ఏపీకి అతి పెద్ద ముప్పు...అప్రమత్తం కావాల్సిందే !

ఏపీ విషయంలో ఒక పెద్ద అనుకూలత ఉంది. తరచూ దానిని మన పాలకులు గొప్పగా చెప్పుకుంటారు.;

Update: 2025-10-24 03:15 GMT

ఏపీ విషయంలో ఒక పెద్ద అనుకూలత ఉంది. తరచూ దానిని మన పాలకులు గొప్పగా చెప్పుకుంటారు. దేశంలో గుజరాత్ తరువాత అతి పెద్ద తీర ప్రాంతం ఏపీకి ఉంది. తొమ్మిది జిల్లాలను ఆనుకుని వేయి కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఇది అభివృద్ధి పరంగా ఏపీకి ఎంతో మేలు చేసేదిగా ఉంటుంది.ఎందుకంటే ఎక్కడైతే సముద్రతీరం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. ఇది చరిత్రలో రుజువు అయిన సత్యం. ఆ విధంగా ఏపీకి ఎంతో భవిష్యత్తు ఉంది. అయితే ఇదే సమయంలో ప్రతికూలత కూడా ఉంది. అదేమిటి అంటే ఇదే అతి పెద్ద తీరం వల్ల పెను ముప్పు అని అంటున్నారు.

సముద్ర మట్టం పెరుగుతోంది :

ఈ భూగోళం పెను తాపానికి గురి అవుతోంది. దాంతో పాటుగా ప్రకృతి పరంగా అనేక మార్పులు సంభవిస్తున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షాలు తుఫానులు సునామీలు ఇలా ఎన్నో సవాళ్ళు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తీర ప్రాంతం కలిగిన రాష్ట్రాలు ప్రాంతాలకు రాబోయే కాలం గడ్డు కాలం అని అంటున్నారు. తీవ్రమైన వాతావరణం మార్పులు పరిస్థితుల వల్ల సముద్ర మట్టం బాగా పెరుగుతోంది. దాని వల్ల తీరానికి భారీ కోతలు కూడా ఎదురవుతున్నాయి. ఇవన్నీ కూడా రానున్న రోజులలో మరింతగా పెరిగే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆందోళనకరమే :

తీర ప్రాంతాలు కోతకు గురి కావడమే కాదు సముద్ర మట్టాలు బాగా పెరిగితే కనుక సమీపంలోని ప్రాంతాలు అన్నీ నీట మునుగుతాయి అంటున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న పెను ముప్పు అయినప్పటికీ దేశంలో ఉన్న తీర ప్రాంత రాష్ట్రాలకు గట్టి హెచ్చరికలుగా భావించాలని అంటున్నారు. ఇదే తీరున సముద్ర మట్టాలు పెరిగితే ఏపీలో ఏకంగా 282 తీర ప్రాంత గ్రామాలకు ప్రమాదకర ఘంటికలు మోగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ముప్పు వల్ల ఈ ప్రాంతాలలో నివసించే ఏకంగా పది నుంచి పదిహేను లక్షల మంది ప్రజల జీవితాలు కూడా ఆందోళనలో పడతాయని అంటున్నారు. అందువల్ల వీరిని పెద్ద ఎత్తున రానున్న కాలంలో సురక్షితమైన ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

ప్రభుత్వాలకు సవాల్ :

ఇంత పెద్ద ఎత్తున ప్రజలను తరలించి వారికి వేరే చోటున శాశ్వతంగా ఉపాధి అవకాశాలు కల్పించడం అన్నది రాష్ట్ర ప్రభుత్వాలకు పెను సవాల్ గా మారనుంది అని అంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వానికి అధికారులు ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. దాంతో ఏపీలో మొత్తం తీర ప్రాంతంలో 32 శాతం కోతకు గురి అవుతున్నట్లుగా గుర్తించారు అని అంటున్నారు ఏపీలో గతంలో పోలిస్తే ఇటీవల సంవత్సరాలలో పెద్ద ఎత్తున కోతలు తీరంలో కనిపిస్తున్నాయని చెబుతున్నారు. సముద్రపు అలల తాకిడితో పాటు ఆధునిక మానవ జీవితంలో జరుగుతున్న కార్యకలాపాల వల్ల కూడా తీరం ఒత్తిడికి గురి అవుతోందని అంటున్నారు. ఇక సముద్రాల నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతోంది అని అంటున్నారు.

దీర్ఘకాలిక ప్రణాళికలు :

తీరం కోతకు గురి అవుతోంది. దాంతో ఆయా ప్రాంతాలలో ఇక మీదట జన జీవనం కష్టతరం అవుతుంది. అందుకోసం అక్కడి ప్రజానీకం కోసం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళికగా చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. తీర ప్రాంతాలలో రక్షణ కోసం నిర్మాణాలు చేపట్టాలి, అలాగే కోతను వీలైనంత వరకూ తగ్గించేలా నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇక ముంపు ప్రాంతాల ప్రజలకు శాశ్వత నివాసాలు కల్పించాల్సి ఉంది. వాతావరణంలో మార్పులు భారీగా చోటు చేసుకుంటున్న క్రమంలో ప్రభుత్వాలు ఈ విషయం మీద ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ లాంగ్ టెర్మ్ పాలసీలతో ముందుకు సాగాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News