వారసుల సందడి.. విజయనగరం నుంచి అనంతపురం వరకు కూటమిలో తీవ్ర పోటీ

ఇక గోదావరి జిల్లాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గొల్లపల్లి అమూల్య బరిలో నిలిచారు. ఈమె టీడీపీ రాజోలు ఇంచార్జిగా ఉండగా, ఆమె తండ్రి గొల్లపల్లి సూర్యరావు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు.

Update: 2026-10-24 06:18 GMT

జిల్లా పరిషత్ ఎన్నికల్లో వారసుల సందడి ఎక్కువగా ఉంది. భవిష్యత్తులో ఎమ్మెల్యే, ఎంపీ పదవులు చేపట్టాలని ఆశిస్తున్న పలువురు నేతలు, వారి కుటుంబ సభ్యులు అందుకు దగ్గరిదారి (షార్ట్ కట్)గా జడ్పీ ఎన్నికలను ఎంచుకుంటున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఇప్పటికే పదవుల్లో ఉన్నవారు సైతం పార్టీపై మరింత పట్టు కోసం కొడుకులు, కూతుళ్లు, కోడళ్లను రంగంలోకి దింపడం చర్చనీయాంశం అవుతోంది. ప్రధానంగా అధికార కూటమిలో వారసుల తాకిడి ఎక్కువగా ఉందని చెబుతున్నారు. పదవులపై ఆశతో సగానికి పైగా జిల్లాల్లో కూటమి నేతలు జడ్పీ ఎన్నికల్లో నామినేషన్ వేశారు. అటు వైసీపీలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే ఆ పార్టీలో నామినేషన్లు వేస్తున్న వారసులు మాత్రం పదవుల కోసం కాకుండా, తమ కేడర్ కాపాడుకునే ఆలోచనతోనే బరిలోకి దిగుతున్నారని విశ్లేషిస్తున్నారు.

జడ్పీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎమ్మెల్యే, ఎంపీల కుటుంబ సభ్యులు నామినేషన్లు వేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే పదవులు అనుభవిస్తున్న నేతలు ఈ ఎన్నికలను కూడా వదలకుండా తమ అవకాశాలను దెబ్బతీస్తున్నారని దిగువస్థాయి నేతలు వాపోతున్నారు. అయినప్పటికీ భయం కారణంగా ఎవరూ బయటకి మాట్లాడలేకపోతున్నారు. ఈ పరిస్థితి అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు కనిపిస్తోందని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో వారసుల మధ్య పోరు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. విజయనగరం జిల్లా అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేత, చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు కోడలితోపాటు జడ్పీ మాజీ చైర్మన్ చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర, మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు కుమార్తె చంద్రకళ నామినేషన్లు వేశారు. అటు వైసీపీలో కూడా మాజీ మంత్రి బొత్స కుటుంబ సభ్యులు నలుగురు నామినేషన్లు వేసి యుద్ధానికి సిద్ధమని సంకేతాలు పంపారు.

ఇదేవిధంగా అనకాపల్లి జిల్లాలోనూ వారసులు జడ్పీ పీఠం ఆశిస్తూ జడ్పీటీసీ ఎన్నికలకు నామినేష్లు వేశారు. ఈ జిల్లా నుంచి మొత్తం ముగ్గురు నేతల కుటుంబ సభ్యులు జడ్పీ అధ్యక్ష స్థానంపై ఆశతో బరిలోకి దిగారు. వీరిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు భార్య అరుణ, కొప్పెలవెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ భార్య సత్యవతి, జనసేన ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంచార్జి సుందరపు సతీష్ భార్య ఉన్నారు. సుందరపు సతీష్ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ సోదరుడు కావడం గమనార్హం. అదేవిధంగా ఉత్తరాంధ్రలోనే అల్లూరి జిల్లా అధ్యక్ష పీఠం ఆశిస్తూ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కుమార్తె తేజశ్వి నామినేషన్ దాఖలు చేశారు. ఇక్కడ పార్టీలో మరికొందరు నాయకులు కూడా జడ్పీ చైర్మన్ సీటు కావాలని కోరుతుండటంతో పోటీ తీవ్రంగా ఉందని అంటున్నారు.

ఇక గోదావరి జిల్లాల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గొల్లపల్లి అమూల్య బరిలో నిలిచారు. ఈమె టీడీపీ రాజోలు ఇంచార్జిగా ఉండగా, ఆమె తండ్రి గొల్లపల్లి సూర్యరావు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. దీంతో అధిష్టానం నిర్ణయం ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఎక్కువవుతోంది. మరోవైపు కాకినాడ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పశ్చిమగోదావరి నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని వెంకట్ రేసులో నిలిచారు. అదేవిధంగా ఏలూరు సీటు ఆశిస్తూ ఎమ్మెల్యే చింతమనేని కుమార్తె నవ్య, మాజీ ఎంపీ మాగంటి బాబు సతీమణి పద్మావతి జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇదే పదవి కోసం పార్టీలో పలువురు సీనియర్ లీడర్లు ఆశలు పెట్టుకున్నారు.

ఇదే పరిస్థితి కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోనూ ఉందని అంటున్నారు. అయితే ఈ స్థానాలను ఆశిస్తున్న వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీల కుటుంబ సభ్యుల పేర్లు లేకపోవడంతో కూటమి నేతలు ఊపిరిపీల్చుకుంటున్నారని చెబుతున్నారు. అటు రాయలసీమలో పరిస్థితి హీట్ పుట్టిస్తుందని అంటున్నారు. ఈ ప్రాంతంలో జడ్పీ పీఠాలను కోరుకుంటూ సీనియర్ నేతల కుటుంబ సభ్యులు భారీ స్థాయిలో నామినేషన్లు వేశారు. వీరిలో సత్యసాయి జిల్లా నుంచి పరిటాల శ్రీరామ్, నంద్యాల జిల్లా నుంచి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తమ్ముడు రాజారెడ్డి, కర్నూలు నుంచి సీనియర్ నేత కేఈ ప్రభాకర్ కుమారుడు రుద్రఫణి నామినేషన్లు వేశారు.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలువురు నాయకుల వారసులు పోటీపడుతుండగా, పార్టీలో చాలాకాలంగా కొనసాగుతూ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారు టెన్షన్ అనుభవిస్తున్నారు. జిల్లాలు పెరిగి కొత్త పదవులు వస్తాయని ఆశించిన వారికి నేతల వారసులు గండి కొడుతున్నట్లు చెబుతున్నారు. మంత్రి పదవులు రాలేదని కొందరు, మంత్రి పదవి ఉన్నా జిల్లాపై పెత్తనం వదులుకోవద్దు అన్న ఆలోచనతో మరికొందరు తమ వారసులను జడ్పీటీసీలుగా పోటీకి దింపి జడ్పీ పీఠం తన్నుకుపోవాలని చూస్తున్నారని చెబుతున్నారు. జడ్పీ సీటు ఇవ్వనంటే భవిష్యత్తులో చేపట్టే మంత్రివర్గ విస్తరణలో అయినా అవకాశం ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెచ్చేలా పలువురు నేతలు తమ కుటుంబ సభ్యులను పోటీకి పెట్టారని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధిష్టానవర్గాల ఆలోచనలు ఏంటో తెలియాల్సివుందని అంటున్నారు.

Tags:    

Similar News