టారిఫ్ లకు భయపడి యుద్ధం ఆపేశారు.. ట్రంప్ మళ్లీ ఏసేశాడు..
సాధారణంగా ఏవైనా రెండు దేశాలు యుద్ధానికి దిగితే ఏం జరుగుతుంది? సరిహద్దుల్లో వ్యూహాలు, దౌత్యవేత్తల రాయబారాలు, ఐక్యరాజ్యసమితి సమావేశాలు, శాంతి చర్చలు ఉంటాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు టారిఫ్లంటే ఎంత పిచ్చి ప్రేమ ఉందో లోకమంతటికీ తెలుసు. వ్యాపారులను భయపెట్టడానికైనా.. శత్రు దేశాలను లొంగదీసుకోవడానికైనా ఆయన చేతిలో ఉండే ఏకైక సుదర్శన చక్రం.. ‘టారిఫ్ లు’. అయితే ఈసారి ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా ప్రపంచ యుద్ధాలనే ఈ టారిఫ్‌ల భయంతో ఆపేశానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది వరకూ కూడా ఇదే మాట వల్లించినా ఇండియా ‘అది అబద్దం’ అని చెప్పడంతో చిన్నబుచ్చుకొని మళ్లీ టారిఫ్ లు వేశాడు. ఇప్పుడు ఇండియా కాదన్న అమెరికాలో తన పరిపతి కోసం మన యుద్ధాన్ని వాడుకొని ఓట్లు సంపాదించే పనిలో పడ్డాడు.
భారత్-పాకిస్థాన్ మధ్య గతంలో జరిగిన సైనిక ఘర్షణను తానే స్వయంగా ఆపానని.. రెండు దేశాలూ వినకపోతే 250 శాతం టారిఫ్‌లు వేస్తానని బెదిరించానని ఫ్లోరిడా సభలో ఆయన గొప్పగా చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆ పోరులో 11 యుద్ధవిమానాలు కూడా కూలిపోయాయని ఒక కొత్త సంఖ్యను లెక్కగట్టి చెప్పారు.
దౌత్యం వద్దు.. టారిఫే ముద్దు!
సాధారణంగా ఏవైనా రెండు దేశాలు యుద్ధానికి దిగితే ఏం జరుగుతుంది? సరిహద్దుల్లో వ్యూహాలు, దౌత్యవేత్తల రాయబారాలు, ఐక్యరాజ్యసమితి సమావేశాలు, శాంతి చర్చలు ఉంటాయి. కానీ ట్రంప్ వెర్షన్ ప్రకారం ఇవేవీ అక్కర్లేదు. ఒకవైపు ఆకాశంలో యుద్ధ విమానాలు గర్జించాలి.. బాంబులు పడాలి.. వెంటనే వైట్‌హౌస్ నుంచి ట్రంప్ ఒక టారిఫ్ కాగితం పట్టుకుని బయటకు రావాలి.. “యుద్ధం ఆపకపోతే మీ వ్యాపారాలు బంద్ చేస్తా..” అని హెచ్చరించాలి. అంతే.. ఎంతటి అణ్వాయుధ దేశాలైనా సరే భయంతో ఆయుధాలు కిందపడేసి గప్‌చుప్‌గా ఇంటికి వెళ్ళిపోవాలి.
ఇదీ ట్రంప్ మార్కు ‘పీస్ ఫార్ములా’.. సైనికుల వద్ద తుపాకులు ఉంటే.. ట్రంప్ చేతిలో మాత్రం టారిఫ్‌ల లిస్ట్ ఉంటుంది. శాంతిని నెలకొల్పడానికి నోబెల్ బహుమతి కాకపోతే కనీసం ‘టారిఫ్ అవార్డు’ అయినా ఇవ్వాలని విమర్శకులు సెటైర్లు వేస్తున్నారు.
భారత్ క్లారిటీ.. ఐనా క్రెడిట్ ‘పక్కా’
నిజానికి భారత్–పాక్ కాల్పుల విరమణపై భారత్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. తమ మధ్య మూడో వ్యక్తి జోక్యం లేదా మధ్యవర్తిత్వం లేదని ఇరు దేశాల సైనిక అధికారుల ప్రత్యక్ష చర్చల ద్వారానే ఇది సాధ్యమైందని స్పష్టం చేసింది. కానీ ట్రంప్‌నకు మాత్రం ఈ విషయాలేమీ పట్టవు. యుద్ధం ఆగితే క్రెడిట్ మొత్తం తన ఖాతాలోనే పడాలి. ‘ఫలితం ఏదైనా క్రెడిట్ నాదే’ అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉందంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వర్షం కురుస్తోంది.
అణ్వాయుధాలు ఉన్న రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం వెనుక దౌత్య సంక్లిష్టతలు, సరిహద్దు పరిస్థితులు ఉంటాయి తప్ప కేవలం వాణిజ్య హెచ్చరికలతోనే అంతా మారిపోతుందనడం హాస్యాస్పదంగా ఉంది. ఏదేమైనా ప్రపంచానికి శాంతి కావాలో లేదో తెలియదు కానీ.. ట్రంప్‌నకు మాత్రం “ఆ శాంతిని నేనే తెచ్చాను” అని చెప్పుకునే పబ్లిసిటీ మాత్రం ఖచ్చితంగా కావాలి.