భద్రత పేరుతో జగన్ ను బుక్ చేసిన పేర్ని నాని

అంతేకాదు..విపక్ష నేతగా.. సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పటికి కుటుంబంలోని అందరి పెళ్లిళ్లు ఇంట్లోనే చేశారు కదా?

Update: 2026-10-24 09:25 GMT

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంతానంలోని లుకలుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. షర్మిల కుమార్తె పెళ్లి వేళ.. దివంగత వైఎస్ కట్టించిన ఇంట్లో పెళ్లి వేడుకకు జగన్మోహన్ రెడ్డి ససేమిరా అంటున్నారన్న మాట ఇప్పుడు సంచలనంగా మారింది. మేనమామగా మేనకోడలి పెళ్లి విషయంలో ముందుండి నడిపించాల్సిన జగన్.. అందుకు భిన్నంగా ఇంట్లో పెళ్లి చేసేందుకు నో చెబుతున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

షర్మిల కుమార్తె వివాహ వేడుకను బెంగళూరులోని యలహంకలోని ఇంటిని ఇచ్చేందుకు జగన్ నిరాకరించిన వైనం ఒక ఎత్తు అయితే.. ఆయనకు ఉన్న ప్రాణహాని నేపథ్యంలోనే అలాంటి పరిస్థితి ఉందంటూ మాజీ మంత్రి పేర్ని నాని లాంటి వాళ్ల మాటలు చర్చను మరో వైపునకు తీసుకెళుతున్నాయి. జగన్ కు భద్రత పేరుతో ఆయన విధేయులు చేస్తున్న వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున ప్రశ్నల వర్షం కురుస్తోంది. నిజంగానే మేనకోడలి పెళ్లి వేడుక కారణంగా జగన్ ప్రాణాలు ముప్పు ఉందన్నదే నిజమైన పక్షంలో ఆయనకు వేర్వేరు ప్రాంతాల్లో భారీ భవంతులు ఉన్నాయి కదా? అక్కడ కొన్ని రోజులు ఉండొచ్చు కదా? అన్నది ప్రశ్నగా మారింది.

అంతేకాదు..విపక్ష నేతగా.. సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పటికి కుటుంబంలోని అందరి పెళ్లిళ్లు ఇంట్లోనే చేశారు కదా? చివరకు తన ఇంట్లో జరిగే పెళ్లిళ్లకు శత్రువులకు సైతం ఆహ్వానాలు పంపిన వైనాన్ని జగన్ అండ్ కో మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. మేనకోడలి పెళ్లి వేడుక ఇంట్లో జరిగితే.. జగన్ ప్రాణాలకు ముప్పు ఉందని బలంగా విశ్వసిస్తే.. పెళ్లి వేడుక జరిగే వారం.. రెండు వారాలు వేర్వేరు ప్రాంతాల్లోని ఇళ్లకు వెళ్లి ఉంటే సమస్యలన్ని తీరిపోతాయి కదా? రాజకీయంగా అన్నాచెల్లెళ్లవి వేర్వేరు దారులు అయి ఉండొచ్చు. ఆర్థిక అంశాల్లో ఇరువురి మధ్య బోలెడన్ని పంచాయితీలు ఉండొచ్చు.

కానీ.. మేనకోడలి పెళ్లి జరుగుతున్న వేళ.. మేనమామగా జగన్మోహన్ రెడ్డి కాస్తంత పెద్ద మనసును ప్రదర్శించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. యలహంకలో అన్నాచెల్లెళ్ల భవనాల చుట్టూ కాంపౌండ్ వేర్వేరుగా ఉందని.. షర్మిలకు కాబోయే వియ్యంకులు ఇప్పటికే తమ పెళ్లి పత్రికలో షర్మిల రెసిడెన్సీ, బెంగళూరులో పెళ్లి అంటూ కార్డులు ప్రింట్ చేయించిన తర్వాత ఇప్పుడు వేదిక మార్పు సరైనదేనా? అన్నది మరో ప్రశ్న.

ఇతర కారణాలతో వద్దని చెప్పటంలో అర్థముంది కానీ సెక్యూరిటీ సమస్య పేరుతో పెళ్లి వేడుకను ఇంట్లో జరిపించొద్దన్న మాట చెప్పటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. జగన్ వీర విధేయులుగా ఉన్న వారు షర్మిల.. ఆమె కుమార్తె పెళ్లి వేడుకను యలహంక ఇంట్లో ఎలా జరుపుతారంటూ ప్రశ్నించే క్రమంలో దారుణ వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెడుతున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మాజీ మంత్రిగా వ్యవహరించిన పేర్ని నాని లాంటి నేతలే జగన్ భద్రత మీద ఆందోళన వ్యక్తం చేస్తూ.. పెళ్లి ఎక్కడో ఒక దగ్గర చేసుకునే దానికి తమ అధినాయకుడ్ని ఇబ్బంది పెడతారా? అంటూ ప్రశ్నించటం కనిపిస్తుంది. పేర్ని నాని లాంటోళ్లే ఇలా మాట్లాడితే.. జగన్ ను అభిమానించే సోషల్ మీడియా బ్యాచ్ తీరు ఇంకెంతలా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. వైఎస్ ఇంటి పంచాయితీ మరోసారి వీధికి ఎక్కటం.. ఇంటి వ్యవహారాన్ని పార్టీ నేతలు స్పందిస్తున్న తీరును జగన్ కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News