రేవంత్ గులాబీ ముళ్ళనే చూశారు కానీ....!

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగానే రాజకీయం చేస్తారు. ఆయనది మొదటి నుంచి అదే స్టైల్.;

Update: 2025-07-19 16:24 GMT

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగానే రాజకీయం చేస్తారు. ఆయనది మొదటి నుంచి అదే స్టైల్. తాను అనుకున్న లక్ష్యం చుట్టూనే ఆయన రాజకీయ వ్యూహాలు ఉంటాయి. అందుకే ఆయన రాజకీయ ప్రస్థానం చాలా వేగంగా సాగింది. అనుకున్న గమ్యాన్ని చేరింది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు.

కాంగ్రెస్ లో ఆయన ఎదిగిన తీరు అనన్యసామాన్యం అని చెప్పుకోవాలి. కాంగ్రెస్ అంటేన ఒక మహా సముద్రం. అందులో ఎన్నో ఉంటాయి. ఎవరేంటి అన్నది అర్థం కాదు. అయితే రేవంత్ రెడ్డికి హైకమాండ్ సపోర్టు ఫుల్ గా ఉండడంతో ఏణ్ణర్థం కాలంగా ఆయన సీఎం గా దూసుకునిపోతున్నారు.

అయితే ఆయన తరచూ పదేళ్ళ పాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని చెప్పుకొచ్చేవారు. కానీ తాజాగా ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 2034 వరకూ మరో పదేళ్ళ పాటు తానే తెలంగాణా సీఎం గా ఉంటాను అని ధాటీగా చెప్పారు. అప్పటిదాకా హస్తమే రాజ్యం చేస్తుంది కాబట్టి ఆశలు అన్నీ వదిలేసుకోవాలని కూడా బీఆర్ఎస్ కి సూచించారు.

అయితే రేవంత్ రెడ్డి ఈ గంభీర ప్రకటన అనుకోవచ్చు. సవాల్ అనుకోవచ్చు. ధీమా అనుకోవచ్చు. తన నోటి నుంచి వెలువరించేటపుడు ఎదురుగా ఉన్న బీఆర్ఎస్ గులాబీ ముళ్ళనే చూశారు కానీ తన దారిలో అడ్డుపడే పల్లేరు ముళ్ళను గుర్తించలేకపోయారా అన్న చర్చ సాగుతోంది. ఆయన పదేళ్ళ పాటు తెలంగాణాలో కాంగ్రెస్ అధికారం ఉంటుందని చెప్పడం వరకూ సబబే అనుకోవాలి కానీ తానే ఆ మొత్తం కాలం సీఎం అనేసారికి మాత్రం కాంగ్రెస్ వర్గాలకు అందులో సీనియర్లకు ఎక్కడో ఆవేదన నిరాశ కలుగుతుందని ఊహించలేకపోయారు అని అంటున్నారు.

కాంగ్రెస్ లో చూస్తే దాదాపుగా అందరూ సీఎం క్యాండిడేట్లు గానే ఉంటారు. అలాంటి కాంగ్రెస్ లో సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వడం ఒక అద్భుతమే అనుకోవాలి. మరి ఆయన పదేళ్ళు తానే సీఎం అంటే ఎప్పటికైనా ఆ కుర్చీ ఎక్కాలనుకునే సీనియర్లకు నిండా నిరాశ కలుగుతుంది కదా అని అంటున్నారు.

నిజంగా చూస్తే రేవంత్ రెడ్డి తన పెర్ఫార్మెన్స్ ని బట్టి ఈ దఫా అయిదేళ్ళూ సీఎం గా ఉండవచ్చు. మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకుని వస్తే ఆయనకే హైకమాండి పిలిచి పెద్ద పీట వేయవచ్చు. కాంగ్రెస్ లోనే పుట్టి జీవితాంతం ఆ పార్టీలో ఉంటూ మూడు దశాబ్దాల పాటు సీఎం పదవి కోసం వేచి చూసిన వైఎస్సార్ సైతం తానే పదేళ్ళ పాటు సీఎం అని అనలేదని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ లో అవకాశాలు ఎంత సులువుగా వచ్చినట్లుగా కనిపిస్తాయో అంతే వేగంగా వెళ్ళిపోతాయని కూడా చెబుతారు.

ఇక ఈ రోజున రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇచ్చింది ఆయనకు ఉన్న ప్రజాకర్షణ శక్తిని చూసే అని అంటారు. ఆయనకు అంటూ ఒక బలమైన అనుచర వర్గం కూడా కాంగ్రెస్ లో ఉంది. ఇక జాతీయ స్థాయిలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. దాంతో ఈ కుర్చీలాటకు ఆ పార్టీ దూరంగా ఉంది. పొరపాటున ఏదో చేయాలని అనుకుంటే ఏదో జరిగితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది అన్న కలవరం కూడా కేంద్ర పెద్దలకు ఉందని అంటారు.

అందుకే కర్ణాటక విషయంలోనూ కాంగ్రెస్ అధినాయకత్వం వెనకా ముందూ ఆడుతోంది. అక్కడ చెరి రెండున్నరేళ్ళూ అని అనధికార ఒప్పందం ఏదో ఉందని వార్తలు ఉన్నా ఆలోచిస్తున్నారు అంటే బీజేపీ భయమే అని చెబుతారు. ఇలా అనేక కారణాలు కలిసిరావడం కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం గా కొనసాగడానికి ఆస్కారం కల్పిస్తున్నాయని అంటున్నారు. మరో వైపు చూస్తే 2029 లో కాంగ్రెస్ కనుక కేంద్రంలో అధికారంలోకి వస్తే చాలా లెక్కలు మారుతాయి. తెలంగాణాలోనూ అలాగే జరుగుతుంది అని అంటున్నారు.

మరి ఇవన్నీ తెలియని వారు ఎవరూ లేరు. రేవంత్ రెడ్డి అయితే నేనే సీఎం అని ఎందుకు అన్నారో కానీ అదే పార్టీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే ట్వీట్ ద్వారా కౌంటర్ ఇచ్చేశారు. కాంగ్రెస్ లో ముందే సీఎం ఎవరో చెప్పే కల్చర్ లేదని అన్నారు. ఆయన ఇంకా చాలానే చెప్పారు. మొత్తానికి రేవంత్ బీఆర్ఎస్ ని చూస్తూ చేసిన సవాల్ కి జవాబు సొంత పార్టీ వారే అలా ఇచ్చేశారు అన్న మాట.

ట్వీట్ చేసింది రాజగోపాల్ రెడ్డి అయినా చాలా మంది సీనియర్ల మనోభావన అదే అయి ఉన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ని అధికారంలోకి రానీయం అని సవాల్ చేస్తున్న వేళ ఆయన సీఎం పదవి మీదనే సందేహాలు వచ్చేలా సొంత పార్టీవారే ట్వీట్లు చేయడం కాంగ్రెస్ లో అయితే విడ్డూరం కాదు. మొత్తానికి ఈ పరిణామాలు బీఆర్ఎస్ కి ఎంతో ఆనందాన్ని కలిగించి ఉంటాయని అంటున్నారు.

Tags:    

Similar News