆయన సాధించిన రికార్డులు మరియు విద్యా ప్రస్థానం నేటికీ ప్రతి విద్యార్థికి ఒక మార్గదర్శి.

Tags:    

Similar News