సిటీలో కాంగ్రెస్.. రేవంత్ ఇమేజ్ డబుల్
ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా? లేదా? అన్న సినిమా స్టైల్లో దూసుకొచ్చి సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి.;
ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా? లేదా? అన్న సినిమా స్టైల్లో దూసుకొచ్చి సీఎం అయ్యాడు రేవంత్ రెడ్డి. అయితే అన్నీ బాగానే ఉన్నా.. ఒక్కటే రేవంత్ కు మరకలా అంటింది. తెలంగాణ అంతటా కాంగ్రెస్ ను గెలిపించి.. కేవలం హైదరాబాద్ పరిధిలో మాత్రం కాంగ్రెస్ కు ఒక్కటంటే ఒక్క సీటును కూడా గెలిపించలేకపోయాడన్న అపప్రద ఆయనలో వెలితిగా ఉంది. కానీ ఇప్పుడ ఆ అవకాశం వచ్చింది. జూబ్లిహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనారోగ్యంతో మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈ ఎన్నికపై ఫోకస్ చేశాడు. రచ్చ గెలిచిన రేవంత్.. ఇంట హైదరాబాద్ సిటీలో కనుక కాంగ్రెస్ ను గెలిపిస్తే నిజంగానే రేవంత్ ఇమేజ్ డబుల్ అవుతుంది. ఎక్కడికో వెళ్లిపోతుంది. అది సాధ్యమవుతుందా? రేవంత్ ముందు ఉన్న సవాళ్లు ఏమిటన్నది ఆసక్తి రేపుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక ఎన్నికకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రం మొత్తం గెలిపించుకున్నప్పటికీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో ఒక్కటి కూడా గెలవలేకపోయిన ఆ లోపాన్ని తుడిచిపెట్టుకునే అవకాశం రేవంత్ కు ఇప్పుడు దొరికింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన ఫోకస్ అంతా ఈ ఎన్నికల పైనే ఉంది.
తాజాగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే శాసనసభ కార్యదర్శి గెజిట్ విడుదల చేయగా.. ఎన్నికల కమిషన్ నుంచి నోటిఫికేషన్ కూడా త్వరలో రానుంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యూహరచనలో మునిగిపోయింది. గాంధీభవన్ లో కీలక నేతలతో భేటీలు, అభ్యర్థుల ఎంపికపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.
కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును చేజిక్కించుకున్న ఘనత రేవంత్‌కు దక్కింది. అదే జోష్‌తో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై దృష్టి పెట్టారు. ఈసారి కూడా కాంగ్రెస్ గెలిస్తే గ్రేటర్ హైదరాబాద్ లో తమ దూకుడు మొదలవుతుందన్నది ఆయన ఎత్తుగడ.
ఈ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీ ఓట్లు కీలకం కావడంతో ఎంఐఎం మద్దతు కీలకంగా మారింది. గతంలో బీఆర్ఎస్ కు సానుకూలంగా ఉన్న మజ్లిస్.. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పక్షాన నిలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మజ్లిస్ అధినేతలు కూడా రేవంత్ రెడ్డితో మంచి సఖ్యతను కొనసాగిస్తున్నారు.
జూబ్లీహిల్స్ టికెట్ కోసం అభ్యర్థుల పోటీ కూడా జోరుగా ఉంది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్, గత ఎన్నికల్లో మజ్లిస్ తరఫున బరిలోకి దిగిన తర్వాత కాంగ్రెస్ లో చేరిన నవీన్ యాదవ్, పిజేఆర్ కుమార్తె విజయా రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ వంటి పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయి. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఆశావాహుల జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. గ్రేటర్ హైదరాబాద్ లో దూకుడు పెరుగుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి క్రేజ్, ఇమేజ్ మరింత పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నగరంలో దృఢమైన పునాది వేసుకున్నట్టు సాక్ష్యం అవుతుంది. కాబట్టి ఈ ఉపఎన్నిక రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా మారనుంది.
మొత్తానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా వ్యూహాలు అమలుచేస్తోంది. ఫలితంగా ఈ సీటు పై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.