అమెరికాను ఓ రేంజ్ లో ఆడుకున్న ఇరాన్.. ఆ బాహుబలి పోస్ట్ తో పరువు తీసిందిగా..
తాజాగా ముంబైలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వినూత్న సెటైరిక్ పిక్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.
అంతర్జాతీయ రాజకీయాల వేదికపై అమెరికా, ఇరాన్‌ల మధ్య నడుస్తున్న 'డ్రామా' రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ప్రచారంలోనూ.. మీడియా కవరేజీలోనూ అమెరికా విపరీతమైన పబ్లిసిటీ పొందుతూ తనను తాను ఒక 'సూపర్ హీరో'లా ప్రొజెక్ట్ చేసుకుంటుందేమో కానీ.. అసలు సీన్ హార్ముజ్ జలసంధి దగ్గరకు వచ్చేసరికి మాత్రం కథ వేరేలా ఉంటోందని ఇరాన్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది.
తాజాగా ముంబైలోని ఇరాన్ ఎంబసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వినూత్న సెటైరిక్ పిక్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. "మీడియా ముందు అమెరికా పెద్ద బాహుబలి కావచ్చు.. కానీ హార్ముజ్‌లో మాత్రం ఆ పప్పులు ఉడకవు" అంటూ ఇరాన్ పేల్చిన ఈ వ్యంగ్యాస్త్రం గ్లోబల్ డిప్లొమసీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం మాది అని అమెరికా ఎంత బిల్డప్ ఇచ్చినా.. ఇక్కడ మాత్రం తమదే పైచేయి అని ఇరాన్ స్పష్టంగా తేల్చి చెప్పేసింది.
అమెరికా బాహుబలి ప్రచారం.. హార్ముజ్‌లో సీన్ రివర్స్
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. పర్షియన్ గల్ఫ్ నుంచి ప్రపంచ దేశాలకు వెళ్లే ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులకు ఈ జలసంధే ఏకైక మార్గం. అయితే ఇక్కడ సముద్రంలో అమర్చిన 'సీ మైన్స్' కారణంగా పలు నౌకలు ప్రమాదంలో పడుతున్నట్లు మంటల్లో చిక్కుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలో ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ "ఇరాన్‌పై మళ్లీ దాడి చేస్తాం" అంటూ గంభీరమైన హెచ్చరికలు జారీ చేస్తుంటే ఇరాన్ మాత్రం "మీ బెదిరింపులకు మేం భయపడేదే లేదు" అన్నట్లు సోషల్ మీడియాలో సెటైర్లతో రివర్స్ ఎటాక్ ప్రారంభించింది. సీన్స్, బిల్డప్‌లు హాలీవుడ్ రేంజ్లో ఉన్నా.. గ్రౌండ్ రియాలిటీలో హార్ముజ్ జలసంధిలో అమెరికా ఆటలు సాగవని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్‌పై ప్రభావం.. మన పరిస్థితేంటి?
అమెరికా-ఇరాన్ లీడర్లు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఈ 'మాటల యుద్ధం', సోషల్ మీడియా సెటైర్లు సరదాగా అనిపించినా దాని వెనుక ఉన్న భౌగోళిక రాజకీయ తీవ్రత మాత్రం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఒకవేళ ఇక్కడ పరిస్థితి చెయ్యి దాటితే.. అంతర్జాతీయంగా చమురు ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. సముద్ర రవాణా ఖర్చులు, బీమా ప్రీమియంలు భారీగా పెరుగుతాయి. ముఖ్యంగా భారత్ లాంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు ఆర్థికంగా పెద్ద దెబ్బ తగులుతుంది.
అమెరికా తన 'బాహుబలి' ఇమేజ్ను కాపాడుకోవడానికి నిజంగానే సైనిక చర్యకు దిగుతుందా? లేక ఇరాన్ తన కఠిన వైఖరితో అమెరికాకు చెక్ పెడుతుందా? అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా హార్ముజ్ జలసంధిలో ఇప్పుడు నడుస్తున్న ఈ 'పిక్చర్' ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మాత్రం పెద్ద సవాలుగానే మారింది.