ఏకంగా 18,407 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది!

సౌదీ అరేబియా ప్రభుత్వం అక్రమంగా దేశంలో నివసిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది.;

Update: 2025-04-07 11:14 GMT

సౌదీ అరేబియా ప్రభుత్వం అక్రమంగా దేశంలో నివసిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపింది. కేవలం వారం రోజుల వ్యవధిలో ఏకంగా 18,407 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. వీరంతా రెసిడెన్సీ, లేబర్, సరిహద్దు భద్రతా నియమాలను ఉల్లంఘించినట్లు సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మార్చి 27 నుండి ఏప్రిల్ 2 వరకు పలు ప్రభుత్వ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా, సరైన అనుమతులు లేకుండా దేశంలో నివాసం ఉంటున్నవారు, సరిహద్దులు దాటి అక్రమంగా ప్రవేశించిన వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించారు. సౌదీ ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అరెస్టు అయిన వారిలో 12,995 మంది రెసిడెన్సీ చట్టాలను, 3,512 మంది సరిహద్దు భద్రతా చట్టాలను, 1,900 మంది లేబర్ చట్టాలను ఉల్లంఘించారు.

అరెస్టు అయిన వారిలో అత్యధికంగా 66 శాతం మంది ఇథోపియా దేశానికి చెందినవారుగా గుర్తించారు. ఆ తర్వాత 28 శాతం మంది యెమెన్ దేశస్థులు ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన మొత్తం 27,288 మంది వివరాలను వారి వారి దేశాల దౌత్య కార్యాలయాలకు సౌదీ ప్రభుత్వం తెలియజేసింది. వీరిలో ఇప్పటికే 7,523 మందిని నేరుగా వారి స్వదేశాలకు పంపించేశారు. అక్రమ వలసదారులకు సహాయం చేసే వారిపైనా సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 21 మందిని అరెస్టు చేశారు. వీరు అక్రమ వలసదారులకు ఆశ్రయం ఇవ్వడం, రవాణాకు సహకరించడం వంటి చర్యలకు పాల్పడ్డారని గుర్తించారు. అక్రమ వలసదారులకు ఎవరైనా సహాయం చేస్తే వారికి 15 సంవత్సరాల జైలు శిక్ష, మిలియన్ సౌదీ రియాల్స్ (సుమారు రూ. 2.2 కోట్లు) జరిమానా, వారి ఆస్తులు, వాహనాలు సీజ్ చేయబడతాయని సౌదీ ప్రభుత్వం హెచ్చరించింది.

మరోవైపు, సౌదీ అరేబియా మొత్తం 14 దేశాలకు చెందిన పౌరులకు కొన్ని రకాల వీసాలను జారీ చేయడంపై నిషేధం విధించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. జూన్ మధ్య వరకు ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాలపై ఈ నిషేధం కొనసాగనుంది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేసే వారిని అడ్డుకోవడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. గతంలో చాలా మంది ఉమ్రా లేదా విజిట్ వీసాపై సౌదీలోకి ప్రవేశించిన తర్వాత, వీసా గడువు ముగిసినా తిరిగి వెళ్లకుండా అక్కడే ఉండిపోయి హజ్ యాత్రలో పాల్గొనడం ఒక సాధారణ విషయంగా మారింది. దీనివల్ల తీవ్రమైన వేడిలో జరిగే హజ్‌లో రద్దీ పెరిగి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. 2024లో ఇలాంటి పరిస్థితుల్లోనే 1,200 మంది యాత్రికులు మరణించారు. ఇప్పటివరకు హజ్ కోసం సౌదీ అరేబియా ప్రతి దేశానికి కొన్ని నిర్దిష్ట స్లాట్లను కేటాయిస్తూ వస్తోంది. అయితే, ముందుగానే దేశంలోకి వచ్చి ఉండిపోయిన వారు ఈ కేటాయింపుల వ్యవస్థను దాటవేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీ ప్రభుత్వం కఠినమైన చర్యలకు ఉపక్రమించింది.

Tags:    

Similar News