పదవీపట సోపానంలో.. ఎన్టీఆర్ సరసన ముఖ్య ‘‘మంత్రి’’ రేవంత్
ఒక్కో మెట్టు ఎక్కుతూ.. నిచ్చెన్నలను అందుకుంటూ.. విష సర్పాల బారినపడకుండా లక్ష్యం చేరుకునే ఈ ఆట తెలుగువారికి చాలా ఇష్టం కూడా.;
పదవి.. రాజకీయాల్లో దీనికి ఉన్న పాపులారిటీ మామూలుది కాదు. అది చిన్న పదవైనా పెద్ద పదవెనా.. పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వచ్చినదైనా.. అధికారంలో ఉన్నప్పుడు వచ్చినదైనా.. పదవి అంటేనే పవర్ సెంటర్. అందుకే చిన్న పదవి అయినా దక్కాలని కోరుకుంటారు నాయకులు. దీనికోసం కొందరు కోట్లు ఖర్చు చేస్తుంటారు కూడా. కానీ, జీవితాంతం శ్రమించినా మరికొందరు కనీసం పదవులు దక్కించుకోలేరు.
‘పదవీ’పట సోపానంలో..
పరమపద సోపాన పటం తెలుగు వారి ఇళ్లలో సహజం. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. నిచ్చెన్నలను అందుకుంటూ.. విష సర్పాల బారినపడకుండా లక్ష్యం చేరుకునే ఈ ఆట తెలుగువారికి చాలా ఇష్టం కూడా. దీనినే రాజకీయాలకు వర్తింపజేస్తే.. పదవీ పట సోపానం అనుకోవాలి. అలాంటి పదవీ పట సోపానంలో అత్యున్నత లక్ష్యం ముఖ్యమంత్రి పదవి. దానిని అందుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు కూడా. ఉదాహరణకు కాంగ్రెస్ వంటి 125 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలో 50 ఏళ్లు కొనసాగిన వారికీ సీఎం పదవి దక్కుతుందని గ్యారెంటీ లేదు. కానీ, ఐదేళ్లలో దానిని అందుకుని చరిత్రలో నిలిచారు ఎనుముల రేవంత్ రెడ్డి. అతి సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన .. అంచలంచెలుగా ఎదిగి నేడు సీఎం కానున్నారు. ఈ మధ్యలో పాముల బారిన పడినా, దానిని ఛేదించి ముందుకెళ్లారు.
నాడు ఎన్టీఆర్..
రాజకీయాల్లో మంత్రి పదవి అంటేనే చాలా గొప్ప. అసలు ఎమ్మెల్యే అవడమే ఇంకా గొప్ప. ఇక మంత్రిగా అనుభవం లేకుండానే సీఎం కావడం అంటే అది లక్ అనే చెప్పాలి. ఈ లక్ రేవంత్ రెడ్డికి చాలా ఎక్కువే ఉందని చెప్పాలి. కేవలం 14 ఏళ్ల చట్ట సభల అనుభవంతో ఆయన సీఎం అవుతున్నారు. మరోవైపు ఇంతవరకు రేవంత్ కు మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. ఆ మాటకొస్తే ఆయన అధికార పక్షంలో ఉన్నదీ లేదు. 2009లో మహా కూటమిలో టీడీపీ తరఫున కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. ప్రతిపక్షంలో ఉండిపోయారు. అత్యంత తీవ్రంగా సాగిన తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో వ్యవహరించారు. ఇక 2014లో టీడీపీ చెప్పుకోదగ్గ సీట్లు సాధించినా, తెలంగాణలో అధికారం దక్కలేదు. 2018లో రేవంత్ స్వయంగా ఓడిపోయారు. అంటే.. రాజకీయ జీవితంలో ఏనాడూ అధికారంలో లేరు. మంత్రి పదవిని అనుభవించలేదు. కానీ, ఇప్పుడు మాత్రం ఏకంగా సీఎం అవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ, తెలంగాణలో కానీ.. ఈ ఘనత కొద్దిమందికే దక్కింది. 1983లో తెలుగు దేశం పార్టీని స్థాపించి 9 నెలలకే అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్, 2010లో పార్టీని నెలకొల్పి 2019లో సీఎం అయిన వైఎస్ జగన్, 2010లో ఉమ్మడి ఏపీ సీఎంగా అనూహ్యంగా ఎంపికైన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇలా మంత్రేలు కాకుండానే ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ కోవలోనే మంత్రి బాధ్యతలు నిర్వర్తించకుండానే ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని నడిపే అవకాశం దక్కించుకున్నారు రేవంత్ రెడ్డి.
కొసమెరుపు: ‘‘రేవంత్.. మీకు పదవులు నిర్వర్తించిన అనుభవం లేదు కదా..? సీఎం అయితే రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారు..?’’ ఇదీ ఇటీవల ఎన్నికల సందర్భంగా జాతీయ మీడియా రేవంత్ రెడ్డిని అడిగిన ప్రశ్న. ‘’20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా. చంద్రబాబు దగ్గర పనిచేశా. కేసీఆర్ మీద పదేళ్లుగా పోరాడుతున్నా. కేసీఆర్ చేసిన తప్పులు చేయకుంటే చాలు. అవే ఒప్పులు’’ ఇంతకంటే ఏం కావాలి..? ఇదీ రేవంత్ రెడ్డి ఇచ్చిన జవాబు. దీన్నిబట్టే ఆయన భవిష్యత్ పై అత్యంత స్పష్టతతో ఉన్నట్లుగా స్పష్టమవుతోంది.