పాక్ తో ఉద్రిక్తతల వేళ రంగంలోకి సౌదీ, ఇరాన్.. భారత్ తో రాజీ?

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న తరుణంలో సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల శాఖ జూనియర్‌ మంత్రి అదెల్‌ అల్‌జుబైర్‌ హఠాత్తుగా న్యూదిల్లీ పర్యటనకు వచ్చారు.;

Update: 2025-05-08 10:33 GMT

భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న తరుణంలో సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల శాఖ జూనియర్‌ మంత్రి అదెల్‌ అల్‌జుబైర్‌ హఠాత్తుగా న్యూదిల్లీ పర్యటనకు వచ్చారు. ఈరోజు ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో కీలక చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా ఈ పర్యటన జరిగినట్లు సమాచారం.

ఈ సమావేశంపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ సామాజిక మాధ్యమం ఎక్స్‌ ద్వారా స్పందించారు. "సౌదీ అరేబియా మంత్రి అదెల్‌ అల్‌ జుబైర్‌తో భేటీ అయ్యాను. ఉగ్రవాదాన్ని అణచివేసే విషయంలో భారతదేశం యొక్క దృక్పథాన్ని ఆయనకు వివరించడం జరిగింది" అని జైశంకర్‌ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

'ఆపరేషన్‌ సిందూర్‌' అనంతరం భారత్‌-పాకిస్థాన్‌ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, ఈ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాల్లో భాగంగా సౌదీ మంత్రితో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

సౌదీ మంత్రితో భేటీ తర్వాత, భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఇరాన్‌ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి సయ్యద్‌ అబ్బాస్‌ అరాగ్ఛితోనూ సమావేశమయ్యారు. భారత్‌-పాక్‌ మధ్య రాజీ కుదిర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల అరాగ్ఛి తన సోషల్‌ మీడియా పోస్ట్‌లో, "మాకు సోదరుల్లాంటి పొరుగుదేశాలే అత్యున్నత ప్రాధాన్యం" అని పేర్కొంటూ, భారత్‌, పాకిస్థాన్‌లోని తమ దౌత్యకార్యాలయాల సహకారంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గిస్తామని తెలిపారు.

ఆసక్తికరంగా అరాగ్ఛి ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే పాకిస్థాన్‌ను కూడా సందర్శించారు. అక్కడ అక్కడి నాయకులతో చర్చలు జరిపి, తిరిగి ఇరాన్‌కు వెళ్లిన తర్వాతే న్యూదిల్లీకి రావడం గమనార్హం. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగానే ఈ మధ్యవర్తిత్వ ప్రయత్నాలు జరుగుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

Tags:    

Similar News