నాకు అనుభవం లేదు...రేవంత్ బోల్డ్ స్టేట్మెంట్
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. తనకు మంత్రిగా అనుభవం లేదని ఆయన షాక్ ఇచ్చారు.;

తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోల్డ్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. తనకు మంత్రిగా అనుభవం లేదని ఆయన షాక్ ఇచ్చారు. నిజానికి ఏణ్ణర్థం కాలంగా ఆయన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన పాలనలో రాటు తేలారు. అయితే ఆయన తెలంగాణాలో రైతులతో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు మంత్రిగా అనుభవం లేకపోయినా ఎంతో అనుభవం కలిగిన పెద్దలు తన బృందంలో ఉన్నారు అన్నారు.
సీనియర్ నేతలు ఎంతో మంది మంత్రులుగా తన సహచరులుగా ఉన్నారు అని చెప్పారు. వారి సాయంతో తెలంగాణాలో రైతులకు చేయాల్సిన మేలు చేసి చూపిస్తామని అన్నారు. నిజానికి రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్ చూస్తే మొదట ఎమ్మెల్సీ అయ్యారు ఆ తరువాత రెండుసార్లు వరసగా ఎమ్మెల్యే అయ్యారు. మరో అయిదేళ్ళ పాటు ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయిన నాటికి ఆ పార్టీ అధికారంలో లేదు. దాంతో మంత్రి కాలేకపోయారు.
ఇక ఆయన ఎంపీగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. కాంగ్రెస్ లోనే ఆయన పీసీసీ చీఫ్ స్థాయికి ఎదిగి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. అలా మంత్రి కాకుండా ముఖ్యమంత్రులుగా అయిన వారు తెలుగు నాట చాలా మంది ఉన్నారు. అయితే ఎవరూ బోల్డ్ గా తమకు మంత్రిగా చేసిన అనుభవం లేదని చెప్పలేదు. రేవంత్ రెడ్డి మాత్రం తనకు అమాత్య అనుభవం లేదని సభా వేదిక మీద నుంచి చెప్పడం ద్వారా తనలోని ఒక గొప్ప లక్షణాన్ని చాటుకున్నారు అని అంటున్నారు.
ఇక బీఆర్ఎస్ నేతల గురించి ఆయన చెబుతూ ప్రతీ రోజూ తన మీద అసూయతో అక్కసుతో విషం కక్కుతున్నారని అన్నారు. వాటిని తాను పట్టించుకోను అని అయితే ప్రభుత్వం చేసే మేలు గురించి తెలుసుకుని ఫలాలను ఫలితాలను అందుకుంటున్న రైతులు వివిధ వర్గాల ప్రజలే వారి పని పట్టాలని రేవంత్ రెడ్డి కోరారు.
అంతే కాదు ఎన్ని మాటలు అన్నా ఎంతగా గోల పెట్టినా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా పదేళ్ళ పాటు అధికారంలో ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. మీరు బట్టలు చింపుకున్నా నేల మీద పడి దొర్లినా శాపనార్ధాలు పెట్టినా ఎన్ని రకాలుగా అడ్డు తగిలినా అధికారం మీ చేతిలోకి ఎప్పటికీ వచ్చే చాన్స్ లేదని రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.
మంచి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేతలు తిడుతున్న తిట్లు అన్నీ ఆశీర్వాదాలే అని అన్నారు. రైతుల విషయం మాట్లాడుతూ పంట మార్పిడి గురించి తెలుసుకోవాలని ఆ దిశగా పంటలు పండించాలని సూచించారు. యువత జొన్న రొట్టెలు తిని తమ బట్టలు తాము ఉతుక్కుంటే కచ్చితంగా సిక్స్ ప్యాక్ తో వారు హెల్తీగా ఉంటారు అని అన్నారు
దోసకాయ కందిపప్పు కలిపి వండితే బ్రహ్మాడమైన రుచి ఉంటుందని దాని రుచి చికెన్ మటన్ కి కూడా రాదు అని రేవంత్ రెడ్డి అన్నారు. పాత కాలం రుచులు పంటలు వంటలు ఈ తరం అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇపుడు అలాంటి రుచులే లేవని ఆయన ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి తన కంటే సీనియర్ లీడర్లతో నిండిన కాంగ్రెస్ మంత్రులను పెద్దలను గౌరవిస్తున్నారు.
అంతే కాదు ఆయన వారికే పెద్ద పీట వేస్తున్నారు. తాను ఉత్సాహవంతుడిని మాత్రమే అని చెప్పుకుంటున్నారు. తన ఉత్సాహం వారి అనుభవం కలిపి కాంగ్రెస్ ని తెలంగాణాలో మరింతగా బలొపేతం చేద్దామ్ని మరిన్ని టెర్ములు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేలా చూద్దామని ఆయన గట్టి భరోసాతో చెబుతున్నారు.