మంత్రులపై పట్టు బిగించిన సీఎం రేవంత్ రెడ్డి.. గేమ్ ఓవర్!!
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రెండేళ్లలో పూర్తి పట్టు సాధించారు. జడ్పీటీసీగా క్షేత్రస్థాయిలో రాజకీయాలు మొదలుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎంతో అనుభవం గడించారు.;
తెలంగాణలో మంత్రులు విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పలువురు సీనియర్ నేతలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా పదవీ బాధ్యతలు తీసుకున్నవారిలో కొందరు తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికన్నా సీనియర్లు అనే భావనతో స్వతంత్రంగా వ్యవహరించినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. మొదట్లో ఇలాంటి వారి వల్ల ప్రభుత్వం కొంతవరకు ఒడిదుడుకులు లోనైనట్లు ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు లెక్కచేయడం లేదని, ఆయనకు విలువ నివ్వడం లేదని విస్తృతంగా ప్రచారం జరిగింది. కాంగ్రెస్ సంస్కృతిలో ఇది సహజమనే భావనతో కార్యకర్తలు సర్దుకుపోయినట్లు చెబుతున్నారు.
అయితే ఇటీవల కాలంలో ఈ పరిస్థితిలో మార్పు వస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి విధేయంగా పనిచేస్తున్నామని చెప్పుకునేందుకు మంత్రులు పోటీ పడుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందని, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని చెబుతున్నారు. కాంగ్రెస్ మంత్రులు ఇలా మారిపోయారని చెప్పడానికి తాజాగా ఎన్నో ఉదాహరణలు చూపుతున్నారు. ప్రస్తుతం నైనీ కోల్ బ్లాక్ లీజు విషయంలో ఆత్మరక్షణలో పడిపోయిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఈగ వాలనీయమన్నట్లు మాట్లాడుతున్నారని అంటున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రెండేళ్లలో పూర్తి పట్టు సాధించారు. జడ్పీటీసీగా క్షేత్రస్థాయిలో రాజకీయాలు మొదలుపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎంతో అనుభవం గడించారు. అయితే మొదట్లో పరిపాలనపై సరైన అవగాహన లేకపోవడం, కాంగ్రెస్ లో తనకన్నా సీనియర్లు ఉన్నారని, వారిని గౌరవించాలనే ఉద్దేశంతో మంత్రివర్గంలో చాలా మందికి స్వేచ్ఛనిచ్చారని వ్యాఖ్యానిస్తున్నారు. తొలుత ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా వేసిన సీనియర్లు ప్రభుత్వంలోను పాలన వ్యవహారాల్లోనూ స్వతంత్రంగా వ్యవహరించారని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా స్వీయ తప్పులతో ఇరుక్కుపోయారని అంటున్నారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుబిగించారని వ్యాఖ్యానిస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా సీఎం పదవిలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుల్లో ఎవరి పనితనం ఏంటి? ఎవరు, ఎక్కడ, ఏం చేశారన్న విషయంపై పూర్తి అవగాహన ఏర్పరచుకున్నారని అంటున్నారు. ఇలా రెండేళ్లపాటు మంత్రులను వదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మంత్రులకు అష్టదిగ్బంధం చేసేలా పావులు కదిపి సక్సెస్ అయ్యారని అంటున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ హోదాలో మంత్రి పదవి స్వీకరించిన వరంగల్ మహిళా నేత కొండ సురేఖ ఉదంతం కూడా ఈ కోవలోకే వస్తుందని అంటున్నారు.
తొలుత సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుదారుగా వ్యవహరించిన సురేఖ కొంత స్వేచ్ఛగా వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఆమె శ్రుతిమించిన అధికారం చెలాయించడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని గ్రహించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరైన సమయంలో అదుపులో పెట్టారని అంటున్నారు. అదేసమయంలో వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై గతంలో ప్రత్యక్ష విమర్శలు చేశారు. తొలుత ఆ ఎమ్మెల్యేని చూసి చూడనట్లు వదిలేసిన సీఎం రేవంత్ రెడ్డి సరైన సమయంలో పావులు కదిపి ఆ ఎమ్మెల్యేను దారికి తెచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి రెండేళ్లలో పాలనపై పూర్తి పట్టు సాధించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో సరికొత్త కాంగ్రెస్ పార్టీని ఆవిష్కరించారని అంటున్నారు.