మేనమామ కాదు కంసమామ.. జగన్ పై సీఎం చంద్రబాబు ఫైర్

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శనివారం మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Update: 2026-10-24 10:06 GMT

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మేనకోడలు, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కుమార్తె అంజలిరెడ్డి వివాహాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకునేలా అధికార కూటమి పావులు కదుపుతోంది. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో అంజలిరెడ్డి వివాహం జరిపించాలని కుటుంబసభ్యులు నిర్ణయించగా, అందుకు మాజీ సీఎం జగన్మోహనరెడ్డి అడ్డు చెప్పారని వార్తలు వచ్చాయి. దీనిపై వైసీపీ తరఫున వివరణలు ఇచ్చినప్పటికీ అధికార కూటమి మాత్రం ఈ విషయంలో విపక్షాన్ని ఇరుకన పెట్టేలా పావులు కదుపుతోందని అంటున్నారు. ఇప్పటివరకు ఈ అంశంపై టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు రాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ శనివారం మీడియా సమావేశంలో మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

స్థానిక ఎన్నికల సమయంలో మాజీ సీఎం జగన్ రెడ్డి మేనకోడలి వివాహం విషయంలో నెలకొన్న వివాదం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే జగన్ రెడ్డి కుటుంబంలో రకరకాల తగాదాలు రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం చర్చల్లో ఉంటున్నాయి. బాబాయ్ వివేకానందరెడ్డి హత్యతోపాటు చెల్లి షర్మిలతో ఆస్తి వివాదం మాజీ సీఎం జగన్ రెడ్డిని ఇరకాటంలో నెడుతోందని అంటున్నారు. ఈ విషయంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. తన వాదనకే ఆయన కట్టుబడినట్లుగా చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఆయనను టార్గెట్ చేస్తూ రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేస్తున్నా జగన్ మాత్రం ఎక్కడా మాట్లాడటం లేదు. దీంతో ఆయనను వెనకేసుకురావడం పార్టీ నేతలకు భారంగా ఉందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు పాత వివాదాలకు అదనంగా మేనకోడలి వివాహం కూడా వివాదాస్పదం చేయడంపై రకరకాల చర్చ జరుగుతోంది. ఇందులో జగన్ వైఖరిని ప్రశ్నిస్తూ అధికార కూటమి రాజకీయంగా మరింత దెబ్బ తీయాలని చూస్తోందని అంటున్నారు.

మేనకోడలి వివాహాన్ని కూడా అడ్డుకోవాలని చూస్తున్న జగన్ రెడ్డి మేమమామ కాదు కంసమామ అంటూ సీఎం చంద్రబాబు దెప్పిపొడిచారు. విరోధుల ఇంట్లో పెళ్లి జరిగినా ఎవరూ ఆపరని సీఎం వ్యాఖ్యానించారు. ఇది జగన్ రెడ్డి కుటుంబ వ్యవహారమని ఇందులో తాను తలదూర్చాల్సిన అవసరం లేదని చెబుతూ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తి ఆలోచన విధానం రాష్ట్రంపై ఎలా ప్రభావం చూపుతుందనే చెప్పడానికే ఈ అంశంపై మాట్లాడుతున్నానని వివరించారు. వివాహ పత్రికలు పంచిన తర్వాత వేదిక మార్చుకోవాలని చెప్పడాన్ని సీఎం ఆక్షేపించారు. మాజీ సీఎం రాజశేఖరరెడ్డి తన ఇద్దరు పిల్లలకు రెండు ఇళ్లు కట్టించారని సీఎం చెప్పారు. భద్రతా కారణాలు చూసి పెళ్లిని అడ్డుకోవడం కరెక్టు కాదని సీఎం అభిప్రాయపడ్డారు. గతంలో వైఎస్ ఫ్యామిలీలో జగన్ రెడ్డి, వైఎస్ సునీత వివాహాలు ఒకేసారి జరిగిన విషయాన్ని ప్రస్తావించారు. రాజశేఖరరెడ్డి కన్నా జగన్ రెడ్డికి ఏం ముప్పు ఉందని ప్రశ్నించారు.

తనకు అవసరం లేదంటూనే సీఎం చంద్రబాబు మాజీ సీఎం జగన్ రెడ్డి ఇంట్లో నెలకొన్న వివాదాన్ని ప్రస్తావించి వ్యూహాత్మకంగా వైసీపీని దెబ్బ తీయాలనే ఎత్తుగడను అమలు చేశారని అంటున్నారు. వచ్చేనెల 25న షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం జరగాల్సివుంది. బెంగళూరు యలహంక ప్యాలెస్ లో వివాహాం జరిపిస్తామని వధూవరుల కుటుంబ సభ్యులు ఆహ్వానపత్రికలు పంపిణీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతోపాటు కర్ణాటకకు చెందిన నేతలు కూడా ఈ వివాహానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ముఖ్య నేతలకు ఆహ్వానాలు పంపిణీ పూర్తి చేశారని చెబుతున్నారు. అయితే షర్మిల నివాసం ఉంటున్న ఇల్లు తన అత్త పేరున ఉండటంతో అందులో వివాహం జరిపించేందుకు జగన్ రెడ్డి అడ్డు చెప్పారని అంటున్నారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడం సంచలనం సృష్టించగా, జగన్ కు ప్రాణహాని ఉన్నందున ఎక్కువ మంది జనం వచ్చే కార్యక్రమాన్ని యలహంక ప్యాలెస్ లో అనుమతించలేమని వైసీపీ నేత పేర్ని నాని వివరణ ఇచ్చారు.

అయితే ఈ విషయాన్ని మరింత రాజేసేలా తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకున్నారని పరిశీలకులు చెబుతున్నారు. వివాహానికి ఇంకా నెల రోజుల సమయం ఉండటం, ఈ లోగా వరుసగా స్థానిక ఎన్నికలు జరుగుతుండటం వల్ల అంజలిరెడ్డి వివాహానికి రాజకీయంగా వాడుకోవాలని అధికార పక్షం భావిస్తోందని అంటున్నారు. సున్నితమైన అంశంలో జగన్ రెడ్డి ఆలోచన కరెక్టు కాదని ప్రచారం చేసేలా అధికార పార్టీ పావులు కదుపుతోందని చెబుతున్నారు. ఇక ఈ విషయంలో షర్మిల కూడా నోరు విప్పితే విపక్షం వైసీపీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కోవాల్సివస్తుందని అంటున్నారు. ఆ దిశగా ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించుకున్నారని, ఇక కూటమి నేతలు వరుసగా ఈ విషయాన్ని మరింత పెద్దది చేసేలా అడుగులు వేయొచ్చని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News