టీడీపీతో పోటాపోటీగా వైసీపీ.. జడ్పీ పోరులో ఆసక్తికర లెక్కలు

జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి, వైసీపీ నేతలు పోటీపడి నామినేషన్లు సమర్పించారని ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి.

Update: 2026-10-24 07:28 GMT

స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 659 జడ్పీ టీసీ స్థానాలు, 9,829 ఎంపీటీసీ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో అధికార కూటమికి దీటుగా వైసీపీ కూడా నామినేషన్లు సమర్పించిందని ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. దీంతో తమ నామినేషన్లు అడ్డుకుంటున్నారని విపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయిందని అధికార పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలోని 28 జిల్లాల పరిధిలో 9,829 ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 51,902 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అదేవిధంగా 659 జడ్పిటిసి స్థానాలకు 5,724 నామినేషన్లు పడ్డాయని వెల్లడించింది. ఇందులో చివరి రోజునే జడ్పిటిసి స్థానాలకు 3,315, ఎంపీటీసీ స్థానాలకు 25,016 నామినేషన్లు దాఖలు కావడం విశేషంగా చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిస్థానాలకు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.

జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి, వైసీపీ నేతలు పోటీపడి నామినేషన్లు సమర్పించారని ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంపీటీసీ స్థానాలకు టీడీపీ అభ్యర్ధులు అత్యధికంగా 22,013 నామినేషన్లు వేయగా, వైఎస్ఆర్సీపీ అభ్యర్ధులు 20,556 నామినేషన్లు దాఖలు చేశారు. ఇక జనసేన పార్టీ తరపున 4,609 మంది, బీజేపీ నుంచి 1,150 నామినేషన్లు దాఖలయ్యాయి. అదేవిధంగా, జడ్పిటిసి స్థానాలకు తెలుగుదేశం పార్టీ తరపున 2,078 నామినేషన్లు, వైఎస్ఆర్సీపీ నుంచి 1,815, జనసేన నుంచి 679, బీజేపీ తరపున 255 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల వర్గాలు వెల్లడించాయి. భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అవడం ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయనేదానికి నిదర్శనమని అధికార పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ విషయంలో విపక్షం వైసీపీ తప్పుడు ఆరోపణలు చేసిందని, నామినేషన్ ప్రక్రియ ఏకపక్షంగా జరిగితే వైసీపీ నేతలు ఇంత భారీగా పోటీకి నిలబడగలరా? అంటూ అధికార కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ వాదనలో నిజం లేదా?

జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత విపక్షం వైసీపీ చేస్తున్న విమర్శల్లో నిజం లేదన్న టీడీపీ వాదన పట్ల విస్తృత చర్చ జరుగుతోంది. అధికార కూటమితో సమానంగా వైసీపీ నామినేషన్లు దాఖలు చేయడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. దీంతో నామినేషన్ల విషయంలో వైసీపీ ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేసినట్లుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. నామినేషన్లు వేయనీయడం లేదన్న ప్రచారం ఎంత ఎక్కువ చేస్తే, తమ పార్టీకి అంత సానుకూలత వస్తుందనే కోణంలో వైసీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ, వైసీపీ అభ్యర్థులు భారీగా నామినేషన్ దాఖలు చేయడం చూస్తుంటే పక్కా ప్రణాళికతోనే ప్రభుత్వ వ్యతరేక ప్రచారం చేసినట్లుగా చెబుతున్నారు.

జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం : టీడీపీ ఫైర్

కాగా, భారీ ఎత్తున నామినేషన్ల ప్రక్రియ ముగిసినప్పటికీ... వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కూటమి నేతలు విమర్శలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా అన్ని పార్టీల అభ్యర్ధులు వేల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసిన వాస్తవాలను విస్మరిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. బెంగళూరు నుంచి తాడేపల్లికి రావడం, ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు ఆరోపణలు గుప్పించి మళ్లీ వెళ్లిపోవడం జగన్ కు అలవాటుగా మారిందని దుయ్యబడుతున్నారు. క్షేత్రస్థాయిలో వేలాదిగా నామినేషన్లు దాఖలవుతున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జగన్ 'హిట్ అండ్ రన్' థియరీకి తెరలేపారని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

కోర్టులో నిలబడుతుందా?

ఇక జడ్పీ ఎన్నికల నామినేషన్లపైనా న్యాయపోరాటం చేయాలన్న వైసీపీ ఆలోచనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. నామినేషన్లు వేయనీయలేదని ఆరోపణలు చేస్తూ హైకోర్టుకు వెళ్లాలని వైసీపీ భావించిందని అంటున్నారు. అయితే నామినేషన్ల ముగిసిన తర్వాత ఈ పరిస్థితి లేనట్లుగానే గణాంకాలు చెబుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికలను అడ్డుకోవాలనే ఉద్దేశంతో వైసీపీ వ్యూహాత్మకంగా కోర్టుకు వెళ్లినప్పటికీ, దీటుగా వాదించే అవకాశం ఉందని, దీనిద్వారా వైసీపీ కుట్రలను ఎత్తిచూపాలని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తానికి టీడీపీతో సమానంగా నామినేషన్లు వేసిన వైసీపీ ఇప్పటివరకు చేసిన ఆరోపణలపై ఏం చెబుతుందో చూడాల్సివుందని అంటున్నారు.

Tags:    

Similar News