గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. అయినా రంగంలోకి చిన్నశ్రీను కుమార్తె!
స్థానిక సంస్థల ఎన్నికల సమయంంలో విజయనగరం మునిసిపాలిటీ మేయర్ అభ్యర్థి త్వాన్ని చిన్న శ్రీను కుమార్తె ఆశించారు.
వైసీపీ నుంచి ఇటీవల టీడీపీలోకి వచ్చిన చిన్న శ్రీను.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పరంగా ఆయనకు ఎలాంటి భరోసా ఇవ్వకపోయినా.. సీట్ల కేటాయింపు వ్యవహారంపై స్పష్టత రాకపోయినా.. తన కుమార్తె సిరి సహస్రతో రెండు స్థానాలకు నామినేషన్ వేయించేశారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ. జడ్పీటీసీ స్థానాల విషయంలో కూటమి మధ్య సర్దుబాట్లు, సీట్ల పంపకాలు పూర్తికాలేదు. మరో రెండు రోజుల సమయం పడుతుందన్న విషయాన్ని మాత్రమే పార్టీలు ప్రకటించాయి. కానీ, చిన్న శ్రీను మాత్రం తన కుమార్తెతో నామినేషన్ వేయించారు.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంంలో విజయనగరం మునిసిపాలిటీ మేయర్ అభ్యర్థి త్వాన్ని చిన్న శ్రీను కుమార్తె ఆశించారు. అయితే.. పార్టీ పరంగా హామీ లభించలేదు. దీంతో ఆయన మౌనం వహించారు. ఆ తర్వాత.. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. టీడీపీ తరఫున విజయనగరంలో ఏదైనా సీటు దక్కుతుందని అనుకున్నారు. కానీ, పార్టీలో నెలకొన్న పరిస్థితులు, పరిణామాలను అంచనా వేసిన చంద్రబాబు.. ప్రస్తుతానికి ఆగాలంటూ.. మజ్జి శ్రీనుకు సమాచారం అందించారు.
ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా పరిషత్ స్థానానికి అవనాపు భార్గవి నామినేషన్ వేశారు. రేపు ఎన్నికల్లో పార్టీ విజయం దక్కించుకుంటే.. ఆమె జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అవుతారు. ఇక, ఈ నామినేషన్ల పర్వం కూడా.. శుక్రవా రం ముగిసింది. అయితే.. అనూహ్యంగా సిరి సహస్ర.. ఎలాంటి ప్రకటన చేయకుండా.. ఎలాంటి ఆర్భాటం లేకుండానే శుక్రవారం నామినేషన్ల ఘట్టం ముగియడానికి గంట ముందు సైలెంట్‌గా రెండు స్థానాల్లో నామినేషన్ వేసేశారు. కొత్తవలస, తెర్లా జిల్లా పరిషత్ స్థానాలకు ఆమె నామినేషన్ వేసేయడం గమనార్హం.
తాజాగా శనివారం నామినేషన్ల పరిశీలన సమయంలోనే ఈ వ్యవహారం వెలుగు చూడడం గమనార్హం. దీంతో పార్టీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఎవరూ చెప్పకుండా.. ఎలాంటి హామీ లేకుండానే చిన్న శ్రీను కుమార్తె ఇలా చేయ డం ఏంటంటూ.. సీనియర్లు ఆయనను ప్రశ్నించారు. ఈ విషయంపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అయితే.. తనకు విషయం తెలియదని.. రాజకీయాలపై ఆసక్తితోనే తన కుమార్తె నామినేషన్ వేసి ఉంటుందని చిన్న శ్రీను సమర్థించుకున్నారు. మరోవైపు ఇప్పటికే.. రెబల్స్‌గా దిగిన కొందరు నేతలను టీడీపీ సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో చిన్న శ్రీనుపై కూడా చర్యలు ఉంటాయా? లేక.. ఆయన ఇటీవలే పార్టీలోకి వచ్చారు కాబట్టి.. సర్దుబాటు ధోరణి ప్రదర్శిస్తారా? అనేది చూడాలి.